
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప తీవ్రత లక్షణాలు ఎదుర్కొంటున్నారు. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మార్గదర్శకాలను ఆయన పాటించనున్నారు. ఇందులో భాగంగానే ఆయన శ్వేతసౌధంలో ఐసొలేషన్‌లో ఉండనున్నారు.
79 ఏళ్ల జో బైడెన్‌కు గురువారం కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది. పాజిటివ్ తేలినప్పటికీ ఆయన తన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆయన ఇప్పటికే వైరస్‌కు విరుగుడుగా యాంటీ వైరల్ ట్రీట్‌మెంట్ పాక్స్‌లవిడ్ కోర్సు ప్రారంభించినట్టు ప్రెస్ సెక్రెటరీ కరీన్ జీన్ పియరె తెలిపారు. జో బైడెన్ ఫుల్లీ వ్యాక్సినేటెడ్ అని వివరించారు. అంతేకాదు, రెండు సార్లు బూస్టర్ డోసులు వేసుకున్నారని వివరించారు. తాజాగా కరోనా సోకడం మూలంగా.. ఆయనలో స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పారు.
సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ గైడ్‌లైన్స్‌కు లోబడి జో బైడెన్ నడుచుకుంటున్నారని పియరె వివరించారు. ఇందులో భాగంగానే ఆయన వైట్ హౌజ్‌లో ఐసొలేషన్‌లోకి వెళ్లినట్టు పేర్కొన్నారు. అదే విధంగా ఆయన తన బాధ్యతలు యధావిధిగా నిర్వర్తిస్తారని చెప్పారు.
అమెరికా ప్రెసిడెంట్ జోసెఫ్ బైడెన్ తన సిబ్బందితో ఫోన్ మాట్లాడుతున్నారని, అన్ని మీటింగ్‌లలో ఫోన్, జూమ్ ద్వారా పాల్గొంటారని వివరించారు. వైట్ హౌజ్‌లో కరోనా చికిత్స పొందుతూ కూడా ఈ భేటీల్లో పాల్గొంటారని తెలిపారు. ఆయనకు కరోనా నెగెటివ్ వచ్చిన తర్వాత మళ్లీ ప్రత్యక్షంగా సమావేశాల్లో పాల్గొంటారని చెప్పారు. ప్రెసిడెంట్ బైడెన్ ఆరోగ్య వివరాలను ఎప్పటికప్పుడు వైట్ హౌజ్ అప్‌డేట్‌లు రోజూ విడుదల చేస్తుందని వివరించారు.
79 ఏళ్ల జోసెఫ్ బైడెన్ తొలిసారి కరోనా బారిన పడ్డారు.
ఇదిలా ఉండగా, కరోనా బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వేగంగా కోలుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ కోరుకున్నారు. ఆయన మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు. ఆయన వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.