
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ప్రొ-పాకిస్థాన్ వైఖరిని బయటపెట్టుకున్నారు. భారత్, పాకిస్థాన్ మధ్య యుద్ధ పరిస్థితిని తానే అదుపు చేశానని గతంలో అనేకసార్లు చెప్పిన ట్రంప్, పాకిస్థాన్ పట్ల తన అభిమానాన్ని తాజాగా మరోసారి వ్యక్తం చేశారు.
ట్రంప్ బుధవారం మధ్యాహ్నం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్‌ను స్వయంగా కలిశారు. వైట్‌హౌజ్‌లోని క్యాబినెట్ గదిలో వీరి మధ్య విందు భేటీ జరగడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. అమెరికాలాంటి దేశ అధ్యక్షుడు ఒక ఆర్మీ అధికారికి విందుకు ఆహ్వానించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇదొక అరుదైన సంఘటన అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా ఈ సమావేశం ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో జరగడం గమనార్హం. పాకిస్థాన్‌కు ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న నేపథ్యంలో అమెరికా ఈ సంబంధాలను సమీక్షించేందుకు ట్రంప్ ఈ భేటీ ఏర్పాటు చేసినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మునీర్‌తో సమావేశం పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడిన ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చకుండా అడ్డుకున్నందుకు మునీర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. యుద్ధం రాకుండా అడ్డుకున్నందుకు మునీర్‌కు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు.
పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దల ప్రమేయం లేకుండా మునీర్ ఈ సమావేశానికి హాజరవడంప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్‌లో విమర్శలు వస్తున్నాయి. ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వ్యక్తికి ట్రంప్ ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ఏంటి అంటూ విమర్శిస్తున్నారు. ఇది అమెరికా ద్వంద్వ బుద్ధికి నిదర్శనం అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ట్రంప్‌కు పాకిస్థాన్ అంటే అంత ప్రేమ ఎందుకు అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
ప్రపంచంపై ఆధిపత్యం కోసం అమెరికా ప్రయత్నం చేస్తుందనేది బహిరంగ రహస్యం. ఈ క్రమంలోనే సౌత్ ఏషియాలో తన మిత్ర దేశంగా పాక్‌ను ఎంచుకుంది. దీనికి కారణం చైనా అమెరికాకు మిత్ర దేశం కాదు. అలాగే భారత్ అమెరికా విషయంలో స్నేహపూర్వకంగా ఉన్నా. అమెరికా చెప్పినవన్ని చేయదు. దీంతో పాకిస్థాన్‌ను అమెరికా కీలక భాగస్వామిగా భావిస్తుంది.
ట్రంప్ అధ్యక్ష కాలంలో అమెరికా అఫ్ఘానిస్తాన్ నుంచి సైనిక ఉపసంహరణ చేపట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తాలిబాన్‌తో చర్చలు, ఒప్పందాల కోసం పాకిస్థాన్ సహకారం అవసరం అయ్యింది. అప్పుడు ట్రంప్ పాకిస్థాన్‌ను "గుడ్ ఫ్రెండ్"గా అభివర్ణించారు.
పాకిస్తాన్‌లో ఖనిజ సంపద విరివిగా ఉంది. ముఖ్యంగా అక్కడకి చెందిన తాంబెరు, బంగారు, లిథియం వంటి ఖనిజాలు గణనీయంగా ఉన్నాయి. ఈ వనరులు విదేశీ పెట్టుబడులను ఆకర్షించే భారీ అవకాశాన్ని కలిగి ఉన్నాయి. ముఖ్యంగా కీలక పరిశ్రమలకు అవసరమైన ఖనిజాల అవసరం పెరుగుతున్న నేపథ్యంలో, అమెరికా కంపెనీలు పాకిస్తాన్‌లోని ఈ అన్వేషించని ఖనిజ వనరులపై ఆసక్తిని చూపుతున్నాయి. ఈ రెండు దేశాల మైత్రికి ఇది కూడా ఒక కారణం కావొచ్చు. ఇదే విషయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వర్ తన యూట్యూబ్ ఛానల్ లో పంచుకున్న వీడియోలో ప్రస్తావించారు.
ఇరాన్–ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కూడా అమెరికా, పాక్ స్నేహానికి ఒక కారణంగా అభిప్రాయపడుతున్నారు. ఇజ్రాయెల్–ఇరాన్ వివాదాల్లో పాక్‌ను మధ్యవర్తిగా ఉపయోగించుకోవాలని పాక్ భావిస్తోంది.