చాలా మంది మందు తాగినప్పుడే విపరీతంగా మాట్లాడుతుంటారు. గొడవకు దిగుతుంటారు. కానీ అది దిగిన తర్వాత ఎవరైనా అడిగితే నేనేం మాట్లాడిన ఏదీ మాట్లాడలే. నాకు ఏదీ గుర్తుకు లేదని చెప్తుంటారు. అసలు ఇది నిజమేనా? కాదా? అన్న సంగతి తెలుసుకుందాం పదండి.
నిజానికి చిన్న పెగ్గు కూడా ఆరోగ్యానికి మంచిది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆల్కహాల్ ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుంది. తక్కువైనా, ఎక్కువైనా ఆరోగ్యాన్ని పాడుచేస్తుందని ఎన్నో పరిశోధనలు వెల్లడించాయి. మీకు తెలుసా? మందు మీ శరీరంలోకి వెళ్లిన వెంటనే దాని ప్రభావాన్ని చూపించడం మొదలుపెడుతుంది. ఆల్కహాల్ తాగిన తర్వాత మీ మెదడు కూడా ఎన్నో విధాలుగా ప్రభావితం అవుతుంది. కొంతమంది మందు మత్తులో ఏడిస్తే.. మరికొందరు నవ్వుతారు. కొంతమంది ఇంగ్లీష్, హిందీ అంటూ వచ్చిన భాషలను మాట్లాడుతుంటారు. ఇంకొంతమంది తమ కోపాన్నంతా, మనసులోని మాటలన్నింటినీ బయట పెడతారు. చాలా మందికి మందు మత్తులో ఏం చెప్పారో కూడా గుర్తుండదు. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?
ఆల్కహాల్ మీ శరీరంలోకి వెళ్లినప్పుడు ఇది వెంటనే మీ కడుపు పొర ద్వారా రక్తప్రవాహంలోకి వెళుతుంది. అక్కడి నుంచి శరీరంలోని అన్ని కణజాలాలకు చేరుతుంది. మీకు తెలుసా? ఆల్కహాల్ మెదడుకు చేరడానికి జస్ట్ 5 నిమిషాలు మాత్రమే పడుతుందట. 10 నిమిషాల్లోనే మందు తన ప్రభావాన్ని చూపించడం మొదలుపెడుతుంది.
మందు తాగిన తర్వాత సంకోచం, బిడియం చాలా తగ్గుతాయని ఓ పరిశోధనలో వెల్లడైంది. అందుకే వీళ్లు నిర్మొహమాటంగా మాట్లేడేస్తారు. వాళ్లకు వచ్చీ రాని బాషలున్నా వాటిని కూడా సిగ్గు పడకుండా మాట్లాడుతారట. చాలాసార్లు తాగిన తర్వాత ఇంగ్లీషు మాట్లాడటం మీరు చూసే ఉంటారు.
ఎవరైన మందును ఎక్కువగా తాగినప్పుడు అతని మెదడులో ఆల్కహాల్ సంబంధిత బ్లాక్ అవుట్లు సంభవించడం ప్రారంభిస్తాయి. దీనివల్ల వాళ్లకు ఆ టైంలో జ్ఞాపకశక్తిలో అంతరం ఉండొచ్చు. అంటే ఈ టైంలో వారు మాట్లాడింది వారికి తర్వాత గుర్తు ఉండకపోవచ్చు.
ఎవరైనా మందును ఎక్కువగా తాగినప్పుడు మాత్రమే ఈ అంతరాలు సంభవిస్తాయిని నిపుణులు చెబుతున్నారు. మందు తాగినప్పుడు మాట్లాడే మాటలు అప్పటి వరకు మాత్రమే గుర్తుంటాయి. ఇవి దీర్ఘకాలం పాటు గుర్తు ఉండవని నిపుణులు చెబుతున్నారు. అంటే మద్యం మత్తులో మాట్లాడి మత్తులోకి జారుకున్నప్పుడు ఆ విషయాలు మరచిపోతారు.
మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్లు తమను తాము నియంత్రించలేరు. పరిగడుపున మద్యం సేవించినా, ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తాగినా, యాంటీ డిప్రెసెంట్ మందులు వాడుతున్నా ఆల్కహాల్ త్వరగా పెరిగి బ్లాక్అవుట్ అవకాశాలు పెరుగుతాయి.