ఢిల్లీలో జైలు శిక్ష అనుభవించిన ఉగ్రవాదే కాబూల్ ఎయిర్‌పోర్టులో ఆత్మహుతి దాడి చేశాడు: ఐఎస్ఐఎస్-కే

By telugu teamFirst Published Sep 18, 2021, 3:14 PM IST
Highlights

గతనెల 26న కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మాహుతికి పాల్పడిన ఉగ్రవాది ఐదేళ్ల క్రితం ఢిల్లీ నుంచే అక్కడికి వెళ్లాడని ఐఎస్ఐఎస్-కే పేర్కొంది. అంతేకాదు, ఢిల్లీలో ఆయన జైలు శిక్ష కూడా అనుభవించారని తెలిపింది. జమ్ము కశ్మీర్‌కు ప్రతీకారంగా భారత్‌లో ఉగ్రదాడి చేయడానికే ఆయన ఇండియాకు వచ్చాడని, కానీ, పోలీసులు అరెస్టు చేశారని వివరించింది.
 

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు ఉపసంహరిస్తున్నప్పుడు విదేశీ పౌరులు స్వదేశాలకు తరలివెళ్తున్న సమయంలో కాబూల్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డ బాంబర్ ఢిల్లీ జైలులో శిక్ష అనుభవించాడని ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్-కే పేర్కొంది. ఆ సూసైడ్ బాంబర్ ఐదేళ్ల క్రితం ఢిల్లీ నుంచి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లాడని ఐఎస్ఐఎస్-కే భారత్‌లో పబ్లిష్ చేస్తున్న దాని ప్రాపగాండ మ్యాగజైన్‌లో వెల్లడించింది. ఆగస్టు 26న కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 13 మంది యూఎస్ మెరైన్ సోల్జర్లు సహా 180 మంది దుర్మరణం పాలయ్యారు.

ఆ సూసైడ్ బాంబర్ పేరు అబ్దుల్ రహ్మాన్ అల్ లోగ్రి అని ఐఎస్ఐఎస్-కే పేర్కొంది. కశ్మీర్‌కు ప్రతీకారంగా దాడి చేసే లక్ష్యంతో ఆయన ఐదేళ్ల క్రితం ఢిల్లీకి వచ్చాడని వివరించింది. కానీ, భారత ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసిందని పేర్కొంది. జైలు నుంచి విడుదలైన తర్వాత కాబూల్‌కు వెళ్లాడని, ఆయనే అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆత్మాహుతిదాడికి పాల్పడ్డాడని పేర్కొంది.

కాగా, భారత్‌లో ఐఎస్ఐఎస్-కే దాని విషప్రచారం చేయడానికి 2020 నుంచి మ్యాగజైన్‌ను పబ్లిష్ చేస్తున్నది. ఈ మ్యాగజైన్ పబ్లిష్ చేశాక కశ్మీరీ దంపతులు జహంజెయిబ్ షమీ, ఆయన భార్య హిందా బషీర్ బేగ్‌లను ఐఎస్ఐఎస్-కేతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురినీ ఇవే ఆరోపణలతో అరెస్టు చేశారు. అనంతరం ఎన్ఐఏ ఈ కేసును దర్యాప్తు చేయడానికి తీసుకుంది. వారందరిపై చార్జిషీట్ దాఖలయ్యాయి. ఈ మ్యాగజైన్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా ఇప్పటికీ 12 మందికిపైగానే నిందితులు అరెస్టయ్యారు.

click me!