భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం మారిషస్ లో పర్యటిస్తున్నారు. ఆయనను ఆ దేశం అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. ఆ అవార్డ్ ఏంటో తెలుసా?
PM Modi in Mauritius: ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం మన ప్రధానికి దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. మోదీకి 'గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్' అవార్డును ఇస్తున్నట్లు మారిషస్ ప్రకటించింది. ఇది మారిషస్ దేశంలోనే అతి గొప్ప గౌరవం.
ప్రధాని నరేంద్ర మోదీకి మారిషస్ ప్రభుత్వం అందించిన ఈ అవార్డుతో కలిపి మొత్తం 21వ అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. ఈ గౌరవం పొందిన తొలి భారతీయ నేతగా మోదీ నిలిచారు. ఇది భారత్, మారిషస్ మధ్య బలమైన సంబంధాలను మరింత పెంచుతుంది.
ఇక ప్రధాని నరేంద్ర మోదీ మారిషస్‌లో కమ్యూనిటీ ప్రోగ్రామ్‌లో మాట్లాడారు. భారీ సంఖ్యలో ఉన్న భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. 10 ఏళ్ల కిందట ఇదే రోజున ఇక్కడికి వచ్చానని గుర్తుచేసారు. ఇవాళ మళ్లీ మారిషస్‌కు వస్తే అప్పుడు కలిగిన అనుభూతే కలుగుతోందని.. సొంతవాళ్ల మధ్యకే వచ్చాననిపిస్తోందన్నారు. ఇక్కడి గాలిలో, మట్టిలో, నీటిలోఒక ఆత్మీయత కనిపిస్తోంది మోదీ అన్నారు.
''మారిషస్ ప్రజలు, ఇక్కడి ప్రభుత్వం నాకు అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వాలని నిర్ణయించాయి.... మీ నిర్ణయాన్ని నేను వినయంగా స్వీకరిస్తున్నాను. ఇది భారత్, మారిషస్‌ల చారిత్రక సంబంధాలకు గౌరవం. 1998లో అంతర్జాతీయ రామాయణ సమ్మేళనం కోసం ఇక్కడికి వచ్చే అవకాశం నాకు వచ్చిందని గుర్తు ఉంది. అప్పుడు నేను ప్రభుత్వ పదవిలో కూడా లేను. ఒక సాధారణ కార్యకర్తగా వచ్చాను. అప్పుడూ నవీన్ జీ ప్రధానిగా ఉన్నారు'' అని మోదీ గుర్తుచేసారు.
''అయోధ్య గురించి మోదీ ప్రస్తావిస్తూ.. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగినప్పుడు, మన 500 ఏళ్ల నిరీక్షణ ఫలించినప్పుడు.. భారతదేశంలో ఎంత ఉత్సాహం, సంబరం ఉందో.. ఇక్కడ మారిషస్‌లో కూడా అంతే పెద్ద ఉత్సవం చూశాం. మీ భావనలను అర్థం చేసుకుని అప్పుడు మారిషస్ హాఫ్ డే సెలవు కూడా ప్రకటించింది. భారత్, మారిషస్‌ల మధ్య విశ్వాసం అనే ఈ బంధం మన స్నేహానికి ఒక పెద్ద ఆధారం'' అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.