పండోరా పేపర్లు: బట్టబయలైన సంపన్న ప్రపంచ నేతల అసలు రూపం

By telugu teamFirst Published Oct 4, 2021, 11:28 AM IST
Highlights

పన్ను ఎగవేతకు స్వర్గదామాలుగా పేర్కొంటున్న దేశాల్లో డొల్ల కంపెనీలు, ట్రస్టులు ఏర్పాటు చేసి ప్రముఖ రాజకీయ నేతలు, దేశాధినేతలు, సంపన్నులు తమ సంపదను రహస్యంగా దాచుకోవడం లేదా స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఇతర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు పండోరా పేపర్లు వెల్లడించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనుయాయులు మొదలు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్ మంత్రుల వరకు ఈ అక్రమార్గాల్లో ఉన్నట్టు వెల్లడించాయి.

న్యూఢిల్లీ: పండోరా పేపర్లు సంపన్న నేతల అసలు రూపాన్ని బట్టబయలు చేసింది. అంతర్జాతీయ నేతలు తమ సంపదను కూడబెట్టుకోవడంలో అక్రమదారులను తొక్కిన విధాన్ని బహిర్గతం చేసింది. అంతర్జాతీయ జర్నలిస్టుల కూటమి ఏళ్లుగా పరిశోధనలు చేసి పండోరా పేపర్లను వెల్లడించారు. 14 అంతర్జాతీయ ఫైనాన్స్ సర్వీసెస్ కంపెనీల నుంచి లీకైన సుమారు 1.19 కోట్ల డాక్యుమెంట్లను పరిశీలించి అక్రమార్కుల జాబితాను ప్రకటించారు. 

పన్ను ఎగవేతదారులకు ఆస్కారమున్న దేశాల్లో డొల్ల కంపెనీలు, ట్రస్టుల రూపంలో సంపదను రహస్యంగా భద్రపరుచుకున్నవారి పేర్లను వెల్లడించారు. ఇందులో అంతర్జాతీయంగా ఫేమస్ అయిన సుమారు 330 మంది నేతల పేర్లుండటం కలకలం రేపుతున్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సన్నిహితులు మొదలు.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్ మంత్రులూ ఈ పేపర్లలో ఉన్నారు. పనామా, దుబాయ్, మొనాకో, స్విట్జర్లాండ్, కేమన్ ఐలాండ్స్, బ్రిటీష్ వర్జిన్ ఐలాండ్స్ వంటి దేశాల్లో గుట్టుగా ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

బ్రిటీష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ పేరు కూడా లీక్ అయిన పేపర్లలో ఉన్నది. టోనీ బ్లెయిర్, ఆయన భార్య చెరీలు తప్పుడు మార్గంలో ఓ భవంతిని కొనుగోలు చేసి  3,12,000 పౌండ్‌ల పన్నును తప్పించుకున్నట్టు ఈ పత్రాలు వెల్లడించాయి. లండన్ టౌన్‌హౌజ్‌ను 6.45 మిలియన్ పౌండ్లు పెట్టి కొనుగోలు చేశారు. దీన్ని నేరుగా కొనుగోలు చేయలేదు. ఆ భవంతిని కలిగి ఉన్న ఓ విదేశీ సంస్థను కొనుగోలు చేశారు. తద్వార భవంతిని కొనుక్కున్నారు. దీని ద్వారా స్టాంప్ డ్యూటీల కింద 3.12లక్షల పౌండ్‌లు తప్పించుకున్నారు.

జోర్డాన్ కింగ్ అబ్దుల్లా కాలిఫోర్నియా, మాలిబు, వాషింగ్టన్, లండన్‌లలో 100 మిలియన్ డాలర్ల సంపదను ఇలా పన్నుఎగవేతదారులకు అవకాశమున్న దేశాల్లో కంపెనీలు స్థాపించి కొనుగోలు చేసినట్టు తేలింది. గోప్యత పాటించడానికే ఈ కంపెనీల పేర్లతో సంపద కొనుగోలు చేసినట్టు ఆయన న్యాయవాది అన్నారు. అదంతా ఆయన వ్యక్తిగత సొమ్మేనని తెలిపారు. చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి ఆంద్రెస్ బాబిస్ మరో వారం రోజుల వ్యవధిలో ఎన్నికలకు వెళ్లనున్నారు. విదేశీ కంపెనీలో పెట్టుబడులు పెట్టి దక్షిణ ఫ్రాన్స్‌లో 22 మిలియన్ డాలర్లతో కొనుగోలు చేసినట్టు ప్రకటించలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇందులో నేరుగా పేర్కొనలేదు. కానీ, ఆయన అనుయాయులు మొనాకోలో సంపదను రహస్యంగా భద్రపరిచినట్టు పేపర్లు వెల్లడించాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్ మంత్రులు, వారి కుటుంబీకులు రహస్యంగా విదేశీ కంపెనీలను కలిగి ఉన్నట్టు తెలిసింది. ఇవి మిలియన్ డాలర్ల విలువైనవి కావడం గమనార్హం. కెన్యా అధ్యక్షుడు ఉహురు కెన్యట్టా, ఆయన ఆరుగురు కుటుంబీకులు ఓ విదేశీ కంపెనీల నెట్‌వర్క్‌నే రహస్యంగా మెయింటెయిన్ చేస్తున్నారు. 

డొల్ల కంపెనీలు వ్యవస్థాపించి దాని కార్యకలాపాలు జరుగుతున్నట్టు పేపర్‌లలో పేర్కొంటారు. నిజానికి దాని కార్యలాపాలేవీ ఉండవు. దీనిలో పెట్టుబడులు పెట్టినట్టు చూపెట్టడం లేదా.. ఇతర ఆస్తులను ఈ కంపెనీల ద్వారా కొనుగోలు చేయడం లేదా.. ఇతర అక్రమమార్గాలను అనుసరించి ‘పన్ను బెడద’ను తప్పించుకుని సంపద కూడబెట్టుకుంటున్నారు. లేదా సంపదను దాచుకుంటున్నారు.

click me!