
ఆధునిక కాలంలో కొత్త కొత్త ఐడియాలకు, ఆవిష్కరణలకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ఇప్పుడు ఓ స్కూల్ విద్యార్థి చేసిన ఆవిష్కరణ వైరల్ అవుతోంది. అందులోనూ స్కూలు విద్యార్థి ప్రతి ఇంట్లో అవసరమైన వస్తువును కనిపెట్టాడు. బట్టలు ఉతకడానికి వాషింగ్ మెషిన్ వచ్చాక ఆడవాళ్ల పని చాలా వరకు తగ్గింది. కానీ ఆరబెట్టిన బట్టలను మడతబెట్టడం మాత్రం భారంగా అనిపిస్తోంది. ఆ భారాన్ని తగ్గించడానికే బట్టలు మడతబెట్టే మెషీన్ కనిపెట్టాడు ఓ పిల్లాడు.
ఓ స్కూలు విద్యార్థి తయారుచేసిన దుస్తులు మడతపెట్టే యంత్రం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఆ పిల్లాలు ఏ రాష్ట్రానికి చెందినవాడో, వివరాలేంటో మాత్రం తెలియ రాలేదు. ఈ వీడియో చూసి చాలామంది తెగ షేర్లు చేస్తున్నారు. ఆ వీడియోలో, స్కూల్ యూనిఫాంలో ఉన్న ఒక విద్యార్థి, బట్టలను వేగంగా ఎలా మడతపెట్టవచ్చో చేసి చూపిస్తున్నాడు. ఫ్లాట్ బోర్డులు, మడతబందులు (hinges), ఒక లివర్ సిస్టమ్ లాంటి సింపుల్ వస్తువులతో ఈ మెషిన్‌ను తయారుచేశాడు. బట్టలను పర్ఫెక్ట్‌గా మడతపెట్టేందుకు ఇందులో ఎడమ, కుడి, కింది వైపు మూడు ప్యానెల్స్ ఉన్నాయి. ఇవి ఒక పద్ధతి ప్రకారం కదులుతాయని వీడియోలో చెబుతున్నాడు ఆ పిల్లాడు. ఆ వీడియోలో ఒక షర్ట్‌తో పాటు, ఒక పంచెను కూడా ఆ విద్యార్థి మడతపెట్టి చూపించాడు. ముందుగా సైడ్ ప్యానెల్స్‌ను లోపలికి తిప్పితే షర్ట్ చేతులు, సైడ్స్ మడతపడతాయి. ఆ తర్వాత కింది ప్యానెల్‌ను పైకి అంటే చాలు.. బట్టలు నీట్‌గా, చతురస్రాకారంలోకి మడతపడిపోతాయి. ఇదంతా చాలా తక్కువ టైంలోనే జరిగిపోయింది. ఈ మెషీన్ ఇంట్లో ఉంటే చకచకా దుస్తులు మడతబెట్టేయచ్చు.
ఈ కొత్త మెషీన్ ఆవిష్కరణ చూసి సోషల్ మీడియా యూజర్లు ఫిదా అయ్యారు. "టైమ్ సేవ్ చేసే మరో మెషీన్ వచ్చేసింది" అని ఒకరు కామెంట్ చేశారు. స్కూల్ స్టూడెంట్ ఇలాంటి అద్భుతమైన ఆవిష్కరణ చేశాడా? అంటూ ఎంతో మంది ఆశ్చర్యపడుతూ మెసేజులు పెడుతున్నారు.కొత్త ఐడియాలు ఎప్పుడూ పెద్ద పెద్ద కంపెనీలు, ఫ్యాన్సీ ల్యాబ్‌ల నుంచే రావాల్సిన అవసరం లేదని, సామాన్యులు, విద్యార్థుల నుంచి కూడా పుట్టుకొస్తాయని ఈ సంఘటన నిరూపించిందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.