
Elon Musk : ప్రపంచ కుభేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్ష పీఠంపైనే కన్నేసాడు. గత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపుకోసం కృషిచేసి కింగ్ మేకర్ గా వ్యవహరించాడు... కానీ ఇప్పుడు తానే కింగ్ కావాలని ప్రయత్నిస్తున్నాడు మస్క్. గతంలో తన మిత్రుడు, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడి ట్రంప్ తో వివాదాల కారణంగా రాజకీయ రంగప్రవేశానికి సిద్దమయ్యారు... ఇందుకోసం కొత్త రాజకీయ పార్టీని పెట్టే ఆలోచనలో మస్క్ ఉన్నాడు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికన అమెరికన్ల అభిప్రాయ సేకరణ చేపట్టారు.
'కొత్త రాజకీయ పార్టీ పెట్టాలా? వద్దా' అంటూ మస్క్ ఎక్స్ లో పోల్ నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారిలో 80 శాతం మంది పార్టీ పెట్టాలనే సూచించారు... 20 శాతం మంది మాత్రం మస్క్ కొత్తపార్టీకి నో చెప్పారు. రెండురోజుల క్రితమే అంటే జూన్ 5 మస్క్ ఈ పోల్ పెట్టాడు... ఇప్పటివరకు దాదాపు 56 లక్షలమంది ఇందులో పాల్గొన్నారు.
మస్క్ పార్టీ పేరును కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 'ది అమెరికా పార్టీ' అనేది మస్క్ కొత్తపార్టీ పేరుగా తెలుస్తోంది. ఇది కేవలం ప్రస్తుతం అధికారంలో ఉన్న రిపబ్లికన్ పార్టీకే కాదు ప్రతిపక్ష డెమొక్రటిక్ పార్టీకి కూడా పెద్ద షాక్ అనే చెప్పాలి. అమెరికా రాజకీయాల్లో ఈ రెండు పార్టీలదే ఆధిపత్యం... ఇప్పుడు ఎలాన్ మస్క్ రాజకీయ రంగప్రవేశంలో త్రిముఖ పోరు తప్పేలా లేదు. వ్యాపారం రంగంలో సక్సెస్ అయిన మస్క్ రాజకీయాల్లో సక్సెస్ అవుతారో లేదో భవిష్యత్ నిర్ణయిస్తుంది... కానీ ఇప్పటికయితే అమెరికా ప్రజలు మస్క్ రాజకీయ రంగప్రవేశాన్ని అంగీకరిస్తున్నట్లు ఎక్స్ పోల్ ద్వారా స్పష్టమవుతోంది.
డొనాల్డ్ ట్రంప్ ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచినప్పుడు తన వ్యాపార కార్యకలాపాలను సైతం పక్కనబెట్టి మరీ ప్రచారంలో పాల్గొన్నారు ఎలాన్ మస్క్. ఈ ఎన్నికల్లో విజయం తర్వాత కూడా పాలనా వ్యవహారాల్లో ట్రంప్ కు అండగా నిలిచారు మస్క్. ఇలా రాజకీయంగా చాలా దగ్గరైన వీరిద్దరికి ఎక్కడ చెడిందోగానీ ఇప్పుడు బద్ద శత్రువులుగా మారారు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇదికాస్తా ముదిరి రాజకీయ వైరంగా మారుతోంది.
ట్రంప్ ను అమెరికా అధ్యక్షుడిగా గెలిపించింది తానేనని మస్క్ అంటున్నాడు... కానీ ఎవరిసాయం లేకుండానే గెలిచానని ట్రంప్ అంటున్నాడు. ఇక జెఫ్రీ ఎప్స్టైన్ లైంగిక వేధింపుల కేసులో ట్రంప్ పాత్ర ఉందని మస్క్ ఆరోపించారు... అందుకే ఈ కేసుకు సంబంధించిన వివరాలు బయటకు రాకుండా చూస్తున్నారని అంటున్నాడు.
అయితే తాజాగా ఎలాన్ మస్క్ తో వివాదంపై ట్రంప్ స్పందించారు. తనకు చాలా పనులున్నాయి, చాలా బిజీగా ఉన్నాను... మస్క్ గురించి ఆలోచించే సమయం లేదన్నారు. ఆయన బాగుండాలని కోరుకుంటున్నానంటూ సెటైరికల్ కామెంట్స్ చేసారు ట్రంప్. ఇదే సమయంలో మస్క్ కు చెందిన వ్యాపారసంస్థలు ప్రభుత్వం నుండి చాలా సబ్సిడీలు పొందాయని... అవన్నీ న్యాయబద్దంగా జరిగాయా అన్నది పరిశీలిస్తున్నామంటూ ట్రంప్ బాంబు పేల్చాడు. అంటే టెస్లాతో పాటు మస్క్ వ్యాపారసంస్థలను ట్రంప్ సర్కార్ టార్గెట్ చేసిందన్నది స్పష్టమవుతోంది.
తనను బిజినెస్ పరంగా దెబ్బతీయాలని చూస్తున్న ట్రంప్ ను రాజకీయంగా దెబ్బతీసేందుకు మస్క్ సిద్దమయ్యారు. అందుకే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటుచేసేందుకు సిద్దమయ్యాడు. మస్క్ కొత్త పార్టీ ట్రంప్ కు షాక్ ఇస్తుందా? అమెరికా రాజకీయాలను ప్రభావితం చేస్తుందా? లేదంటే ట్రంప్ నిర్ణయాలు మస్క్ వ్యాపార సామ్రాజ్యాన్ని కుప్పకూలుస్తుందా? లేదంటే మస్క్ తన వ్యాపారాలను కాపాడుకుంటాడా?... ఈ ప్రశ్నలకు భవిష్యత్ సమాధానం చెబుతుంది. ఇంతకాలం ప్రపంచ దేశాలతో ట్రేడ్ వార్ సాగించిన ట్రంప్ ఇప్పుడు సొంత దేశానికి చెందిన వ్యాపారవేత్తతో గొడవకు దిగారు. మస్క్ కూడా ఏమాత్రం తగ్గకుండా ట్రంప్ ను గట్టిగానే ఎదిరిస్తున్నాడు. వీరి వివాదం ఇంకా ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి.