సమయస్పూర్తితో 66మంది ప్రాణాలు కాపాడిన ఏడో తరగతి విద్యార్థి...ఎలాగంటే...

By SumaBala BukkaFirst Published Apr 28, 2023, 2:56 PM IST
Highlights

స్కూలు బస్సు డ్రైవర్ స్ఫృహ తప్పడంతో ఓ ఏడో తరగతి విద్యార్థి స్టీరింగ్ ను హ్యాండిల్ చేసి 66 మంది విద్యార్థులను కాపాడాడు. బుధవారం ఈ ఘటన జరిగింది. 

అమెరికా : ఓ ఏడో తరగతి విద్యార్థి సమయ స్పూర్తి 66 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడింది. స్కూలు డ్రైవర్ అకస్మాత్తుగా అపస్మారక స్థితిలో పడిపోవడంతో ఆ విద్యార్థి బస్సును నియంత్రించాడు. తన స్నేహితులు, ఇతర విద్యార్థుల ప్రాణాలను కాపాడాడు. ఈ ఘటన బుధవారం మిచిగాన్‌లో చోటుచేసుకుంది. వారెన్ కన్సాలిడేటెడ్ స్కూల్స్ విడుదల చేసిన వీడియోలో బస్సు నడుపుతున్నప్పుడు డ్రైవర్ అస్వస్థతకు గురవ్వడం.. వెంటనే విద్యార్థి డిల్లాన్ రీవ్స్ స్టీరింగ్ వీల్‌ను పట్టుకోవడం కనిపిస్తుంది. 

ఫాక్స్ 2 డెట్రాయిట్ ప్రకారం, డిల్లాన్.. బనెర్ట్ రోడ్ సమీపంలోని మసోనిక్ బౌలేవార్డ్‌లో బస్సును సురక్షితంగా ఆప గలిగాడు. సూపరింటెండెంట్ రాబర్ట్ లివెర్నోయిస్ మాట్లాడుతూ, ఆ సమయంలో బస్సు ఇన్‌కమింగ్ ట్రాఫిక్‌లోకి ప్రవేశిస్తోంది. ఆ బాలుడు బస్సును హ్యాండిల్ చేస్తూనే... "ఎవరైనా 911కి కాల్ చేయండి. తక్షణమే" అంటూ బస్సులో ఉన్న మిగతా విద్యార్థులకు చెప్పాడు. సంఘటన జరిగిన సమయంలో దాదాపు 66 మంది బస్సులో ఉన్నారు. ఇతర విద్యార్థుల అరుపులు కూడా సదరు వీడియోలో వినిపిస్తున్నాయి.

పాకిస్తాన్‌లో పోలీసు స్టేషన్లో జంట పేలుళ్లు.. 8 మంది దుర్మరణం

డ్రైవర్ తనకు ఆరోగ్యం బాగాలేదని తన పై అధికారులకు వాకీటాకీలో చెప్పాడు. కాసేపటికే అతను కూలిపోయాడు. ఆ సయమంలో డిల్లాన్ డ్రైవర్ కంటే ఐదు వరుసల వెనుక ఉన్న సీట్లో ఉన్నాడు. డ్రైవర్ స్పృహ కోల్పోవడాన్ని గమనించిన తర్వాత సెకన్లలో దూసుకొచ్చి స్టీరింగ్ పట్టుకున్నాడు. 

"ప్రమాదం సమయంలో ఇంత త్వరగా రెస్పాండ్ అయిన 7వ తరగతి విద్యార్థి సమయస్పూర్తికి అభినందనలు. డ్రైవర్‌ బాధను గమనించి బస్సు ముందుకి వచ్చి, ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆపాడు. వారెన్ పోలీసులు, అగ్నిమాపక శాఖలు వెంటనే స్పందించి బస్సును ప్రమాదంలో పడకుండా కాపాడాయి. విద్యార్థులు తమ ఇంటికి వెళ్లేందుకు వేరే బస్సులో సురక్షితంగా పంపించాం" అని లివర్నోయిస్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ఘటన తరువాత గురువారం నాడు డిల్లాన్‌కు  పాఠశాల మొత్తం సెల్యూట్ చేసింది. అతను చేసిన పనికి మెచ్చుకుంది. ఇక ఈ సమయంలో డ్రైవరు మత్తులో ఉన్నాడా? లేక అస్వస్థతకు మరే కారణమైనా ఉందా? అనే దిశగా దర్యాప్తు ప్రారంభించబడిందని పోలీసులు తెలిపారు. 

click me!