ఆఫ్ఘనిస్తాన్‌లో పేలుళ్లు.. వివరాలు వెల్లడించిన తాలిబాన్.. అంతర్యుద్ధం ఆరంభమా?

By telugu teamFirst Published Sep 18, 2021, 7:21 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్‌లో అమెరికా బలగాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత తొలిసారిగా పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఐఎస్ఐఎస్-కే ప్రాబల్యమున్న జలాలాబాద్‌లో ఈ పేలుళ్లు జరిగాయి. ఇందులో కనీసం ఇద్దరు మరణించారని, మరో 20 మంది గాయపడ్డారని తాలిబాన్లు తెలిపారు. జలాలాబాద్‌లో పేలుడు జరగడంతో ఐఎస్ఐఎస్-కే విధ్వంసం సృష్టించడానికి ఉపక్రమిస్తున్నదా? అనే ఆందోళనలు వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌లో అంతర్యుద్ధానికి ఆరంభమయ్యే సూచనలూ అందులో ఉన్నాయని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో మూడు పేలుళ్లు సంభవించాయి. ఇందులో ఇద్దరు మరణించారు. కనీసం 20 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పిల్లలు, మహిళలూ ఉన్నారని తాలిబాన్లు వెల్లడించారు. జలాలాబాద్‌లో శనివారం ఈ పేలుళ్లు చోటుచేసుకున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు ఇద్దరు మరణించారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ తాలిబాన్ అధికారి వివరించారు. పెట్రోలింగ్ చేస్తున్న వాహనం లక్ష్యంగా ఈ పేలుళ్లు జరిగాయని తెలిపారు. పేలుడు నష్టాలను అంచనా వేయాల్సి ఉన్నదని, పేలుడు వెనుకున్న కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు ప్రారంభిస్తామని చెప్పారు.

నంగర్‌హర్ ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు ఈ ప్రాంతం కేంద్రం వంటిది. గత నెల ఆగస్టులో ఎయిర్‌పోర్టులో ఈ ఉగ్రవాద సంస్థనే ఆత్మాహుతిదాడి జరిపింది.

20ఏళ్ల నుంచి నిర్విరామంగా జరిగిన యుద్ధం తర్వాత ఇప్పుడే కొంచెం విరామం వచ్చింది. అయితే, తాజా పేలుళ్లపై విశ్లేషకులు తమ ఆందోళనను ముందుకు తెచ్చారు. అమెరికా, నాటో బలగాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉపసంహరించుకున్న తర్వాత ఈ దాడి జరిగింది. పాశ్చాత్య బలగాలు ఉపసంహరించుకున్న వెంటనే అమెరికా నిఘా వర్గాలు ఆఫ్ఘనిస్తాన్‌లో అంతర్యుద్ధం బద్దలయ్యే అవకాశముందని హెచ్చరించాయి. ప్రభుత్వాన్ని ఏర్పరిచే క్రమంలో గ్రూపుల తగాదాలు వస్తాయని అంచనా వేశాయి. తాలిబాన్లకు, హక్కానీ నెట్‌వర్క్ ఉగ్రవాద సంస్థకు మధ్య బేధాభిప్రాయాలు వచ్చినప్పటికీ చిన్నచిన్న ఘర్షణలతో సద్దుమణిగినట్టు అప్పుడు కథనాలు వచ్చాయి. అయితే, ఈ బేధాభిప్రాయలు పూర్తిగా సమసిపోయాయా? లేక కొంతకాలమేనా అనే ఆందోళన ఉన్నది. 

దీనికితోడు తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకోవడం జీర్ణించుకోలేని మరో ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్-కే అక్కడే ఉన్నది. కొన్ని రోజులకు తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనగానే ఎయిర్‌పోర్టులో పేలుడుకు పాల్పడింది. తాజాగా దాని ప్రాబల్యమున్న ప్రాంతంలో తాలిబాన్లను లక్ష్యంగా చేసుకుని దాడి జరగడంపై ఈ ఉగ్రవాద సంస్థలపై పోరు ముమ్మరమయ్యే ముప్పునూ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ఆ దేశంలో అంతర్యుద్ధం మరెంతో దూరం లేదని అంచనాలు వేస్తున్నారు.

click me!