
లాస్ ఏంజెలెస్‌లో అక్రమ వలసదారులపై ఫెడరల్ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలతో నగరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడులపై విపరీత నిరసనలు వెల్లువెత్తడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన, కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్, లాస్ ఏంజెలెస్ మేయర్ కరెన్ బాస్ తమ బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నారని విమర్శించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఫెడరల్ ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని, సమస్యను చట్టపరంగా పరిష్కరిస్తామని హెచ్చరించారు.
ఈ ఘటనపై వైట్‌హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ స్టీఫెన్ మిల్లర్ కూడా స్పందించారు. యూఎస్ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఘటనలను తీవ్రంగా ఖండించారు. ఫెడరల్ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
ఈ దాడుల్లో 44 మంది అక్రమ వలసదారులు, రహదారి నిర్బంధించిన వ్యక్తిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ప్రజలు ఆందోళనకు దిగారు. వందల సంఖ్యలో నిరసనకారులు వీధుల్లోకి రావడంతో ఘర్షణలు చెలరేగాయి. పోలీసులు లాఠీఛార్జీ, టియర్ గ్యాస్‌తో వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ (SEIU) కాలిఫోర్నియా శాఖ అధ్యక్షుడు డేవిడ్ హుయెర్టా అరెస్టు కావడం ఉద్రిక్తతను మరింత పెంచింది. ఆయనను విడిపించాలని డిమాండ్ చేస్తూ ఫెడరల్ భవనానికి ముందు పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగించగా, పోలీసులు పెప్పర్ స్ప్రేను ఉపయోగించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
అధికారుల ప్రకారం, అక్రమ వలసదారులను దేశం నుంచి పంపేందుకు చేపట్టిన క్రమబద్ధమైన చర్యలలో భాగంగానే ఈ అరెస్టులు జరిగాయని స్పష్టం చేశారు.