భారత్ నిజమైన ఫ్రెండ్.. పాక్ మాకు పక్కలో బల్లెం: అఫ్ఘాన్ పాప్‌స్టార్ అర్యానా సయీద్

Published : Aug 24, 2021, 01:40 PM IST
భారత్ నిజమైన ఫ్రెండ్.. పాక్ మాకు పక్కలో బల్లెం: అఫ్ఘాన్ పాప్‌స్టార్ అర్యానా సయీద్

సారాంశం

ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ నిజమైన మిత్రదేశమని ఆ దేశ పాప్‌స్టార్ అర్యానా సయీద్ కితాబిచ్చారు. అఫ్ఘాన్ కోసం, అఫ్ఘాన్ ప్రజల కోసం భారత్ ఎంతో కృషి చేసిందని ప్రశంసించారు. కాగా, తాలిబాన్ల బలపడటానికి, అన్ని రకాలుగా సహకరించింది పాకిస్తాన్ అని ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్ నేటి సంక్షోభ స్థితికి పరోక్షంగా అదే కారణమని మండిపడ్డారు.

న్యూఢిల్లీ: యుద్ధ బీభత్సాన్ని చవిచూస్తున్న ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇటీవలే బయటపడ్డ ఆ దేశ పాప్‌స్టార్ అర్యానా సయీద్ తాజాగా తాలిబాన్లపై నోరువిప్పారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుస్థితికి పరోక్షంగా పాకిస్తాన్ చర్యలే కారణమని ఆరోపించారు. తాలిబాన్లకు పాక్ సహకారాలు అందించిందని, అది ఎదిగి దేశాన్ని మింగేయడానికి తోడ్పడిందని విమర్శలు చేశారు. తమకు పక్కలో బల్లెంలా మారిందని అన్నారు. అదే సమయంలో భారత్‌పై ప్రశంసలు కురిపించారు. ఆఫ్ఘనిస్తాన్‌కు భారత్ నిజమైన స్నేహితురాలని కితాబిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి, ప్రజల సంక్షేమం కోసం భారత్ ఎంతో సహాయం చేసిందని పొగిడారు.

‘పాకిస్తాన్‌ను నేను కచ్చితంగా బ్లేమ్ చేస్తాను. ఎందుకంటే తాలిబాన్లు బలపడటానికి పాకిస్తాన్ సహాయపడింది. అందుకు సంబంధించిన ఆధారాలు, వీడియోలు ఎన్నో చూశాం. మా ప్రభుత్వం ఎప్పుడు తాలిబాన్లను ముట్టుకున్నా పాకిస్తానీ కనిపించేవారు లేదా పాక్ ఛాయలే కనిపించేవి. కాబట్టి, పాక్‌ను తప్పుబట్టాల్సిందే. ఇప్పటికైనా తన దారి తను చూసుకుని ఆఫ్ఘనిస్తాన్ రాజకీయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలి’ అని ఓ ఇంటర్వ్యూలో మండిపడ్డారు.

‘తాలిబాన్లకు పాకిస్తానే సూచనలు చేసేది. తాలిబాన్ల బేస్‌లూ పాక్‌లోనే ఉన్నాయి. అక్కేడ ట్రెయినింగ్ కూడా. అంతర్జాతీయ సమాజం ముందు పాక్‌కు నిధులు నిలిపేయాలి. తద్వారా వారు తాలిబాన్లకు ఫండ్స్ నిలిపేసినవారవుతారు. అంతేకాదు, పాకిస్తాన్‌పై ఒత్తిడి తెచ్చి తాలిబాన్లకు సహాయ సహకారాలు అందించకుండా చర్యలు తీసుకోవాలి’ అని అభిప్రాయపడ్డారు.

‘భారత్ ఎల్లప్పుడూ మాతో సవ్యంగా మెదిలింది. మాకు నిజమైన ఫ్రెండ్‌గా కొనసాగింది. మా ప్రజల పట్ల, శరణార్థుల పట్ల కూడా ఎంతో దయగా వ్యవహరించింది. ఇండియాలో ఉన్న అఫ్ఘాన్లు ఆ దేశం గురించి, భారతీయుల గురించి నాతో గొప్పగా చెప్పారు. భారత్‌కు మేం రుణపడి ఉన్నాం. ఆఫ్ఘనిస్తాన్ తరఫున నేను భారత్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను థాంక్ యూ చెప్పాలనుకుంటున్నా. ఇన్నేళ్లలో మా పొరుగున ఒక నిజమైన మిత్రురాలు ఉన్నట్టు తెలుసుకోగలిగాం. అది భారత దేశమే’ అని ఉద్వేగంగా చెప్పుకొచ్చారు.

2015లో అర్యానా ఆఫ్ఘనిస్తాన్‌లోని ఓ స్టేడియంలో పాటపాడి అక్కడ మహిళలపై ఉన్న మూడు ఆంక్షల సంకెళ్లను తెగ్గొట్టారు. మహిళలు పాడటం, హిజబ్ ధరించకపోవడం, స్టేడియంలోకి ప్రవేశించడం వంటివి అక్కడ నిషేధాలుగా ఉండేవి. వీటిని ఆమె చెదరగొట్టి అవి చేసి చూపెట్టారు. ఇప్పుడు అవి మళ్లీ ఒక కలగానే మారిపోయాయి. ఇంతటి అభ్యుదయ భావాలున్న అర్యానా సయీద్‌ తాలిబాన్ల పాలనలో తనకు ప్రాణ ముప్పు ఉంటుందని భావించడం సహజమే. అదృష్టవశాత్తు ఓ యూఎస్ కార్గో జెట్‌లో చోటు దక్కించుకుని ఖతర్‌కు
ప్రయాణమయ్యారు. మొత్తంగా ఆఫ్ఘనిస్తాన్‌ను వదిలిపెట్టారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే