రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో కీలక పరిణామం.. అమెరికా ప్రతిపాదనను అంగీకరించిన ఉక్రెయిన్‌.

Russia- Ukraine war: రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య మూడేళ్లుగా యుద్ధం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య జరుగుతోన్న భీకర యుద్ధంతో ఇప్పటి వరకు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఎన్ని శాంతి చర్చలు జరిగినా ఫలితం మాత్రం ఉండడం లేదు. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య జరుగుతోన్న యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. 
 

Ukraine Accepts U.S. Ceasefire Proposal Major Turning Point in Russia-Ukraine War Details in telugu VNR

మూడేళ్లుగా నిర్వీరామంగా కొనసాగుతోన్న ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పే లక్ష్యంతో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా అమెరికా, ఉక్రెయిన్‌ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అంగీకరించింది. రష్యాతో తక్షణమే చర్చలకు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఈ మేరకు ఇరుపక్షాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.

ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఈ సానుకూల స్పందనతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మిలటరీ సహాయం నిలిపివేసిన నిర్ణయాన్ని ఎత్తివేశారు. దీంతో యుద్ధం ముగింపు దశకు చేరుతున్నదన్న విశ్వాసం వ్యక్తమవుతోంది. ట్రంప్ సలహాదారులు 30 రోజుల కాల్పుల విరమణకు ఒప్పుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. ఆ మేరకు ఉక్రెయిన్ అంగీకరించింది. జెడ్డాలోని ఓ హోటల్‌లో సుమారు తొమ్మిది గంటలపాటు జరిగిన చర్చల అనంతరం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మీడియాతో మాట్లాడుతూ.. 'ఈరోజు మేము ఒక ప్రతిపాదన చేశాము. ఉక్రెయిన్ దానిని అంగీకరించింది. దాని ప్రకారం ఉక్రెయిన్ తక్షణ కాల్పుల విరమణతో పాటు చర్చలకూ సిద్ధమైంది' అని తెలిపారు. "ఇప్పుడు ఈ ప్రతిపాదనను రష్యాకి తీసుకెళ్తాం. వారు శాంతికి అంగీకరిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు నిర్ణయం వారి చేతుల్లో ఉంది. వారు తిరస్కరిస్తే, శాంతికి అడ్డంకి ఎవరో మనకి స్పష్టమవుతుంది' అని తెలిపారు. 

Latest Videos

ఫిబ్రవరి 28న ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మధ్య చర్చలు విఫలమైన తర్వాత అమెరికా తాత్కాలికంగా నిలిపేసిన మిలటరీ సహాయాన్ని తిరిగి పునరుద్ధరిస్తామని రూబియో తెలిపారు. ఇదిలా ఉంటే వాషింగ్టన్‌లో ట్రంప్ మాట్లాడుతూ, జెలెన్స్కీని తిరిగి వైట్‌హౌస్‌కు ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నానని, ఈ వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుటిన్‌తో మాట్లాడవచ్చని చెప్పారు. ఉక్రెయిన్‌, రష్యాల మధ్య పూర్తి స్థాయిలో యుద్ధం త్వరలోనే ముగుస్తుందనే ఆశ ఉందని, ఈ విషయమై రష్యా అధ్యక్షుడితో చర్చలు జరుపుతానని చెప్పుకొచ్చారు. 

చర్చల కంటే ముందు కూడా దాడులు చేసిన ఉక్రెయిన్‌: 

అమెరికా మద్దతు (మిలటరీ సహాయం, ఇంటెలిజెన్స్ పంచుకోవడం) నిలిపివేసిన తర్వాత, రష్యా ఉక్రెయిన్‌పై దాడులు పెంచింది. ముఖ్యంగా విద్యుత్ మౌలిక సదుపాయాలపై తీవ్ర దాడులు చేసింది. అలాగే ఉక్రెయిన్ దళాలు చొరబడ్డ రష్యా కుర్స్క్ ప్రాంతాన్ని తిరిగి ఆక్రమించింది. జెడ్డాలో చర్చలు ప్రారంభమయ్యే కొద్దిగంటల ముందు, ఉక్రెయిన్ మాస్కోపై భారీ దాడి చేసింది. వందలకొద్దీ డ్రోన్లు మాస్కో సహా ఇతర ప్రాంతాలపై దూసుకెళ్లాయి. ఈ దాడుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 

జెడ్డాలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రధాన సహాయకుడు ఆండ్రీ యెర్మాక్ మాట్లాడుతూ, "మేము శాంతిని కోరుకుంటున్నామని స్పష్టంగా చెప్పాము. రష్యా కూడా తామూ శాంతిని కోరుకుంటున్నారో లేదో, తాము ప్రారంభించిన యుద్ధాన్ని ముగించాలనుకుంటున్నారో లేదో స్పష్టంగా చెప్పాలి" అన్నారు. ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్స్ స్పందిస్తూ, "ట్రంప్ ఈ యుద్ధాన్ని ఎలా ముగించాలి అనే దిశగా ప్రపంచాన్ని ఆలోచింపజేశాడు. ఇదే నిజమైన మార్పు," అని తెలిపారు. "ఇప్పుడు యుద్ధం ముగుస్తుందా అనే ప్రశ్న లేకుండా, అది ఎలా ముగుస్తుందనేదే చర్చగా మారింది" అని వాల్ట్స్ అన్నారు. రష్యా జాతీయ భద్రతా సలహాదారుడితో త్వరలో మాట్లాడతానని చెప్పారు.

click me!