
న్యూఢిల్లీ: తైవాన్ మిసైల్ డెవలప్‌మెంట్ టీమ్ ఇంచార్జీ అనుమానాస్పదంగా మరణించారు. ఆయన మృతదేహం శుక్రవారం ఓ హోటల్ గదిలో లభించింది. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా గుర్తించలేకపోతున్నారు.
తైవాన్ డిఫెన్స్ మినిస్ట్రీకి చెందిన రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ యూనిట్ డిప్యూటీ హెడ్‌గా ఓ యాంగ్ లిహసింగ్ సేవలు అందించారు. మిలిటరీ పరిధిలోని నేషనల్ చుంగ్ షాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి ఆయన డిప్యూటీ హెడ్. ఈ సంస్థ తైవాన్‌లో మిసైళ్ల తయారీ వేగాన్ని పెంచడానికి పాటుపడుతున్నది. ఈ ఏడాది మిసైల్ కెపాసిటీని 500కు పెంచాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. చైనా నుంచి మిలిటరీ ముప్పు పెరుగుతున్న తరుణంలో తైవాన్ ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
ఈ ఇన్‌స్టిట్యూట్‌కు డిప్యూటీ హెడ్‌గా ఉన్న ఓ యాంగ్ లిహసింగ్ బిజినెస్ ట్రిప్‌లో భాగంగా దక్షిణ తైవాన్‌లోని పింగ్‌టుంగ్ వెళ్లినట్టు సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ దక్షిణ తైవాన్‌లోని ఓ హోటల్ రూమ్‌లో ఆయన విగత జీవై కనిపించారు.
తైవాన్‌కు చెందిన అనేక రకాల మిసైల్ తయారీ ప్రాజెక్టులను ఆయన పర్యవేక్షించే బాధ్యతలు ఈ ఏడాదిలోనే తీసుకున్నారు.
నేడు తైవాన్, చైనాల మధ్య మునుపెన్నుడూ లేని స్థాయిలో ఉద్రిక్తతలు పెరిగాయి. అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సి పెలోసి తైవాన్ పర్యటించడాన్ని చైనా సహించడం లేదు. నాన్సి పెలోసి తైవాన్ పర్యటించొద్దని చైనా ఆమె పర్యటనకు ముందే అమెరికాకు వార్నింగ్ ఇచ్చింది. కానీ, ఆమె పర్యటన సాగింది.
ఆమె తైవాన్‌లో అడుగుపెట్టిన రోజునే చైనా నుంచి నావికా దళానికి చెందిన నౌకలు తైవాన్ తీరం వైపు బయల్దేరాయి. అక్కడ మిలిటరీ డ్రిల్స్ చేశాయి. అలాగే, నాన్సి పెలోసి తైవాన్‌కు వస్తుండగానే.. తైవాన్ కూడా చైనాతో యుద్ధానికి సిద్ధం అవుతున్నట్టు కథనాలు వచ్చాయి. తైవాన్ మిలిటరీని హై అలర్ట్‌లో ఉంచింది.
నాన్సి పెలోసి తైవాన్ పర్యటించిన తర్వాతి రోజే చైనాకు చెందిన 27 చైనా ఫైటర్ జెట్లు తైవాన్ గగనతలంలోకి వెళ్లినట్టు ఆ దేశం తెలిపింది. చైనా కూడా గతంలో ఎన్నడూ చేయలేని స్థాయిలో మిలిటరీ ఎక్సర్‌సైజ్ చేపట్టింది. నీటిలో లైవ్ ఫైరింగ్ జరపడంతోపాటు తైవాన్ చుట్టూ గగనతలాన్ని చైనా తన డ్రిల్‌కు ఉపయోగించుకుంది.