భర్తకి కూడా రాఖీ కట్టొచ్చా..?

By ramya neerukondaFirst Published 25, Aug 2018, 2:33 PM IST
Highlights

జీవితాంతం తమకు రక్షణగా నిలవాలని కోరుతూ ఈ రాఖీ కడతారు. అయితే.. ఈ రాఖీని సోదరుడికే కాదు.. భర్తకి కూడా కట్టవచ్చంటుని పురాణాల్లో ఉందట.

‘‘రాఖీ’’.. ఈ పేరు వినగానే మనకు గుర్తుకువచ్చేది. అన్నా చెల్లెల్ల అనుబంధం. శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరం రాఖీ పండగను అందరం జరుపుకుంటాం. ఆడపిల్లలంతా.. తమ అన్నయ్య, తమ్ముళ్లకు రాఖీలు కడుతుంటారు. జీవితాంతం తమకు రక్షణగా నిలవాలని కోరుతూ ఈ రాఖీ కడతారు. అయితే.. ఈ రాఖీని సోదరుడికే కాదు.. భర్తకి కూడా కట్టవచ్చంటుని పురాణాల్లో ఉందట.

పూర్వం దేవతలకు - రాక్షసులకు మధ్య పుష్కరకాలం యుద్ధం సాగింది. ఆ యుద్ధంలో ఓడిపోయిన దేవతల రాజు దేవేంద్రుడు నిర్వీర్యుడై తన పరివారమంతటిని కూడగట్టుకుని 'అమరావతి'లో తలదాచుకుంటాడు. 
 
అట్టి భర్త నిస్సహాయతను గమనించిన ఇంద్రాణి 'శచీదేవి' తగు తరుణోపాయమునకై ఆలోచిస్తూ ఉన్న సమయాన ఆ రాక్షసరాజు చివరకు 'అమరావతి'ని కూడా దిగ్భంధన చేయబోతున్నాడు అని గ్రహించి, భర్త దేవేంద్రునకు 'సమరోత్సాహము' పురికొలిపినది. సరిగా ఆరోజు "శ్రావణ పూర్ణిమ" అగుటచేత 'పార్వతీ పరమేశ్వరులను', లక్ష్మీ నారాయణులను పూజించి ఆ పూజించబడిన "రక్షా" దేవేంద్రుని చేతికి కడుతుంది. 
 
అది గమనించిన దేవతలందరు వారు పూజించిన రక్షలు తెచ్చి ఇంద్రునకు కట్టి ఇంద్రుని విజయయాత్రకు అండగా నిలచి, తిరిగి 'త్రిలోకాధిపత్యాన్ని' పొందారు. ఆనాడు శచీదేవి ప్రారంభించిన 'ఆ రక్షాబంధనోత్సవం' నేడు అది 'రాఖీ' పండుగగా ఆచారమైందని పురాణాలు చెబుతున్నాయి. అలా రాఖీలు కట్టించుకున్న భర్తలు, సోదరులు భార్య లేదా సోదరికి నూతన వస్త్రాలు, చిరుకానుకలు సమర్పించి, అందరూ కలిసి చక్కని విందు సేవిస్తారని పురోహితులు అంటున్నారు. 
 
ఇకపోతే.. శ్రావణ పూర్ణిమ రోజున బ్రాహ్మణులు నూతన జంధ్యాలు ధరిస్తారు. ఈ రోజున బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతధారణలు చేసి విద్యార్థులకు వేదపఠనం ప్రారంభిస్తారు. 'జంధ్యాల పూర్ణిమ' అని పిలువబడే ఈ పండుగ కాలక్రమమున "రక్షాబంధన్ లేదా రాఖీ" పండుగగా ప్రాచుర్యం పొందింది.

Last Updated 9, Sep 2018, 1:04 PM IST