చైనా ర్యాంకు పెంచడానికి వరల్డ్ బ్యాంక్ అడ్డదారి.. ఇక నుంచి ‘డూయింగ్ బిజినెస్’ రిపోర్టులు బంద్

By telugu teamFirst Published Sep 18, 2021, 10:55 AM IST
Highlights

ఇప్పటికే కరోనా వైరస్ మూలాలను దాచిపెడుతున్నదని అమెరికా సహా ప్రపంచదేశాలు చైనాపై దుమ్మెత్తిపోస్తున్న నేపథ్యంలో మరో సంచలన విషయం వెల్లడైంది. కరోనా విషయంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చైనాను వెనకేసుకువస్తున్నదన్న ఆరోపణలుండగా తాజాగా డూయింగ్ బిజినెస్ రిపోర్టు 2018లో దాని ర్యాంకు పెంచడానికి వరల్డ్ బ్యాంక్ అధికారులు అవకతవకలకు పాల్పడ్డట్టు ఓ దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలోనే వరల్డ్ బ్యాంక్ ఇక నుంచి డూయింగ్ బిజినెస్ రిపోర్టులను వెలువరించవద్దని నిర్ణయం తీసుకుంది.
 

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మరో కుంభకోణం బయటపడింది. ప్రపంచమంతా విశ్వసించే వరల్డ్ బ్యాంక్ రిపోర్టుల్లో అవతవకలు చోటుచేసుకున్నట్టు దర్యాప్తులో తేలింది. దేశాభివృద్ధికి సూచికలుగా భావిస్తున్న డూయింగ్ బిజినెస్ రిపోర్టుల్లోనూ ఈ మోసం వెలుగుచూసింది. డూయింగ్ బిజినెస్ 2018 రిపోర్టులో చైనా ర్యాంకు పెంచడానికి అప్పటి వరల్డ్ బ్యాంక్ చీఫ్ సహా ఇంకొందరు అధికారులు అడ్డదారి తొక్కారని, ఆ దేశ డేటాలో మార్పులు చేయాలని ఉద్యోగులపై ఒత్తిడి పెంచినట్టు వెల్లడైంది. అమెరికాకు చెందిన ఓ దర్యాప్తు సంస్థ ఈ విషయాలను వెల్లడించింది. దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడి కావడంతోనే ఆగస్టులో వెలువడాల్సిన డూయింగ్ బిజినెస్ రిపోర్టును వరల్డ్ బ్యాంక్ నిలిపేసింది. అంతేకాదు, ఇక నుంచి ఈ రిపోర్టులను రూపొందించడమే నిలిపేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది.

ఈ దర్యాప్తులపై వరల్డ్ బ్యాంక్ ఇటీవలే ఓ ప్రకటన వెలువరించింది. బోర్డు మాజీ అధికారులు, మాజీ సిబ్బందితోపాటు ప్రస్తుత సిబ్బందిలో కొందరి నైతిక ప్రవర్తనపై అనుమానాలున్నాయని తెలిపింది. డూయింగ్ బిజినెస్‌ 2018 రిపోర్టులో చైనా ర్యాంకు పెంచడానికి అప్పటి వరల్డ్ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ క్రిస్టలినా జార్జివా సహా ఇంకొందరు అధికారులు సిబ్బందిపై ఒత్తిడి పెంచినట్టు దర్యాప్తులో తేలిందని వెల్లడించింది.

జార్జివా ప్రస్తుతం అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్‌ పదవిలో ఉన్నారు. తాజా దర్యాప్తులో తేలిన ఫలితాలను ఆమె ఖండించారు. ‘డూయింగ్ బిజినెస్ 2018 రిపోర్టులో అవతవకలకు సంబంధించి నా పాత్ర ఉన్నట్టు పేర్కొంటున్న దర్యాప్తు వివరాలతో నేను ఏకీభవించడం లేదు. దీనిపై ఇప్పటికే ఐఎంఎప్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో మాట్లాడాను’ అని పేర్కొన్నారు.

దర్యాప్తు రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడికావడంతో వరల్డ్ బ్యాంక్ డూయింగ్ బిజినెస్ రిపోర్టులను నిలిపేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది. ఇకనుంచి ప్రపంచదేశాల్లో వాణిజ్యం, పెట్టుబడుల వాతావరణాన్ని సమీక్షించడానికి కొత్త విధానాన్ని ఎంచుకోబోతున్నట్టు తెలిపింది. కానీ, ఆ విధానంపై వివరాలను వెల్లడించలేదు.

వరల్డ్ బ్యాంక్ రిపోర్టులో అవకతవతకలను దర్యాప్తు చేసిన అమెరికా లా సంస్థ విల్మర్ హేల్ సంచలన విషయాలు వెల్లడించింది. డూయింగ్ బిజినెస్ రిపోర్టు 2018 ర్యాంకు పెంచడానికి అప్పటి స్టాఫ్ ఆఫ్ ప్రెసిడెంట్ జిమ్ యాంగ్ కిమ్ చైనా ర్యాంకు పలు సమావేశాలు నిర్వహించారని వివరించింది. అప్పుడే జార్జివా కూడా ఈ వ్యవహారంలో చేరిందని తెలిపింది. ఇతర దేశాల ర్యాంక్‌లు ప్రభావితం కాకుండా చైనా ర్యాంకు పెంచడానికి మార్గాలను అన్వేషించారని వివరించింది. అందుకే చైనా ర్యాంకు పెంచడానికి ర్యాంకులను నిర్ణయించే మెథడాలజీని మార్చడానికి సిబ్బందిపై కిమ్ ఒత్తిడి చేశారని పేర్కొంది. చైనా డేటా పాయింట్లు మార్చి దాని ర్యాంకు పెంచడానికి ప్రత్యేక మార్పులు చేయాల్సిందిగా ఉద్యోగులపై జార్జివా, ఆయన సలహాదారు సిమియాన్ జంకోవ్‌లు ఒత్తిడి పెంచారని వివరించింది.

డూయింగ్ బిజినెస్ 2020 రిపోర్టులోనూ సౌదీ అరేబియా ర్యాంకు పెంచడానికి అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపైనా ఈ రిపోర్టు దృష్టి సారించింది. ఈ ఆరోపణల్లోనూ జంకోవ్ ప్రమేయముండటం గమనార్హం.

click me!