ఆఫ్ఘనిస్తాన్: 200 మంది అమెరికన్లు, ఇతర విదేశీయుల తరలింపుకు తాలిబన్లు గ్రీన్ సిగ్నల్

By Siva KodatiFirst Published Sep 9, 2021, 3:37 PM IST
Highlights

200 మంది అమెరికన్లు, పలు ఇతర దేశాలకు చెందినవారు ఆఫ్ఘన్ ను వీడేందుకు తాలిబన్లు అంగీకరించారు. కాబూల్ నుంచి ప్రత్యేక విమానాల్లో వారిని తరలించేందుకు తాలిబన్లు ఒప్పుకున్నారని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ఆఫ్ఘన్ లో తాలిబన్ల మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైన రెండ్రోజుల తర్వాత ఈ మేరకు తాలిబన్లు నిర్ణయం తీసుకున్నారు

ఆగస్టు 31తో ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా దళాల నిష్క్రమణ పూర్తయినా, ఇంకా అక్కడ అనేకమంది అమెరికన్లు, ఇతర విదేశీయులు ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఆఫ్ఘన్ గడ్డపై వీరి భద్రతపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో, తాలిబన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. 200 మంది అమెరికన్లు, పలు ఇతర దేశాలకు చెందినవారు ఆఫ్ఘన్ ను వీడేందుకు వారు అంగీకరించారు. కాబూల్ నుంచి ప్రత్యేక విమానాల్లో వారిని తరలించేందుకు తాలిబన్లు ఒప్పుకున్నారని అమెరికా అధికారి ఒకరు తెలిపారు. ఆఫ్ఘన్ లో తాలిబన్ల మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైన రెండ్రోజుల తర్వాత ఈ మేరకు తాలిబన్లు నిర్ణయం తీసుకున్నారు. గత ఆగస్టులో అమెరికా 1,24,000 మంది విదేశీయులను, తమకు సహకరించిన ఆఫ్ఘన్లను తరలించిన సంగతి తెలిసిందే.

Also Read:అఫ్ఘాన్ జర్నలిస్టులపై తాలిబాన్ల క్రూరత్వం.. మహిళల ఆందోళనను కవర్ చేసినందుకు దాడి

మరోవైపు తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన రోజుల వ్యవధిలోనే పత్రికా స్వేచ్ఛపై దాడి జరిగింది. ప్రెస్ ఫ్రీడమ్‌కు ఆటంకం కలిగించబోమని గతంలో చేసిన వాగ్దానాలు నీటిమూటలని ఈ చర్యతో ప్రపంచానికి తాలిబాన్ చాటిచెప్పింది. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల ఆందోళనలను కవర్ చేయవద్దంటూ తాలిబాన్లు హుకూం జారీ చేశారు. ఆందోళనలను రిపోర్ట్ చేసిన జర్నలిస్టులపై క్రూరంగా దాడి చేసింది. ఓ గదిలో బంధించి హింసించింది. అలా తాలిబాన్ల చేతిలో దాడికి గురై దేహమంతా హూనమైన జర్నలిస్టుల గాయాల చిత్రాలు సోషల్ మీడియాలో ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా ఇద్దరు జర్నలిస్టులు తమ వెన్ను భాగాన్ని కెమెరాకు చూపిస్తున్న ఫొటోలూ తాలిబాన్ల దుర్మార్గాన్ని కళ్లకు కట్టినట్టూ వెల్లడించాయి.
 

click me!