అమెరికాలోని గే నైట్ క్లబ్‌లో కాల్పులు.. ఐదుగురు మృతి, 18 మందికి గాయాలు..

By Sumanth KanukulaFirst Published Nov 20, 2022, 4:44 PM IST
Highlights

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. కొలరాడోలోని గే నైట్ క్లబ్‌లో చోటుచేసుకున్న సామూహిక కాల్పుల్లో ఐదుగురు మరణించగా, 18 మంది గాయపడ్డారని అక్కడి పోలీసులు తెలిపారు.

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. కొలరాడోలోని గే నైట్ క్లబ్‌లో చోటుచేసుకున్న సామూహిక కాల్పుల్లో ఐదుగురు మరణించగా, 18 మంది గాయపడ్డారని అక్కడి పోలీసులు తెలిపారు. కొలరాడో స్ప్రింగ్స్‌లోని క్లబ్ క్యూ గే నైట్‌క్లబ్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలిపారు. కొలరాడో స్ప్రింగ్స్ పోలీస్ లెఫ్టినెంట్ పమేలా కాస్ట్రో మాట్లాడుతూ.. తాము క్లబ్ లోపల అనుమానితుడిగా భావిస్తున్న ఒక వ్యక్తిని గుర్తించారని చెప్పారు. అయితే అనుమానితుడికి గాయాలు కావడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు. 

అనుమానితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడని పమేలా కాస్ట్రో చెప్పారు. అయితే కాల్పుల్లో గాయపడిన వ్యక్తుల సంఖ్యలో.. అనుమానితుడిని చేర్చారా? లేదా? అనేది పమేలా కాస్ట్రో స్పష్టం చేయలేదు. అయితే తాము రాబోయే మరికొన్ని గంటల పాటు ఘటన స్థలంలోనే ఉంటామని చెప్పారు. 

అయితే ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారనే దానిపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు. కొలరాడో స్ప్రింగ్స్ ఫైర్ కెప్టెన్ మైక్ స్మాల్డినో మాట్లాడుతూ.. 911‌కు ఫోన్ కాల్స్ వచ్చిన తర్వాత 11 అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు. 


క్లబ్ క్యూ సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో.. తమ సంఘంపై తెలివిలేని దాడితో వినాశనం జరిగిందని పేర్కొంది. బాధితులకు, వారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది. కాల్పులు జరిపిన వ్యక్తిని లొంగదీసుకుని.. ద్వేషపూరిత కాల్పులకు ముగింపు పలికిన వీరోచిత కస్టమర్ల త్వరిత ప్రతిచర్యలకు తాము ధన్యవాదాలు తెలుపుతున్నట్టుగా పేర్కొంది. 
 

click me!