పాక్‌లో నాటకీయ పరిణామాలు.. సొంత స్పీకర్‌ను ఎన్నుకున్న ప్రతిపక్షాలు.. సమాంతరంగా అసెంబ్లీ సమావేశ నిర్వహణ

Published : Apr 03, 2022, 03:47 PM ISTUpdated : Apr 03, 2022, 05:31 PM IST
పాక్‌లో నాటకీయ పరిణామాలు.. సొంత స్పీకర్‌ను ఎన్నుకున్న ప్రతిపక్షాలు.. సమాంతరంగా అసెంబ్లీ సమావేశ నిర్వహణ

సారాంశం

పాకిస్తాన్‌లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని నేషనల్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రద్దు చేశారు. అనంతరం అధ్యక్షుడు అసెంబ్లీని రద్దు చేశారు. కాగా, ఈ రెండు నిర్ణయాలు వెనక్కి తీసుకునే వరకు తాము అసెంబ్లీని వీడేది లేదని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు సమాంతరంగా సభను నిర్వహిస్తున్నాయి. అందుకోసం ప్రత్యేకంగా ఓ ప్రతిపక్ష నేతను స్పీకర్‌గా ఎన్నుకోవడం గమనార్హం.  

న్యూఢిల్లీ: పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ఈ రోజు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత నెల ప్రారంభం నుంచి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి గద్దె దింపడానికి ప్రతిపక్షాలు తీవ్ర ప్రయత్నం చేశాయి. ఈ రోజు అవిశ్వాస తీర్మానంపై చర్చ పరాకాష్టకు చేరింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు ఓటింగ్ నిర్వహించాల్సింది. తమ ప్రభుత్వానికి గద్దె దింపడానికి విదేశీ శక్తులు కుట్ర పన్నుతున్నాయని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ముందు నుంచీ వాదిస్తూ వస్తున్నారు. ఈ రోజు పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలోనూ మంత్రులు ఈ వాదనను మరోసారి లేవనెత్తారు. ఈ ఆరోపణలను ఆధారం చేసుకుని రాజ్యాంగంలోని కొన్ని అధికరణలను పేర్కొంటూ డిప్యూటీ స్పీకర్ ఖాసిమ్ సూరి అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేశారు. సభను వాయిదా వేశారు. దీంతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అసెంబ్లీలోనే నిరసనలకు పూనుకున్నాయి. అవిశ్వాస తీర్మాన సమయంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సభకు హాజరు కాలేదు.

ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం రద్దుపై గగ్గోలు పెడుతున్నాయి. సుప్రీంకోర్టులోనూ ఈ నిర్ణయాన్ని సవాలు చేయడానికి వెళ్లింది. తమ న్యాయవాదులను సుప్రీంకోర్టుకు పంపినట్టు ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు. కాగా, సుప్రీంకోర్టు కూడా వీరి పిటిషన్ విచారించడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇందుకోసం ప్రత్యేక ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. కాగా, అవిశ్వాస తీర్మానం రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తాము అసెంబ్లీని వీడబోమని ప్రతిపక్ష నేతలు కరాఖండిగా తేల్చి చెప్పారు. అంతే కాదు, ఓ అడుగు ముందుకు వేసి వారు ప్రభుత్వానికి సమాంతరంగా సభను నిర్వహించడానికి సిద్ధం అయ్యారు. అంతేకాదు, ప్రతిపక్షాలు కలిసి వారికి ప్రత్యేకంగా ఒక స్పీకర్‌ను ఎన్నుకున్నారు. ప్రతిపక్షాల స్పీకర్‌గా ఎయాజ్ సాదిఖ్‌ను స్పీకర్‌గా ఎన్నుకున్నారు. ఇలాంటి పరిణామం ఆ దేశ చరిత్రలో తొలిసారి చోటుచేసుకుంది.

కాగా, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సిఫారసు మేరకు పాకిస్తాన్ అసెంబ్లీని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ రద్దు చేశారు. అసెంబ్లీ రద్దుతో పాకిస్తాన్ మంత్రివర్గం కూడా రద్దు అయినట్టేనని వివరించారు. అంతేకాదు, మూడు నెలలపాటు ఆపద్ధర్మ ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ కొనసాగుతారని ఇమ్రాన్ ఖాన్ మంత్రి వెల్లడించారు.

తనపై అవిశ్వాస తీర్మానం తిరస్కరణకు గురైన అనంతరం ఇమ్రాన్ ఖాన్ జాతినుద్దేశించి ప్రసంగించారు. పాక్‌లో ఎన్నికలు నిర్వహించాలని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి‌ని కోరారు. ఎన్నికలకు సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తనపై కుట్ర జరిగిందన్నారు. తనపై అవిశ్వాస తీర్మానం.. పాకిస్తాన్‌పై జరిగిన విదేశీ కుట్ర అని ఆయన చెప్పుకొచ్చారు. దేశ ప్రజలను ఇమ్రాన్ అభినందించారు.

‘అసెంబ్లీని రద్దు చేయాలని అధ్యక్షునికి లేఖ రాశాను. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలి. ఎన్నికలకు సిద్ధం కావాలని పాకిస్థాన్‌కు నేను ప్రజలకు పిలుపునిస్తున్నాను’ అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.

ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని రద్దు చేసిన డిప్యూటీ స్పీకర్‌ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పార్లమెంట్‌ను విడేది లేదని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే