
మన ఇంటి ముందు ఒక మెయిన్ రోడ్డు ఉండి.. దాని పైన వాహనాలు అటూ ఇటూ వేగంగా వెళ్తుంటే మనకు ఎలా ఉంటుంది. చికాకుగా ఉంటుంది కదా. పైగా మన ఇళ్లలో చిన్న పిల్లలు ఉంటే ఇంకా ఇబ్బంది. పిల్లలు బయటకు వెళ్లినప్పుడు వేగంగా వచ్చే వాహనాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని ఎప్పుడూ టెన్షన్ పడుతూ ఉంటాం. సాధారణంగా జనాలు నివసించే ప్రదేశాల్లో చాలా నెమ్మదిగా వెళ్లాలని నిబంధనలు ఉంటాయి. కానీ అవి ఎవరూ పాటించరు. ఇలాంటి పరిస్థితే మనకు ఎదురైతే ఏం చేస్తాం. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానిక అధికారులను కోరుతాం.. కానీ అన్ని చోట్ల అధికారులు స్పందించరు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడ బడితే అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసేందుకు నిబంధనలు కూడా అనుమతించవు. మరి అలాంటప్పుడు ఏం చేస్తాం. ఆ రూట్ రెగ్యులర్ గా వచ్చే వాహనదారులకు రెండు, మూడు సార్లు చెబుతాం. వారెవరూ వినకపోతే అలాగే చూస్తూ ఉండిపోతాం.
వెస్ట్ మిడ్లాండ్స్ ఆఫ్ ఇంగ్లాండ్ లోని స్టాఫోర్డ్‌షైర్ నివసించే రాబ్ అడ్‌కాక్ కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురయ్యింది. ఆయన ఇంటికి ఎదురుగా ఒక రోడ్డు ఉంది. ఈ రోడ్డుపై కేవలం 30 కిలో మీటర్ల స్పీడ్ తో వాహనాలు వెళ్లాలి. కానీ ఆ నిబంధనలను ఎవరూ పాటించడం లేదు. కార్ల వేగాల వల్ల తన ఇంటి చుట్టుపక్కల నివసించే వారు కూడా చాలా ఇబ్బంది పడటం గమనించాడు. దీనికి ఏదో ఒక పరిష్కారం కనుగోనాలని ప్రయత్నించాడు. ముందుగా అక్కడి రోడ్లపై నిలబడి వాహనాలను మెళ్లగా వెళ్లాలని బాగా అరిచేవాడు. ఎవరూ పట్టించుకోకపోవడంతో వేరే మార్గం దిశగా ఆలోచించాడు. దీంతో అతడికి ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది. ఆ ఐడియా సూపర్ సక్సెస్ అయ్యింది. దీంతో అతడిని నెటిజన్లు పొగుడుతున్నారు.
ఇంతకీ రాబ్ అడ్‌కాక్ ఏం చేశాడంటే.. ఈ రోజుల్లో మంచిగా చెబితే ఎవరూ వినరు. రూల్స్ పాటించండని, వేగంగా వెల్లకండని ఎంత చెప్పినా వినరు. అదే ఆ ప్రాంతల్లో స్పీడ్ గన్ లాంటిది ఏర్పాటు చేస్తే దానిని చూసి బయపడి ఆటో మేటిక్ గా వాహనాల వేగం తగ్గిపోతుంది. కానీ ప్రతీ ప్రాంతంలో దీనిని పోలీసులు ఏర్పాటు చేయరు. కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లోనే వీటిని అమరుస్తారు. అయితే రాబ్ అడ్ కాక్ తన ఇంటి సమీపంలో ఒక ఫేక్ స్పీడ్ కెమెరా వ్యాన్ ను సృష్టించాడు. తన దగ్గర ఉన్న వస్తువులతోనే దానిని తయారు చేశాడు. ఆ వ్యాన్ ను తన ఇంటి సమీపంలో ఉన్న రోడ్డు పక్కన నిలిపాడు. దీనిని గమనించి వాహనదారులు స్పీడ్ తగ్గించడం అతడు గమనించాడు. వేగంగా వెళ్లే వారు ఒకే సారి బ్రేక్ అప్లయ్ చేయడం అతడు గుర్తించాడు. దీంతో తన పథకం ఫలించిందని సంతోషించాడు.
ఇంటి దగ్గర ఉండే స్టిక్కర్లు, పోస్టర్లు, ఇతర కొన్ని వస్తువులు ఉపయోగించి ఈ ఫేక్ స్పీడ్ కెమెరా వ్యాన్ ను తయారు చేయడం ఇక్కడ గమనార్హం. అయితే దీనిని ఎలా తయారు చేశాడో కూడా రాబ్ అడ్ కాక్ వీడియో రూపంలో సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో నెటిజన్లు అతడిని మేధావి అని పొగుడుతున్నాడు. ఈ విషయంలో అతడు మాట్లాడుతూ.. ‘‘ వాహనాల వేగం చుట్టుపక్కల నివసించే ప్రజలందరినీ బాధపెడుతోంది. వారెవరూ సంతోషంగా లేరు. కాబట్టి వారికి సహాయం చేయడానికి నేను ఏమి చేయగలనో ఆలోచించాను. వాహనదారులు వేగాన్ని తగ్గించాలంటే ఏం చేయాలని నేను ఆలోచించాను. అందుకే దీనిని తయారు చేశాను’’ అని ఆ వీడియోలో అతడు చెప్పాడు.
రాబ్ అడ్‌కాక్ ఫేక్ స్పీడ్ కెమెరా వ్యాన్ తయారు చేసినప్పటికీ ఆయన ఎలాంటి చట్టాన్నీ ఉల్లంఘించలేదని స్టాఫోర్డ్‌షైర్ పోలీసులు తెలిపారు. స్టాఫోర్డ్‌షైర్ సేఫ్ రోడ్స్ పార్టనర్‌షిప్‌లో భాగంగా అతడు చేసిన ఈ పనిని స్వాగతిస్తున్నామని ఒక్కడి పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు.