శత్రుదేశానికి అనుకోకుండా లక్షల డాలర్లు పంపిన తాలిబాన్లు.. ‘తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు’

By Mahesh KFirst Published Dec 23, 2021, 6:03 AM IST
Highlights

తాలిబాన్లు చేసిన ఓ తొందరపాటు పని వల్ల ఎనిమిది లక్షల డాలర్ల డబ్బును మిస్ అయింది. అష్రఫ్ ఘనీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన తజకిస్తాన్ రాయబార కార్యాలయానికి తాలిబాన్లు ఈ మొత్తాన్ని ట్రాన్స్‌ఫర్ చేశారు. నాలుక్కరుచుకుని ఆ డబ్బు తిరిగి తమకు పంపాలని పొరుగు దేశాన్ని అడగ్గా వారు అందుకు తిరస్కరించారు. అసలే ఆర్థికం అంతంతగా ఉన్న ఆ దేశానికి తాలిబాన్ల పొరపాటు మరింత భారమైంది.
 

న్యూఢిల్లీ: అసలే కరువు.. ఆపై నిలిచిన విదేశీ సాయం.. రెండు దశాబ్దాల అంతర్యుద్ధంతో పతనం అంచులో దేశ ఆర్థిక వ్యవస్థ.. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్‌(Afghanistan)ను పాలిస్తున్న తాలిబాన్లు(Taliban) సొంతంగా బడ్టెట్ ప్రవేశపెట్టబోతున్నట్టు ఇటీవలే కొన్ని ప్రకటనలు వచ్చాయి. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే, అంతకు మించి చిత్రంగా అనిపించే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఆర్థికంతో సతమతం అవుతున్న సందర్భంలో ఆ దేశ పాలకులు తాలిబాన్లు పొరపాటున తమ శత్రు దేశానికి ఎనిమిది లక్షల డాలర్లను పంపింది. తమ డబ్బులు(Money) తమకు పంపించాల్సిందిగా ఆ దేశాన్ని అడగ్గా.. అది జరగని పని అని తెగేసి చెప్పినట్టు సమాచారం.

తాలిబాన్లు అనుకోకుండా పొరపాటున తజకిస్తాన్ రాయబార కార్యాలయానికి డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేశారు. సుమారు ఎనిమిది లక్షల డబ్బును ఆ కార్యాలయానికి పంపారు. అంతా జరిగిపోయాక.. ఓ సారి పరిశీలించగా తాము చేసిన తప్పు తెలిసి వచ్చింది. ఆ డబ్బును ఎలా తిరిగి తీసుకోవాలో అర్థం కాలేదు. ఈ నేపథ్యంలోనే వారు నేరుగా ఆ దేశానికి జరిగిన సంగతిని వివరించారు. తమ డబ్బును తమకు వెంటనే తిరిగి పంపాలని కోరారు. కానీ, ఆ దేశం అందుకు అంగీకరించలేదు.

Also Read: రెండు దశాబ్దాల్లో తొలిసారి.. విదేశీ సాయం లేకుండా ఆఫ్ఘనిస్తాన్ బడ్జెట్ ప్రిపేర్ చేస్తున్న తాలిబన్లు

తాలిబాన్లు ఉగ్రవాదులని, అటువంటి ఉగ్రవాదుల బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు పంపేదే లేదని తజకిస్తాన్ అధికారులు స్పష్టం చేశారు. తమ వద్దకు వచ్చిన తాలిబాన్ల డబ్బును తిరిగి పంపడం కుదరదని వారికి తెగేసి చెప్పినట్టు పేర్కొన్నారు. అయితే, తాలిబాన్లు పంపిన డబ్బును ఏం చేస్తారనే సందేహం కూడా మెదిలింది. ఈ సందేహానికి సమాధానం ఇస్తూ.. తాలిబాన్ల అరాచక పాలన పై వ్యతిరేకతతో చాలా మంది ఆఫ్ఘనిస్తాన్‌లు సరిహద్దు దాటి తజకిస్తాన్‌కు పారిపోయారు. వారిని శరణార్థి శిబిరాల్లో ఉంచి సౌకర్యాలు కల్పిస్తున్నది. తాజాగా తమ చేతికి చిక్కిన డబ్బును ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన శరణార్థుల బాగోగుల కోసం వెచ్చిస్తామని తెలిపారు. శరణార్థుల్లో పేదవారికి ఈ డబ్బులు ఖర్చు పెడతామని వివరించారు.

ఈ ఏడాది ఆగస్టులో Afghanistan చరిత్రలో కీలక పరిణామాలు జరిగాయి. ప్రజలు ఎన్నుకున్న అష్రఫ్ ఘనీ ప్రభుత్వాన్ని తాలిబన్లు(Taliban) హస్తగతం చేసుకన్నారు. కాబూల్‌ను సీజ్ చేసిన తాలిబన్లు తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కానీ, ఆగస్టులో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చేసి తాలిబన్లు దేశాన్ని తమ అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత విదేశీ సాయం నిలిచిపోయింది. ఐఎంఎఫ్ సహా పాశ్చాత్య, ఇతర దేశాలు విదేశీ సాయాన్ని నిలిపేశాయి. అప్పటికే ఆర్థికంగా(Economy) పతన దశలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌కు ఇది దారుణంగా దెబ్బ తీసింది. విదేశీ సాయాన్ని పునరుద్ధరించుకోవడానికి తాలిబన్లు ఛాందస వాదాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశారు. అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రయత్నాలు చేశారు. కానీ, అవి సఫలం కాలేదు. స్వయంగా పాకిస్తాన్ కూడా తాలిబన్లకు మద్దతుగా పలు అంతర్జాతీయ వేదికలపై గళం వినిపించారు.

Also Read: Afghanistan hunger crisis: ఆక‌లి కేక‌ల ఆఫ్ఘాన్..

ఇలాంటి సందర్భంలో రెండు దశాబ్దాల్లో ఆఫ్ఘనిస్తాన్ తొలిసారి విదేశీ సాయం లేకుండా బడ్జెట్‌(Budget)ను సిద్ధం చేస్తున్నది. డిసెంబర్ 2022 వరకు అమలయ్యే బడ్జెట్‌ను ప్రిపేర్ చేస్తున్నట్టు తాలిబన్లు వెల్లడించారు. తాలిబన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత అఫ్ఘానిస్తాన్ కరెన్సీ అఫ్ఘాని దారుణంగా పతనం అయింది. తాలిబన్లు రాక పూర్వం ఒక అమెరికన్ డాలర్ విలువ 80 అఫ్ఘానీలు కాగా, ఆ విలువ 130 అఫ్ఘానీలకు పడిపోయింది. తాజాగా, శుక్రవారం ఇది 100 అఫ్ఘానీలకు చేరింది.

click me!