
న్యూఢిల్లీ: జపాన్ మాజీ ప్రధాని షింజో అబే హత్యకు గురయ్యారు. ఓ పొలిటికల్ ఈవెంట్ (ఎన్నికల ప్రచార క్యాంపెయిన్) లో ఆయన ప్రసంగిస్తుండగా దుండగుడు ఆయనపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఆయన అక్కడే కుప్పకూలాడు. వెంటనే ఆయనను హాస్పిటల్‌కు తరలించారు. బుల్లెట్ గాయాలతో షింబో అబే చాలా రక్తాన్ని కోల్పోయాడు. వీలైనంత త్వరగా చికిత్స మొదలు పెట్టి రక్తాన్ని ఎక్కించారు. కానీ, ఆరోగ్య పరిస్థితి విషమించి మరణించారు. మాజీ పీఎం షింబో అబేపై కాల్పులు జరిపిన షూటర్‌ను స్పాట్‌లోనే బలగాలు పట్టుకున్నాయి. ఆ షూటర్‌ను దర్యాప్తు చేయగా సంచలన వ్యాఖ్యలు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
రాజకీయ విశ్వాసాలకు సంబంధించి తనకు షింజో అబేపై ఎలాంటి కక్ష లేదని షూటర్ పోలీసులకు తెలిపినట్టు తెలిసింది. కానీ, తాను షింజో అబేపై అసంతృప్తిగా ఉన్నట్టు పేర్కొన్నట్టు సమాచారం. అందుకే షింజో అబేను చంపాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పినట్టు స్థానిక మీడియా ఓ కథనంలో వెల్లడించింది. షూటర్‌ను 41 ఏళ్ల తెత్సుయా యమగామిగా గుర్తించారు. ఆయన మ్యారీటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్‌లో మూడేళ్లు 2005 వరకు పనిచేసినట్టు తెలిసింది.
తెత్సుయా యమగామి నారా ఏరియాకు చెందినవాడే కావడం గమనార్హం. జపాన్‌లో గన్ కంట్రోల్ చట్టాలు కఠినంగా ఉంటాయి. అయితే, తెత్సుయా యమగామి హ్యాండ్ మేడ్ గన్ వాడినట్టు పోలీసులు తెలిసింది. షింజో అబేను షూట్ చేసిన తర్వాత పోలీసులు తన వైపు పరుగెత్తుకు వస్తుండగా తెత్సుయా యమగామి నిశ్చలంగా నిలిచినట్టు తెలిసింది. స్పాట్ నుంచి పరుగెత్తడం లేదా.. పోలీసుల అరెస్టును తప్పించుకోవడం కాని చేయకపోవడం గమనార్హం.
షింజో అబే తూర్పు ఒసాకాలోని నారాలో ఎలక్షన్ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రసంగిస్తున్నారు. అప్పుడు షూటర్ తత్సుయా యమగామి షింజో అబే వెనుక నుంచి ఆయనకు సమీపంగా వెళ్లినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. ఫస్ట్ బుల్లెట్ శబ్దం కాగానే.. ఎవరూ నేల పడిపోవడాన్ని తాను చూడలేదని అన్నారు. రెండో సారి బుల్లెట్ శబ్దం రాగానే షింజో అబే కుప్పకూలిపోవడాన్ని చూశానని వివరించారు. షింజో అబేను కాల్చిన తర్వాత షూటర్ తన గన్‌ను అక్కడే నేలపై పడేసినట్టు చెప్పారు.