
Trump Tariffs Impact: భయపడిందే జరిగింది. భారత్ పై అమెరికా కఠినంగా వ్యవహరిస్తోంది. భారత్‌పై ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాల నిర్ణయం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. మొదట 25 శాతం సుంకాలు విధించి, రష్యాతో సంబంధాల నేపథ్యంలో అదనంగా మరింత 25 శాతం సుంకాలు పెంచడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ నిర్ణయంతో భారత్ లోని పలు రంగాలపై తీవ్ర ప్రభావితం పడనున్నది.
అమెజాన్, వాల్‌మార్ట్ ఆర్డర్స్ నిలిపివేత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎవరూ ఊహించిన విధంగా సుంకాలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయంతో అమెజాన్, వాల్‌మార్ట్ వంటి ప్రముఖ ఆన్‌లైన్ షాపింగ్, రిటైల్ సంస్థలు కూడా భయపడ్డాయి. భారతదేశం నుండి వచ్చే ఆర్డర్లను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్టు తమ ఏజెంట్స్ సమాచారం అందించినట్టు తెలుస్తోంది. సంబంధించిన వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. తదుపరి సమాచారం వచ్చేంత వరకు దుస్తులు, వివిధ సరుకులను నిలిపివేయాలని భారత ఎగుమతిదారులకు లేఖలు, ఇమెయిళ్లు పంపుతున్నట్లు తెలుస్తోంది.
సుంకాల భారాన్ని ఎవరు భరిస్తారు?
భారీగా సుంకాలు పెరగడంతో భారత్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. అదనపు టారిఫ్ విధానం వల్ల అమెరికా కొనుగోలుదారులు ఈ అదనపు ఖర్చును భరించాల్సి వస్తుంది. కానీ, దిగుమతి సంస్థలుఇష్టపడటం లేదు. మరోవైపు, భారతీయ ఎగుమతిదారులు కూడా ఈ భారీ సుంకాల భారం తట్టుకోవడానికి సిద్దపడలేకపోతున్నారు. దీంతో, అమెజాన్, వాల్‌మార్ట్ వంటి సంస్థలు ఆర్డర్లు నిలిపివేయడం ప్రమాదకరమేనని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
సుంకాల కారణంగా ఖర్చులు 30-35 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ పరిస్థితి కొనసాగితే, అమెరికాకు వెళ్లే ఆర్డర్లు 40 నుండి 50 శాతం తగ్గిపోవచ్చని అంచనాలు వేస్తున్నారు. దీని వలన భారత వాణిజ్యానికి దాదాపు 4-5 బిలియన్ డాలర్ల వరకు నష్టాలు ఎదుర్కొవల్సి వస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
భారత టెక్స్‌టైల్ దిగుమతిదారులు ఆందోళన
వెల్‌స్పన్ లివింగ్, గోకల్ దాస్ ఎక్స్‌పోర్ట్స్, ఇండోకౌంట్, ట్రైడెంట్ వంటి ప్రధాన టెక్స్‌టైల్ ఎగుమతిదారులు తమ అమ్మకాల్లో 40 నుండి 70 శాతం వరకు అమెరికా మార్కెట్‌పై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం సుంకాల పెరుగుదలతో, అమెరికా నుంచి వచ్చే ఆర్డర్లు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎగుమతిదారులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
భారతదేశం నుండి అమెరికాకు వస్త్ర ఉత్పత్తుల ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో 36.61 బిలియన్ డాలర్లను చేరుకున్నాయి. ఇందులో 28 శాతం విలువ అమెరికా మార్కెట్ నుంచి వచ్చింది. అయితే, బంగ్లాదేశ్, వియత్నాం వంటి దేశాలపై సగటున 20 శాతం సుంకాలు ఉండడంతో, అమెరికా కంపెనీలు ప్రత్యామ్నాయ సరఫరాదారుల వైపు చూడవచ్చు.
రష్యా, భారత్ సంబంధాలే ఈ చర్యలకు కారణమా?
రష్యాతో భారత సంబంధాలు కొనసాగుతున్న నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం 25 శాతం సుంకాలను 50 శాతానికి పెంచినట్టు తెలుస్తోంది. ఈ కొత్త సుంకాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగస్టు 7 సంతకం చేశారు. ఈ అదనపు సుంకాలు ఈ నెల 27 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
ఈ చర్యలు వస్త్ర పరిశ్రమ, ఆక్వా రంగం, తోలు ఉత్పత్తులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయి. ట్రంప్ విధించిన సుంకాలు భారతదేశానికి గట్టి సవాలు గా మారే అవకాశముంది. భారత ఎగుమతిదారులు, కంపెనీలు, వాణిజ్య నిపుణులు ఈ పరిస్థితి ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచనలు ప్రారంభించారు. త్వరలో వాణిజ్య ఒప్పందాల ద్వారా ఈ సమస్య పరిష్కరం కావాలని భావిద్దాం.