చిన్నప్పటి నుంచి కన్ను మూసిందే లేదు.. ఆ మహిళ వింత ప్రవర్తనతో వైద్యులకు షాక్

By telugu team  |  First Published Sep 8, 2021, 7:47 PM IST

ఆ మహిళ 40 ఏళ్లుగా నిద్రించడం లేదు. రాత్రిళ్లు ఇల్లు శుభ్రం చేస్తూ రోజంతా ఎప్పటిలాగే అందరితో పనిలో నిమగ్నమవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైద్యులూ షాక్‌కు గురయ్యారు. భర్త అయితే స్లీపింగ్ పిల్స్ వేసినా ఫలితం లేదని చెప్పారు. చివరికి బీజింగ్‌లోని స్లీప్ సెంటర్ స్పెషలిస్టులు ఇందుకు కారణాలు పట్టుకోగలిగారు.


న్యూఢిల్లీ: రెండు గంటల నిద్ర తక్కువైనా రోజంతా అదోలా గడుస్తుంది. కొందరికైతే నిద్ర ఎప్పుడూ కంటి మీదే ఉంటుంది. పది నిమిషాల సమయం చిక్కినా ఏదో విధంగా కునుకుతీసేస్తుంటారు. ఈ భూప్రపంచం మీద పూర్తిగా నిద్ర పోనివారుంటారా? అంటే కచ్చితంగా ఉండరని చెబుతారు. కానీ, చైనాకు చెందిన ఓ వనిత ఇందుకు మినహాయింపుగా కనిపిస్తున్నారు. చిన్నప్పటి నుంచి ఆమె కన్నుమూసి నిద్రపోయిందే లేదు. రాత్రిళ్లు నిద్రపట్టక ఇల్లు శుభ్రం చేస్తూ గడుపుతారు. రోజంతా అందరిలాగే సాధారణంగా పనిలో నిమగ్నమవుతారు. ఈ వింత ప్రవర్తన గల మహిళ పేరు లీ జేనియింగ్. చైనాలోని హెనాన్ ప్రావిన్స్ నివాసి. చివరిగా తాను నిద్రపోయింది తన ఐదవ యేట అని ఆమె వివరించారు. ఈ వివరణతో వైద్యులు ఖంగుతిన్నారు. ఈ వింత ప్రవర్తనకు కారణమేంటా? అని తలలు పట్టుకున్నారు.

ఈ వింత అలవాటుతో జేనియింగ్ చుట్టుపక్కల ఫేమస్ అయిపోయారు. కానీ, చాలా మందిలో ఆమె అబద్ధం ఆడుతున్నారని అనుమనం. ఓ రోజు కావాలనే ఆమెను పరీక్షించడానికే పూనుకున్నారు. ఆ రోజు రాత్రి జేనియింగ్ ఇంటికెళ్లి రాత్రంతా ఆమెను పరిశీలించాలనుకున్నారు. కార్డ్స్ ఆడారు. బాతాఖాని కొట్టారు. కానీ, కొందరు నిద్ర ఆపుకోలేక టేబుల్స్ పై పడుకోగా, ఇంకొందరు వారివారి ఇంటికెళ్లిపోయారు. కానీ, జేనియింగ్ మాత్రం పడుకోలేదు.

Latest Videos

undefined

జేనియింగ్ భర్త లూయి సుకిన్ ఇదే విషయాన్ని చెప్పారు. తన భార్య పడుకుంటుండగానే తానెప్పుడూ చూడలేదన్నారు. రాత్రిళ్లు ఇల్లు శుభ్రం చేస్తూ గడుపుతారని చెప్పారు. ఇన్సోమ్నియా కావచ్చని ఆమెకు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసినా పడుకోలేదని వివరించారు. తర్వాత ఆమెను వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారని చెప్పారు. నిద్రలేని రాత్రులు గడపడానికి గల కారణాలను ఆ వైద్యుల తేల్చలేకపోయారు. ఇదంతా కాదని, బీజింగ్‌లోని స్లీప్ సెంటర్ స్పెషలిస్టుల దగ్గరకు ఆమెను తీసుకెళ్లారు. అక్కడ విషయం బయటపడింది.

లీ జేనియింగ్ కూడా నిద్రిస్తారని, కానీ, అందరూ పడుకున్నట్టుగా కాదని నిపుణులు చెప్పారు. ఆమె కంటి రెప్పలు కొట్టకోవడం ఒక్కోసారి మందగిస్తుంటాయని, అప్పుడే ఆమె పడుకుంటారని వివరించారు. ఆమె తన భర్తతో మాట్లాడుతుండగా కూడా పడుకున్నారని వివరించారు. ఆ ఫలితాలను బ్రెయిన్‌వేవ్ మానిటర్‌ పట్టేసింది. నిద్రలో నడిచేవారి తీరును ఉదహరిస్తూ ఇదీ అలాంటిదేనని చెప్పారు. నిద్రలో నడిచేవారిలో బ్రెయిన్ విశ్రాంతి తీసుకుంటున్నా, బాడీ మాత్రం యాక్టివ్‌గా ఉంటుందన్నారు. ఇదే తరహాలో లీ కూడా కళ్లు కొట్టుకోవడం సన్నగిల్లిన ఆ పది నిమిషాల్లోనే కునుకు తీస్తారని, అయినప్పటికీ ఆమె అప్పుడు యాక్టివ్‌గానే ఉంటారని చెప్పారు. ఈ కారణం చేతనే ఆమె 40 ఏళ్లుగా నిద్రించట్లేదని తేల్చారు.

click me!