
న్యూఢిల్లీ: అమెరికాలో భయానక ఘటన చోటుచేసుకుంది. పెన్సిల్వేనియా రాష్ట్రంలో సోమవారం ఉదయం ఓ రహదారిపై ఉన్నట్టుండి ఒక వాహనాన్ని మరొకటి ఢీకొట్టుకున్నాయి. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. పొగ మంచు దట్టంగా కమ్ముకోవడంతో రహదారిపై విజిబిలిటీ లేకుండా పోయింది. దీంతో ఎదురుగా ఏమున్నాయో కనిపించనంతగా మంచు ఆవరించి ఉంది. ఈ కారణంగానే వాహనాలు ఢీకొట్టుకున్నాయి. అలా ఢీకొని చెల్లాచెదురుగా పడి ఉన్న వాహనాలనూ అటుగా వచ్చే వాహనాలు ఢీకొట్టుకుంటూనే ఉన్నాయి. ప్రతి సెకండ్‌కు ఒక్కో వాహనం ఢీకొట్టుకున్న చప్పుళ్లు వచ్చాయి. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. కాగా, తొలుత ఢీకొట్టిన వాహనాల్లో మంటలు వ్యాపించాయి. ఆ మంటలు ఇతర వాహనాలకు వ్యాపించే ముప్పు కనిపించింది. కానీ, అప్పటికే సహాయక సిబ్బంది వచ్చి ఆ మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇలా దట్టమైన మంచు ఆవరించిన కారణంగా ఎదురుగా నిలబడి ఉన్న వాహనాలను కనిపించక ఢీకొట్టిన వాహనాలు కొన్ని మైళ్ల మేరకు పేరుకుపోయాయి. ట్రక్కులు, ట్రాక్టర్లు, కార్లు సుమారు 50 నుంచి 60 వాహనాలు ఈ ఘటనలో ఒకదానికి మరొకటి ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి యూట్యూబ్‌లో పోస్టు చేశారు.
అమెరికాలో పెన్సిల్వేనియా రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లే రహదారిపై ఈ ఘటన సోమవారం ఉదయం 10.30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆ వీడియో అక్కడి భయానక దృశ్యాలను చూపింది. మంచు కారణంగా కనిపించక ఎదుటి వాహనాన్ని ఢీకొనగానే డ్రైవర్లు, కారులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాక్‌కు గురవుతున్నారు. వెంటనే వారు బయటకు వచ్చి పరిశీలించగా.. అప్పటికే పదుల సంఖ్యలో వాహనాలు చెల్లాచెదురై పడి ఉండటాన్ని చూస్తున్నారు. వెంటనే అక్కడి నుంచి దూరంగా జరుగుతున్నారు. వారు దూరంగా జరగ్గానే మరో వాహనం వచ్చి ఆ వాహనాలను ఢీకొంటున్నాయి. తరుచూ పెద్ద శబ్దాలు వస్తుండటాన్ని మనం వీడియోలో వినవచ్చు. ఒక వ్యక్తి అలా కారు నుంచి దిగీదిగగానే మరో వాహనం వేగంగా వచ్చి ఆయన కారును ఢీకొట్టింది. కారు ఆ తాకిడికి రోడ్డు కిందకు జారిపోయింది. ఆ వ్యక్తి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు.
ఈ వాహనాలు కొన్ని మైళ్ల మేరకు చిందరవందరగా ఉండటంలో ట్రాఫిక్ అంతకు చాలా రెట్ల దూరం రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో స్పాట్‌కు చేరడానికి సహాయక సిబ్బందికి చాలా కష్టంగా మారింది. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు.