
Air Cooler Tips: ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రతీ ఇంట్లో ఇప్పుడు కూలర్లదే హవా. చాలామంది పక్కన పెట్టిన కూలర్లను ఇప్పుడు తీసి వాడే ప్రయత్నం చేస్తుంటారు. కానీ చాలారోజులుగా వాడకపోవడం, లేదా పాతగా అయిపోవడం వల్ల కూలర్ సరిగ్గా పనిచేయకపోవచ్చు. కానీ కొన్న చిన్న చిన్న చిట్కాలతో మీ పాత కూలర్‌ను కొత్తదానిలా మార్చుకోవచ్చు. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
కొన్నిసార్లు కూలర్‌లో పేరుకుపోయిన మురికి వల్ల అది పాతదిగా కనిపిస్తుంది. అందుకే దాన్ని సరిగ్గా శుభ్రం చేయాలి. ఇందుకోసం, కూలర్‌లోని నీటిని పూర్తిగా ఖాళీ చేసి క్లీన్ చేయాలి. ట్యాంక్‌లోని మురికిని బ్రష్ లేదా బట్టతో తొలగించి, ఆ తర్వాత మంచి నీటితో కడగాలి.
మీ కూలర్‌లోని పాత కూలింగ్ ప్యాడ్లను మార్చడం మంచిది. కూలర్ చల్లదనం అనేది చాలావరకు కూలింగ్ ప్యాడ్లపైనే ఆధారపడి ఉంటుంది. ప్యాడ్లు మరీ పాతబడినా లేదా దుమ్ము పట్టినా గాలి చల్లగా రాదు.
కూలర్ నుంచి గాలి తక్కువగా వస్తున్నా లేదా శబ్ధం ఎక్కువగా వస్తున్నా, దానికి కారణం మోటార్ లేదా ఫ్యాన్ కావచ్చు. ఫ్యాన్ రెక్కలను శుభ్రం చేసి, మోటార్‌పై కొద్దిగా నూనె వేయాలి. దీనివల్ల మోటార్ సరిగ్గా పనిచేసి, కూలర్ పనితీరు మెరుగుపడుతుంది.
కూలర్‌లోని వాటర్ పంప్‌ను చెక్ చేయాలి. పైపులో మురికి లేదా అడ్డంకులు ఉంటే, నీళ్లు ప్యాడ్ల వరకు చేరవు. దీంతో కూలింగ్ రాదు. కాబట్టి, పైపు, పంప్‌ను శుభ్రం చేయడం మర్చిపోవద్దు. అవసరమైతే, పంప్‌ను మార్చుకోవడం మంచిది.
నీళ్లు లీక్ కాకుండా ఉండడానికి ట్యాంక్‌కు పెయింట్ వేయవచ్చు. కూలర్‌లో మిగిలిన నీటిలో కొద్దిగా పటిక లేదా వేప నూనె కలపడం మంచిది. దీనివల్ల దుర్వాసన రాదు.
కూలర్‌ను సరైన చోట పెట్టాలి. తాజా గాలి లోపలికి వచ్చేలా కూలర్‌ను ఎప్పుడూ కిటికీ లేదా ఖాళీ ప్రదేశం దగ్గర ఉంచాలి. కూలర్‌ను మూసి ఉన్న గదిలో పెడితే, దాని కూలింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది.