
బంగారం ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లోహంగా మారుతోంది. ఎంతోమంది బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. భారతదేశంలో ఇక బంగారం కొనుగోళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి స్త్రీకి బంగారు ఆభరణాలు ధరించాలన్న కోరిక అధికంగా ఉంటుంది. వారి కోరికను తీర్చడం కోసం అయినా కూడా మగవారు బంగారాన్ని కొనాల్సిందే. అంతే కాదు ఇప్పుడు బంగారం ఆర్థిక భద్రతను కూడా అందిస్తోంది. అయితే మీరు కొన్న బంగారం మంచిదైతేనే అది మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. అదే నకిలీదైతే ఎలాంటి ఉపయోగం లేదు. మీరు కొన్న బంగారం నకిలీదో మంచిదో తెలుసుకోవడానికి కొన్నిదేశీ పద్ధతులు ఉన్నాయి.
ఇప్పుడు బంగారం ధర లక్షను దాటేస్తోంది. తులం బంగారం కొనడానికి కూడా సాధారణ ప్రజానీకం ఎంతో కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి బంగారం మంచిదై ఉండాలి. మీరు కొన్న బంగారం నకిలీదో మంచిదో ఇలా గుర్తించండి.
మనదేశంలో స్వచ్ఛమైన బంగారు ఆభరణాలపై BIS హాల్ మార్క్ ఉంటుంది. ఇది చిన్న ముద్రలో లోగోలాగా వస్తుంది. స్వచ్ఛమైన బంగారు ఆభరణాలకే ఇలాంటి గుర్తింపు లభిస్తుంది. కాబట్టి మీరు కొన్న బంగారాలంపై BIS హాల్ మార్క్ ఉందో లేదో గుర్తించండి.
వెనిగర్ తో కూడా బంగారం స్వచ్ఛతను కనిపెట్టవచ్చు. ఇందుకోసం మీరు బంగారు ఆభరణాలపై కొన్ని చుక్కల తెల్ల వెనిగర్ ను వేయండి. లేదా ఒక గిన్నెలో వెనిగర్ వేసి.. ఆ వెనిగర్లో బంగారు ఆభరణం మునిగిపోయేటట్టు ఉంచండి. అలా 15 సెకన్ల పాటు ఉంచండి. బంగారం నిజమైనదే అయితే దాని రంగు మారకుండా స్వచ్ఛంగా అలా ఉంటుంది. అలా కాకుండా అక్కడక్కడ నల్లగా మారుతూ ఉంటే అది స్వచ్ఛమైనది కాదని అర్థం.
ఒక గిన్నెలో నిండుగా నీరు వేయండి. ఇప్పుడు బంగారు ఆభరణాలను తీసుకొని అందులో వేయండి. బంగారం స్వచ్ఛమైనది అయితే అది మునిగిపోతుంది. నకిలీదైతే కొంత సమయం పాటు తేలి ఆ తర్వాతే మునుగుతుంది.
నిజమైన బంగారాన్ని అయస్కాంతంతో గుర్తించవచ్చు. మీరు ఒక అయస్కాంతాన్ని తీసుకొని బంగారు ఆభరణం మీద పెట్టండి. అది అయస్కాంతంతో ఎటువంటి చర్య జరపకుండా, అతుక్కోకుండా ఉంటే అది స్వచ్ఛమైన బంగారమని అర్థం. అలా కాకుండా అయస్కాంతం ఆ బంగారం వైపుగా లాగుతున్నట్టు అనిపిస్తే ఇతర లోహాలు కూడా కలిశాయని అర్థం. అది స్పష్టంగా కల్తీ బంగారం అని చెప్పవచ్చు.
స్వచ్ఛమైన బంగారాన్ని వేసుకుంటే మీ చర్మంపై ఎలాంటి రియాక్షన్ రాదు. అలా కాకుండా బంగారు ఆభరణాలు వేసుకున్న 24 గంటల తర్వాత మీ చర్మం దురద పెట్టడం, రంగు మారడం వంటివి అనిపిస్తున్నా.. అక్కడ చర్మం ఆకుపచ్చగా మారినా ఆ బంగారం నకిలీదని అర్థం. పైన బంగారం పూత పూసి లోపల ఇతర లోహాలు కలిసిన అని అర్థం చేసుకోవాలి.