
న్యూఢిల్లీ: ఆఫ్గనిస్తాన్‌కు ఉగ్ర బెడద ఏ రూపంలోనైనా తప్పడం లేదు. ఎన్నికల ద్వారా ఎన్నుకున్న ప్రభుత్వం ఉన్నప్పటికీ సుమారు 20 ఏళ్లు తాలిబాన్లు విధ్వంసం సృష్టించారు. అంతకు ముందు వారి అధికారంలోనూ ఆఫ్గనిస్తాన్ ప్రజలు అనేక అకృత్యాలను ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆ తాలిబాన్లే అధికారంలోకి వచ్చారు. తాలిబన్లు హరిస్తున్న ప్రజల హక్కులు ఒక వైపు కుదిపేస్తుండగా.. ఉగ్ర బెడద మాత్రం ఇప్పటికీ పొంచే ఉన్నది. తాలిబాన్లకు, ఐఎస్‌లకు పొసగదని తెలిసిందే. అందుకే తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పటికీ ఐఎస్ ఉగ్రవాదులు మాత్రం రక్తపాతాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అంటే.. ఆఫ్గనిస్తాన్ ప్రజలు ఇటు అధికారంలో.. అటూ అంధకారంలోనూ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటూనే ఉన్నారు.
తాజాగా, ఆఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో ఐఎస్ ఉగ్రవాదులు ఉగ్రబీభత్సం సృష్టించారు. బాంబులతో విధ్వంసం చేశారు. ఇందులో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. 18 మంది తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఈ బాంబులు పేలాయి. ఇందుకు బాధ్యత వహిస్తూ ఇస్లామిక్ స్టేట్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆఫ్గనిస్తాన్‌లో అతిపెద్ద మైనారిటీ సముదాయం హజరాస్‌లే లక్ష్యంగా ఈ దాడులకు పాల్పడినట్టు ఆ ఉగ్రవాద సంస్థ తెలిపింది. ముఖ్యంగా మహిళలు, చిన్నారులను ఐఎస్ టార్గెట్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. కాబూల్‌లో ఉన్న ఓ మసీదు దగ్గర గుమిగూడిన మహిళలు, చిన్నారులే లక్ష్యంగా బాంబు పేల్చినట్టు స్థానిక మీడియా పేర్కొంది.
కాబూల్‌లో శుక్రవారం రెండు పేలుళ్లు సంభవించాయని మీడియా తెలిపింది. పశ్చిమ కాబూల్‌లో హజరాస్‌లను లక్ష్యంగా చేసుకుని బాంబు పేల్చింది. అలాగే, సార్ ఇ కరీజ్ ఏరియాలో మహిళలు ప్రార్థనలు చేసే ఇమామ్ బాకిర్ మసీదు దగ్గర కూడా బాంబుతో విధ్వంసం సృష్టించింది.