
అధికారంలో వస్తే మంచి పాలన అందిస్తామని, స్త్రీలకు కూడా చదువుకునేందుకు ,ఉద్యోగం చేసేందుకు అవకాశం కల్పిస్తామని చెప్పిన తాలిబన్ల మాటలు నీటి మీద రాతలే అయ్యాయి. తాలిబన్లు అధికారం అందుకున్న రోజున లక్షలాది మంది ఆఫ్ఘాన్లు దేశం విడిచి ఎందుకు పారిపోయారో ... వారంతా ఎందుకు భయపడ్డారో ఇప్పుడు ఆ ఘటనలే దేశంలో జరుగుతున్నాయి. అంతర్జాతీయ సమాజం దృష్టి మరల్చేందుకు గాను తాము మారిపోయినట్లుగా నటించారు. కానీ పోను పోను మానవహక్కులను తుంగలో తొక్కడం ప్రారంభించారు.
స్త్రీలపై ఒక్కొక్కటిగా కఠిన నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. తాజాగా నేరాల విచారణకు సంబంధించి షరియా చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని న్యాయమూర్తులను ఆఫ్ఘన్ సుప్రీం లీడర్ అలైకడర్ అమిరుల్ ఈ వారం ప్రారంభంలో ఆదేశించారు. షరియా చట్ట పరిధిలోకి వచ్చే కేసుల్లో ఆ చట్టం ప్రకారమే శిక్షలు విధించాలని అమిరుల్ సూచించారు. ఆయన ఆదేశాలు అమల్లోకి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ALso REad:ఆఫ్ఘాన్‌లో నిజ స్వరూపం చూపిస్తోన్న తాలిబన్లు : అమల్లోకి షరియా చట్టం.. మళ్లీ బహిరంగ శిక్షలు
దీనిలో భాగంగా వివిధ నేరాల్లో ప్రమేయం వున్న మహిళలు సహా 19 మందికి బహిరంగంగా కొరడా దెబ్బల శిక్ష విధించినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. షరియా చట్టానికి లోబడి ఈ శిక్షలు విధించినట్లు తాలిబన్లు చెబుతున్నారు. ఈశాన్య ఆఫ్ఘన్ ప్రాంతమైన తఖార్ ప్రావిన్సులోని తలూఖన్ నగరంలో ఈ శిక్షలు విధించినట్లుగా సమాచారం. వీరిలో పది మంది పురుషులు, 9 మంది మహిళలు వున్నారు. నవంబర్ 11న మత పెద్దలు, విద్యావంతులు, స్థానికుల సమక్షంలో ఈ శిక్షను అమలు చేసినట్లుగా తెలుస్తోంది.
ఇకపోతే.. గత వారం తాలిబన్లు మరో కఠిన నిబంధన తీసుకొచ్చారు. పార్కులు, జిమ్‌లలోకి మహిళలు ప్రవేశించకుండా నిషేధం విధించారు. అలాగే అన్ని రకాల అమ్యూజ్‌మెంట్ పార్కుల్లోకి మహిళలు వెళ్లరాదని హుకుం జారీ చేశారు. ఇప్పటికే దేశ రాజధాని కాబూల్‌లో ఈ నిబంధన అమలవుతోంది. దీంతో విషయం తెలియకుండా పార్కుల్లోకి వెళ్లిన మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి పార్కుల్లో సేద తీరుదామని భావిస్తున్న ఆడవాళ్లకు తాజా నిబంధన నిరాశకు గురిచేస్తోంది.