
చాలామందికి ఇంట్లో మొక్కలు పెంచాలని ఉంటుంది. కానీ స్థలం సరిగ్గా లేక వెనకడుగు వేస్తుంటారు. అయితే తక్కువ ప్లేస్ ఉన్నా, ఇంటిని అందమైన మొక్కలతో నింపేయవచ్చు. అందుకు వాటర్ ప్లాంట్స్ బెస్ట్ ఆప్షన్. సాధారణంగా వాటర్ ప్లాంట్స్ కి మట్టితో గానీ, ఎండతో గానీ పెద్దగా అవసరం ఉండదు. మరి మట్టి అవసరం లేని ఈ మొక్కలతో ఇంటిని ఎలా కొత్తగా అలంకరించుకోవాలో, తక్కువ స్థలాన్ని కూడా చక్కగా ఎలా వాడుకోవాలో కొన్ని సూపర్ ఐడియాస్ ఇక్కడ చూద్దాం.
వాటర్ ప్లాంట్లతో గోడల్ని డెకరేట్ చేయడానికి ఫోటో ఫ్రేమ్‌లను వాడుకోవచ్చు. ఒక చెక్క ఫోటో ఫ్రేమ్ తీసుకొని, దానికి సన్నని మెటల్ జాలీని అమర్చాలి. ఇప్పుడు ఆ ఫ్రేమ్‌లో గాజు సీసాల్లో నీళ్లు పోసి రకరకాల మొక్కలను పెట్టొచ్చు. ఇంకా అందంగా కనిపించడానికి దానితో పాటు లైటింగ్ కూడా సెట్ చేయవచ్చు. లైట్లు వేసినప్పుడు ఆ మొక్కలు మరింత బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయి.
వాటర్ ప్లాంట్లను గోడకు వేలాడదీయడానికి జ్యూట్ తాడు (గోనె తాడు) ఒక మంచి ఆప్షన్. ఒక చెక్కను గోడకు తగిలించి, దానికి గాజు బాటిళ్లలో మొక్కలు పెట్టి వేలాడదీయాలి. లివింగ్ రూమ్‌లో ఇలాంటి డెకరేషన్ ఉంటే దాని అందం రెట్టింపు అవుతుంది. డిజైనర్ జ్యూట్ తాళ్లను వాడితే లుక్ ఇంకా బాగుంటుంది.
మార్కెట్లో దొరికే చిన్న చిన్న వాల్ ప్లాంటర్లను కూడా వాడుకోవచ్చు. గదిలో ఒకే లైన్‌లో లేదా గ్రిడ్ ప్యాటర్న్‌లో ఈ ప్లాంటర్లను అమర్చి, వాటిలో నీటి మొక్కలను పెట్టి చూడండి. చాలా సింపుల్‌గా, నీట్‌గా ఉంటుంది.
మొక్కను ఒక కుండీలో పెట్టి, దాని తీగను గోడపై పాకించవచ్చు. ఆ తీగకు సపోర్ట్‌గా చిన్న క్లిప్పులు లేదా వైర్ వాడచ్చు. ఆ వైర్‌తో మీకు నచ్చిన ఆకారంలో అంటే హార్ట్ షేప్, సర్కిల్ లేదా అలల వంటి డిజైన్లు క్రియేట్ చేయవచ్చు. ఇది సింపుల్ రూమ్‌కు కూడా మోడ్రన్ లుక్ ఇస్తుంది.
చేతితో అల్లిన మాక్రేమ్ హోల్డర్లు ఇంటికి బోహో, ఎస్తెటిక్ లుక్ ఇస్తాయి. లివింగ్ రూమ్‌లోనే కాదు, బెడ్‌రూమ్ లేదా కిటికీ దగ్గర కూడా ఈ వాటర్ ప్లాంట్లను ఇలా అందంగా పెట్టుకోవచ్చు. కావాలంటే ఇదే స్టైల్‌లో మట్టి మొక్కలను కూడా కుండీలలో పెట్టి అలంకరించుకోవచ్చు.