
న్యూఢిల్లీ: కరోనా కారణంగా కాలేజీ చదువులు చాలా వరకు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా చైనాలో చదువుతున్న భారత విద్యార్థులు మన దేశానికి వచ్చిన తర్వాత తిరిగి అక్కడికి వెళ్లే పరిస్థితే లేకపోయింది. కరోనా కారణంగా విదేశీ పౌరులను తమ దేశంలోకి అడుగుపెట్ట వద్దని చైనా కఠిన చర్యలు తీసుకుంది. అప్పటికే సొంత దేశం వెళ్లిన విద్యార్థలు వీసాలను రద్దు చేసింది.
చైనాలో సుమారు 23 వేల మంది భారతీయులు విద్యార్థులు చదువుతున్నారు. అందులో చాలా వరకు మెడిసిన్స్‌నే చదువుతారు. కానీ, కరోనా కారణంగా భారత్‌కు ఆ విద్యార్థులు వచ్చిన తర్వాత.. మళ్లీ వారిని వెనక్కి తీసుకోవడానికి వీసాలను ఆ దేశం అంగీకరించలేదు. చైనా విదేశాంగ శాఖపై ఈ విషయమై ఒత్తిడి వస్తున్నది. ఈ నేపథ్యంలోనే అటువైపుగా సానుకూల అడుగులు వేసింది.
గ్లోబల్ బిజినెస్ లీడర్లతో ప్రీమియర్ లీ కెకియాంగ్ నెట్‌లో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించారు. విదేశీ అంతర్జాతీయ విమానాల ట్రావెల్‌పై ఉన్న ఆంక్షలను క్రమంగా తొలిగిస్తామని తెలిపారు. త్వరలోనే వీటి చుట్టూ అల్లుకున్న ఇతర పనులు కూడా ఎంచక్కా చేసుకోవచ్చు.
వీసాల రద్దు కారణంగా స్వదేశం తిరిగి వచ్చిన భారతీయ విద్యార్థులు మళ్లీ చైనా వెళ్లలేకపోయారు. అంటే సుమారు 23 వేల భారతీయ విద్యార్థులు తిరిగి చైనాకు వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెంబిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు సంబంధించి ఇప్పటికే తాము స్పష్టంగా ఒక వివరణ ఇచ్చామని పేర్కొన్నారు. భారత్, చైనాలకు సంబంధించిన శాఖలు సమన్వయం చేసుకుంటూ ఈ విషయంపై పురోగతి సాధించాయని తెలిపారు. ఈ రెండు శాఖలు ఎప్పుడూ క్లోజ్‌గా కమ్యూనికేట్ అవుతూ.. భారత విద్యార్థుల ఫస్ట్ బ్యాచ్ వీలైనంత త్వరగా చైనాలో అడుగు పెట్టడానికి మార్గం సుగమం చేస్తున్నాయని పేర్కొన్నారు. కొంత మంది విదేశీ విద్యార్థులు ఇప్పటికే చైనాకు విచ్చేసి తమ చదువు మొదలుపెట్టినట్టు తెలిపారు.
తమ చదువులు కొనసాగించడానికి వెంటనే చైనాకు రావాలని భావిస్తున్నవారి పేర్లు ఇవ్వాలని డ్రాగన్ కంట్రీ ఇటీవలే భారత్‌ను కోరింది. భారత్ వందల సంఖ్యలో విద్యార్థుల పేర్లను పంపింది. చైనా ప్రస్తుతం ఈ జాబితాను ప్రాసెస్ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
శ్రీలంక, పాకిస్తాన్, రష్యా సహా పలు దేశాల నుంచి విద్యార్థులు చార్టర్డ్ ఫ్లైట్స్‌లో చైనాకు వస్తున్నారు. ఎందుకంటే, చాలా వరకు విదేశాలతో చైనా అంతర్జాతీయ విమాన సేవలను పునరుద్ధరించలేదు. అందులో భారత్ కూడా ఉన్నది.