
పూర్వకాలంలో ఇళ్లలో ఫ్రిడ్జ్‌లు లేనప్పుడు మట్టి కుండలను ఉపయోగించేవారు. ఇవి కరెంట్, ఐస్ లేకుండానే నీటిని చల్లగా ఉంచేవి. కుండలో నీళ్ళు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మళ్లీ పాత విధానాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకొని జనం వాటిని పాటించేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే వేసవిలో ఎక్కువ మంది మట్టి కుండలో నీటిని తాగుతున్నారు. కుండ కొనడం నుండి నీళ్ళు చల్లబరచడం వరకు కొన్ని ప్రత్యేక చిట్కాలు ఉన్నాయి. వీటిని ఫాలో అయితే చల్లని, ఆరోగ్యకరమైన నీటిని తాగొచ్చు.
కుండ కొనడానికి వెళ్ళినప్పుడు దాన్ని కొట్టి చూడండి. దాని నుండి డప్పులా శబ్దం వస్తే ఆ కుండ నీళ్ళు చల్లబరచడానికి మంచిదని అర్థం.
పాత కుండను శుభ్రం చేయడమైనా, కొత్తదైనా, మట్టి కుండ లోపలి పొరను చేతితో తాకి శుభ్రం చేయకూడదు. ఇలా చేస్తే ఆ కుంట నీళ్ళను చల్లబరచదు. మీరు చేతితో తాకకుండా జస్ట్ నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది.
మట్టి కుండలో చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. వీటిని శుభ్రం చేయడం ముఖ్యం. దీని కోసం ముందుగా మీరు కుండలో నీళ్ళు నింపి, దాన్ని అర బకెట్ నీళ్ళలో పెట్టి 15-20 గంటలు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల కుండ రంధ్రాలు తెరుచుకుంటాయి.
రంధ్రాలు తెరుచుకున్న తర్వాత ఉప్పుతో కుండను శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల నీళ్ళు మరింత చల్లగా అవుతాయి. ఉప్పు రేణువులు పోయేంత వరకు కుండను 3-4 సార్లు కడగాలి. తర్వాత తాగే నీళ్ళు నింపండి.
ఉప్పుతో నీళ్ళు చల్లబడతాయి. అయితే మీరు మరింత చల్లటి నీళ్ళు కోరుకుంటే, కుండ పైన మట్టి గిన్నెలో కొంచెం నీళ్ళు పోసి, కుండను తడిగుడ్డతో చుట్టండి. నలుపు లేదా పసుపు రంగు గుడ్డను ఉపయోగించకూడదు. లేకుంటే నీళ్ళు చల్లబడవు.