
పసుపులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా పచ్చి పసుపు వాసన, రంగు చాలా బాగుంటాయి. వంటలకు, రోగనిరోధానికి, చర్మ సౌందర్యానికి దీన్ని విరివిగా వాడతారు. అలాంటి పచ్చి పసుపు పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవాలంటే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు.
మార్కెట్ నుంచి పచ్చి పసుపు కొమ్ములు తెచ్చాక, వాటిని కొళాయి కింద పెట్టి బాగా కడగాలి. దీనివల్ల వాటిపై ఉన్న దుమ్ము, మట్టి, సూక్ష్మక్రిములు పోతాయి. కడిగాక, తడి లేకుండా శుభ్రమైన బట్టతో తుడిచి పూర్తిగా ఆరబెట్టాలి.
పసుపు కొమ్ములు పూర్తిగా ఆరిన తర్వాత, గాలి చొరబడని డబ్బాలో పెట్టి మూత బిగించాలి. వెలుతురు, తేమ తగలని చోట ఈ డబ్బాను ఉంచడం చాలా ముఖ్యం.
పొడి చేసి నిల్వ చేసుకోవచ్చు
పచ్చి పసుపును నెలల తరబడి వాడుకోవాలంటే పొడి చేసి పెట్టుకోవడం ఉత్తమమైన మార్గం. పసుపు కొమ్ముల తొక్క తీసి, చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. వాటిని కొన్ని రోజుల పాటు ఎండలో బాగా ఆరబెట్టాలి. పూర్తిగా ఎండిన తర్వాత, మెత్తగా పొడి చేసి గాలి చొరబడని డబ్బాలో భద్రపరుచుకుంటే నెలల పాటు తాజాగా ఉంటుంది.
నూనెలో ఊరబెట్టొచ్చు
నూనె వాడి కూడా పచ్చి పసుపును ఎక్కువ రోజులు తాజాగా ఉంచొచ్చు. పసుపును శుభ్రంగా కడిగి, ఆరబెట్టి, చిన్న ముక్కలుగా తరగాలి. ఒక గాజు సీసాలో కొద్దిగా నూనె తీసుకుని, అందులో ఈ పసుపు ముక్కలు వేయాలి. గాలి చొరబడకుండా మూత పెట్టి, చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి.
ఫ్రీజర్‌లో పెట్టేయండి
పసుపును చాలా కాలం పాటు నిల్వ చేయాలంటే ఫ్రీజర్‌లో పెట్టడం మంచి పద్ధతి. పసుపు కొమ్ములను ముక్కలుగా కోసి గానీ లేదా మొత్తంగా గానీ ఫ్రీజ్ చేయవచ్చు. వీటిని కూడా గాలి చొరబడని డబ్బాలో లేదా జిప్‌లాక్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రీజర్‌లో ఉంచితే సరిపోతుంది.