
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఒక వైపు రష్యా దాడులు కొనసాగుతుండగానే మరో వైపు విముక్తి గురించి మాట్లాడింది. ఇర్పిన్, బుచా, గోస్టోమల్ సహా రాజధాని కీవ్ మొత్తం ఇప్పుడు విముక్తం అయిందని వివరించింది. ఇప్పుడు కీవ్ మొత్తం మళ్లీ తమ నియంత్రణకు వచ్చిందని ఉక్రెయిన్ రక్షణ మంత్రి గన్నా మలియర్ వెల్లడించారు. బుచా ఏరియాలో 280 మందిని సామూహిక ఖననం చేసినట్టు మేయర్ వెల్లడించారు. కాగా, ఇర్పిన్ ఏరియాలో భారీగా పేలుడు పదార్థాలు నాటి పెట్టారని తెలిపారు.
ఉక్రెయిన్ నుంచి రష్యా బలగాలు క్రమంగా ఉపసంహరణ మొదలైందని ఇటీవలే ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉక్రెయిన్ ఉత్తర భాగం నుంచి రష్యా బలగాలు వెనక్కి మళ్లుతున్నాయని వివరించారు. రష్యా దాని ఫోకస్‌ను ఉక్రెయిన్‌లో తూర్పు, దక్షిణ ప్రాంతాలపై పెట్టినట్టు చెప్పారు.
కాగా, ఉక్రెయిన్, రష్యాల మధ్య శాంతి చర్చల్లో పాల్గొంటున్న ఉక్రెయిన్ తరఫు మధ్యవర్తి డేవిడ్ అరఖామియా మాట్లాడుతూ తమ ప్రతిపాదనలకు రష్యా మౌఖికంగా అంగీకరించిందని వివరించారు. అయితే, రాతపూర్వకంగా రష్యా ఇంకా కన్ఫర్మేషన్ ఇవ్వలేదని తెలిపారు. ఈ వారం తొలినాళ్లలో ఇస్తాంబుల్‌లో రష్యా, ఉక్రెయిన్ మధ్యవర్తులు సమావేశం అయ్యారు. కీవ్ రీజియన్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటామని రష్యా తెలిపింది. శాంతి చర్చలకు సానుకూల వాతావరణం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, శాంతి చర్చల్లో మరో ముందడుగు పడే అవకాశం ఉన్నది. ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలొడిమిర్ జెలెన్‌స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లు త్వరలోనే ముఖాముఖిగా అంకారా లేదా ఇస్తాంబుల్‌లో సమావేశం అయ్యే అవకాశాలు ఉన్నట్టు అరాఖమియా తెలిపారు.
కాగా, కీవ్, చెర్నిహివ్ రీజియన్‌ల నుంచి రష్యా బలగాలు వేగంగా వెనక్కి మళ్లుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖేలో పోడోల్యాక్ వివరించారు. రష్యా విభిన్నమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నదని తెలిపారు. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో బలగాలు పెంచుతున్నట్టూ పేర్కొన్నారు.
శాంతి చర్యలు సానూకూల ఫలితాలను ఇవ్వడంతో రష్యా సేనలు వెనక్కు తగ్గుతున్నాయి. మరోవైపు దశలవారీగా చర్చలు కొనసాగుతున్నాయి. ఇంతలో విధ్వంసానికి మూల కారణాల్లో ఒకటైన ‘‘నాటో కూటమిలో చేరిక’’పై ఉక్రెయిన్ మాట మార్చింది. రష్యా ఆగ్రహానికి కారణమైన ‘నాటో సభ్యత్వం’ అంశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలుత నాటో సభ్యత్వం కోసం అభ్యర్థించిన ఆయన.. యుద్దం తీవ్రత పెరుగుతున్న కొద్దీ.. తాము ఆ కూటమిలో చేరబోమని, తటస్థంగా ఉంటామని తేల్చిచెప్పారు. కానీ.. తాజాగా మరో సారి ‘‘నాటో కూటమిలో చేరిక’’పై ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట మార్చారు. తాజాగా తమకు సభ్యత్వం ఇవ్వకపోవడం నాటో చేసిన తప్పిదమని విమర్శించింది.
తాజాగా.. ఫాక్స్ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అధ్యక్షుడు జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌ను నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో చేరనివ్వకపోవడం పొరపాటు అని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ అన్నారు. ఉక్రెయిన్ బలహీన దేశం కాదని.. పూర్తిస్థాయి సభ్యులమైతే నాటో నాటోను మరింత బలపరుస్తామని తెలిపారు. ‘‘ మేం బలపడేందుకు.. నాటోను బలిపెట్టమనడం లేదు. మేం నాటో చేరితే.. మరింత ప్రయోజనకారంగా ఉంటుంది. యూరప్ ఖండంలో ఉక్రెయిన్ కూడా ముఖ్యమైన దేశం’’ అని జెలెన్ స్కీ అన్నారు.