ఇజ్రాయెల్ నుంచి వచ్చే ఒక్కో బాంబ్‌కు ఒక్కో బందీని చంపేస్తాం: హమాస్ వార్నింగ్

By Mahesh K  |  First Published Oct 10, 2023, 2:02 PM IST

గాజాలోని పాలస్తీనియన్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ నుంచి ముందస్తు హెచ్చరిక లేకుండా వచ్చే ఒక్కో బాంబ్‌కు ఒక్కో బంధీని చంపేస్తామని హామాస్ హెచ్చరించింది. హమాస్ ప్రతినిధి అబు ఉబైదా ఈ వార్నింగ్ ఇచ్చాడు.
 


న్యూఢిల్లీ: సుమారు 150 మంది ఇజ్రాయెలీలను బంధీలుగా పెట్టుకుని పాలస్తీనియన్ సాయుధ గ్రూపు హమాస్ శత్రుదేశానికి వార్నింగ్ వచ్చింది. ముందస్తు హెచ్చరికలు చేయకుండా ఇజ్రాయెల్ నుంచి వచ్చి గాజాలోని పాలస్తీనియన్ల ఇంటిపై పడే ఒక్కో బాంబ్‌కు ఒక్కో బంధీని చంపేస్తామని హెచ్చరించింది.  ఈ రెండింటి మధ్య యుద్ధం తీవ్రతరమైంది. కనుచూప మేరలో దీనికి అంతం కనిపించడం లేదు. ఇప్పటి వరకు కనీసం 1600 మంది మరణించినట్టు కథనాలు వచ్చాయి.

శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ సరిహద్దు దాటి చొచ్చుకు వెళ్లిన హమాస్ సాయుధులు సరిహద్దు ప్రాంతాల్లోని సుమారు 150 మంది ఇజ్రాయెలీలను బంధీలుగా పట్టుకుని వెనక్కి తెచ్చుకుంది. సరిహద్దు పట్టణాలు, కిబ్బుట్జిమ్ నుంచి వీరిని తీసుకెళ్లింది.

Latest Videos

undefined

‘హెచ్చరిక లేకుండా మా వారిని లక్ష్యం చేసుకునే ఒక్కో బాంబ్‌ చొప్పున తమ వద్ద బంధీలుగా ఉన్న ఒక్కో పౌరుడిని హతమారుస్తాం’ అని హమాస్ ప్రతినిధి అబు ఉబైదా వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పటికే నలుగురు బంధీలు మరణించారని, ఆ నలుగురూ ఇజ్రాయెలీ వైమానిక దాడులు జరుపుతుండగానే హత్యకు గురైనట్టు కొన్ని కథనాలు తెలిపాయి.

హమాస్ దాడులకు భారీ దాడితో ప్రతీకారం తీర్చుకుంటామని ఇజ్రాయెల్ భావిస్తున్నది. యుద్ధ రంగానికి సుమారు మూడు లక్షల మంది సైనికులను ఇజ్రాయెల్ పిలిచింది. ఈ సందర్బంలో ఇజ్రాయెల్ దేశానికి ఈ బంధీలు ప్రతిబంధకంగా మారుతున్నారు. ఇప్పటి వరకైతే ప్రజాభిప్రాయం ఇజ్రాయెల్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నది. ప్రతిపక్షాలు సహా అందరూ హమాస్ పై ప్రతీకారేచ్ఛతో ఉన్నారు.

Also Read: గాజా సరిహద్దుపై పట్టు సాధించిన ఇజ్రాయెల్.. 1500 మంది హమాస్ దళాల మృతదేహాలు లభ్యం

అయితే, బంధీలను సురక్షితంగా వెనక్కి తీసుకురాకుంటే మాత్రం ఇజ్రాయెల్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వస్తుందని కొందరు నిపుణులు చెబుతున్నారు. పౌరుల భద్రతను ప్రాధాన్యాంశంగా తీసుకోలేదని, తమను కాపాడటంలో ఎన్నికైన ప్రభుత్వం విఫలమైందనే అభిప్రాయం ప్రజల్లో వస్తుందని అంటున్నారు. ఒక వేళ బంధీలను రక్షించలేకపోతే రాజకీయ నాయకుల్లోనూ సైన్యంలోనూ ఉద్రిక్తతలు నెలకొనే ముప్పు ఉంటుందని ఊహిస్తున్నారు. 

కాగా టెల్ అవీవ్‌కు చెందిన కోబి మైఖేల్ పరిశోధకుడు మాత్రం ఇందుకు భిన్న వాదన చేశాడు. బంధీలు ప్రధమ ప్రాధాన్యం కాజాలరని, హమాస్‌ను ఓడించే క్షణం వరకు బంధీలు ప్రధానం కాదనీ అన్నాడు. 

నెతన్యాహూ సోమవారం హమాస్ పై యుద్ధాన్ని ప్రకటించారు. హమాస్ ఐఎస్ఐఎస్ వంటిదని, పిల్లలను అత్యంత క్రూరంగా పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. గాజాకు విద్యుత్, ఆహారం, నీరు, గ్యాస్ వంటివేవీ అందకుండా దిగ్బంధించాలని ఇజ్రాయెల్ రక్షణమంత్రి యోవ్ గాల్లాంట్ సోమవారం ఆదేశించారు.

click me!