
Japan Former PM Shinzo Abe : జపాన్ మాజీ ప్రధాని షింజో అబే శుక్రవారం మరణించారు. న్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తుండగా, వెనుక నుంచి ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జపాన్ కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో నారా ప్రాంతంలో చోటుచేసుకుంది. ఆయన మృతి పట్ల ఆసియా సహా ప్రపంచంలోని ఇతర దేశాల నేతలు, రాయబారులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయన ప్రపంచ నాయకత్వం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు.
నా మిత్రుని మరణం ఎంతో బాధ కలిగించింది: ప్రధాని నరేద్ర మోడీ
షింజో అబే మరణం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, నా ప్రియమైన స్నేహితులలో ఒకరైన షింజో అబే మరణం పట్ల నేను చాలా బాధపడ్డాను అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. షింజో అబే జపాన్ తో పాటు యావత్ ప్రపంచాన్ని ఒక మంచి ప్రదేశంగా మార్చడానికి తన జీవితాన్ని అంకితం చేశారని పేర్కొన్నారు. జపాన్ మాజీ ప్రధాని అబే పట్ల మా ప్రగాఢ గౌరవానికి గుర్తుగా, జూలై 9న ఒకరోజు జాతీయ సంతాపాన్ని పాటించనున్నామని ప్రకటించారు. ఆయనతో కలిసి వున్న ఫొటోలను షేర్ చేశారు.
ప్రపంచ నాయకత్వం చరిత్రలో నిలుస్తుంది: బ్రిటన్ పీఎం బోరిస్ జాన్సన్
షింజో అబే గురించి చాలా విచారకరమైన వార్తలు అందాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ట్వీట్ చేశారు. అతని ప్రపంచ నాయకత్వం చాలా మందికి గుర్తుండిపోతుంది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబం, జపాన్ వాసులకు యూకే అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య రక్షకుడు.. : ఆస్ట్రేలియా
జపాన్ మాజీ ప్రధాని అబే షింజో మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అన్నారు. ఆయన ఆస్ట్రేలియాకు చాలా మంచి స్నేహితుడని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి, జపాన్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. "ఈ దుఃఖ సమయంలో మేము మీతో ఉన్నాం. జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురైనందుకు బాధగా ఉందని" నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ అన్నారు. అబే ప్రజాస్వామ్యానికి రక్షకుడని, చాలా ఏళ్లుగా నాకు మంచి స్నేహితుడు, సహోద్యోగి అని స్టోల్టెన్‌బర్గ్ ట్వీట్ చేశారు.
దిగ్భ్రాంతికి గురి చేసింది: న్యూజిలాండ్ ప్రధాని
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే మరణం గురించి వినడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ పేర్కొన్నారు. తాను ప్రధాని అయినప్పుడు కలిసిన తొలి నాయకులలో ఆయన ఒకరని తెలిపారు. ఈ బాధకరమైన సమయంలో ఆయన కటుంబానికి, జపాన్ ప్రజలకు అండగా ఉంటామంటూ సంతాపం తెలిపారు. ఇలాంటి సంఘటనలు మనందరినీ కలిచివేస్తాయని పేర్కొన్నారు.