కాబూల్‌లో ఉక్రెయిన్ ప్లేన్ ఎత్తుకెళ్లారు: ఔను.. హైజాక్ చేశారన్న డిప్యూటీ మినిస్టర్

By telugu teamFirst Published Aug 24, 2021, 2:20 PM IST
Highlights

పౌరులను స్వదేశానికి తరలించాలని ఉక్రెనియన్ నుంచి కాబూల్ చేరిన విమానాన్ని కొందరు సాయుధులు హైజాక్ చేశారు. ఉక్రెనియన్లు కాకుండా ఇతరులను ఎక్కించుకుని ఆ విమానాన్ని ఇరాన్‌కు ఎగరేసుకుపోయారు. ఈ ఘటనను ఉక్రెనియన్ విదేశాంగ శాఖ డిప్యూటీ మంత్రి వెల్లడించారు.

న్యూఢిల్లీ: సాధారణంగా బైక్‌లు దొంగతనాల గురించి వింటుంటాం. అప్పుడప్పుడు కార్ల చోరీలు, అరుదుగానైనా సిక్స్ వీలర్లు పోయిన కేసులు చూస్తాం. కానీ, విమానం చోరీకి గురైందని వినడం అరుదుల్లోకెల్లా అరుదైన విషయం. తాలిబాన్లు ఆక్రమించుకున్న ఆఫ్ఘనిస్తాన్‌లో ఇలాంటి విచిత్ర విషాదాలెన్ని చూడాల్సి వస్తుందో తెలియట్లేదు. తాజాగా, ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్‌లో అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉక్రెనియన్ విమానాన్ని తుపాకులతో బెదిరించి దాదాపు దొంగతనం చేసినంత పనిచేశారు. ఉక్రెనియన్లను కాక ఇతరులను ఎక్కించుకుని మరో దేశం ఇరాన్‌కు విమానాన్ని ఎగరేసుకెళ్లారు. ఈ విషయాన్ని ఉక్రెనియన్ విదేశాంగ శాఖ డిప్యూటీ మినిస్టర్ యేవ్‌జెనీ యెనిన్ స్వయంగా వెల్లడించారు.

‘గత ఆదివారం మా విమానాన్ని హైజాక్ చేశారు. మంగళవారం ప్రాక్టికల్‌గా మా నుంచి దొంగిలించారు. ఆ విమానంలోకి ఉక్రెనియన్లు కాక వేరే బృందం ఎక్కింది. దాన్ని ఉక్రెనియన్‌కు కాకుండా ఇరాన్‌కు తీసుకెళ్లారు. హైజాకర్లు ఆయుధాలను పట్టుకుని వచ్చారు’ అని యెనిన్ తెలిపారు. అంతేకాదు, ఆఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకున్న ఉక్రెనియన్ పౌరులను స్వదేశానికి తరలించడానికి తర్వాత చేసిన తమ మూడు ప్రయత్నాలూ విఫలమయ్యాయని ఆయన వివరించారు. అయితే, ఎత్తుకెళ్లిన ఆ విమానాన్ని ఏం చేశారన్న దానిపై మంత్రి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఉక్రెనియన్ ప్రభుత్వం ఆ విమానాన్ని తిరిగి వెనక్కి తెచ్చుకోవాలనుకుంటున్నదా? ఉక్రెనియన్ పౌరులను ఎలా స్వదేశానికి తీసుకెళ్లాలనుకుంటున్నది? అనే విషయాలపై క్లారిటీ ఇవ్వలేదు.

ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉక్రెనియన్‌కు ఆదివారం ఒక విమానం వచ్చింది. ఇందులో 31 మంది ఉక్రెనియన్ పౌరులు సహా మొత్తం 83 మంది ఉక్రెనియన్ రాజధాని కీవ్‌కు చేరారు. ఇందులో 12 మంది ఉక్రెనియన్ మిలిటరీ సిబ్బందీ తిరిగివచ్చినట్టు అధ్యక్ష భవనం ఓ ప్రకటనలో వెల్లడించింది. వీరితోపాటు విదేశీ విలేకరులు, ప్రముఖులను విజ్ఞప్తుల మేరకు తరలించుకువచ్చినట్టు తెలిపింది. అంతేకాదు, కనీసం మరో 100 మంది ఉక్రెనియన్ పౌరులు స్వదేశానికి తిరిగి రావడానికి ఆఫ్ఘనిస్తాన్‌లో పడిగాపులు కాస్తున్నట్టు వివరించింది.

click me!