వారం రోజులు ఇంటి వద్దే ఉండండి.. జీతాలిస్తాం.. కరోనా కట్టడి కోసం నిర్ణయం

By telugu team  |  First Published Oct 23, 2021, 8:28 PM IST

కరోనా కట్టడికి రష్యా ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. టీకా పంపిణీ మందగించిన ఈ దేశంలో వైరస్ కట్టడికి ప్రజలను ఇంటి నుంచి బయట అడుగుపెట్టనీయకపోవడమే ఉత్తమమైన మార్గంగా వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం భావించింది. అందుకే ఈ నెల 30వ తేదీ నుంచి ఉద్యోగులు ఇంటికే పరిమితం కావాలని, ఆ సెలవుల కాలంలోనూ జీతాలు అందిస్తామని ప్రకటించింది. 30వ తేదీ నుంచి వారం పాటు పెయిడ్ లీవ్స్ ఇవ్వనున్నట్టు తెలిపింది.
 


న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రపంచాన్నే అతలాకుతలం చేసింది. లక్షలాది మందిని పొట్టనబెట్టుకుని ఇంకా దాని ప్రతాపాన్ని చూపిస్తున్నది. భారత్‌లో రెండు వేవ్‌లు విలయం సృష్టించి కాస్త స్తిమిత పడ్డా కొన్ని దేశాల్లో ఇంకా ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉన్నది. చైనా, రష్యా సహా పలుదేశాల్లో ఇంకా కరోనా వైరస్ కరాళనృత్యం చేస్తున్నది. ప్రస్తుతం ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి అందుబాటులో ఉన్న అస్త్రం టీకానే అని ప్రపంచదేశాలు స్పష్టం చేశాయి. అందుకే టీకా పంపిణీని వేగవంతంగా చేపడుతున్నాయి. ప్రపంచానికి తొలి టీకా అందించిన రష్యా మాత్రం టీకా పంపిణీలో వెనుకంజలోనే ఉన్నది. దేశంలో మూడింట ఒక వంతు మందికే రెండు డోసుల టీకా పంపిణీ చేసింది. తాజాగా, మరోసారి కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో కట్టడి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. కానీ,
పౌరులు మాత్రం కొవిడ్ నిబంధనల పాటించడంలో అలసత్వం వహిస్తున్నారు. దీంతో తాజాగా రష్యా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

ప్రజలను ఇంటి నుంచి బయట అడుగుపెట్టకుండా చేసే ఉపాయంపై అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం తీవ్రంగా యోచించింది. కనీసం వారం రోజులైనా వారిని ఇంటి నుంచి కదలనివ్వద్దని నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగా ఈ నెల 30వ తేదీ నుంచి వారం రోజులపాటు అంటే నవంబర్ 7వ తేదీ వరకు ప్రజలు ఇంటికే పరిమితం కావాలని, అయినప్పటికీ వారికి జీతాలందిస్తామని వెల్లడించింది. అంటే వారంపాటు పెయిడ్ లీవ్స్ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది.

Latest Videos

undefined

Also Read: Delta Variant AY 4.2 : యూకేను వణికిస్తున్న కొత్త రకం వేరియంట్

అక్టోబర్ 30 నుంచి వారం రోజులపాటు నాన్ వర్కింగ్ పీరియడ్ రూపొందించాలన్న క్యాబినెట్ నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నట్టు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. ఆ వారంలోని ఏడు రోజుల్లో నాలుగు రోజులు హాలీడేలే ఉన్నాయని వివరించారు. కాబట్టి, అదంతా కష్టం కాదని పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయని చెప్పారు. ఆ ప్రాంతాల్లో 30వ తేదీ కంటే ముందు నుంచే పెయిడ్ లీవ్స్ అందుబాటులోకి తెస్తామని, నవంబర్ 7వ తేదీ తర్వాత కూడా అవసరమైతే పొడిగించే యోచనలో ఉన్నట్టు వివరించారు.

ప్రజల ప్రాణాలు కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని, భయంకరమైన ఈ మహమ్మారిని కట్టడి చేయాల్సిందేనని వీడియో కాల్‌లో ఉన్నతాధికారులతో పుతిన్ అన్నారు. కరోనాను అంతం చేయడానికి ముందు దాని వ్యాప్తిని తగ్గించాలని సూచించారు. ఇప్పటికే హెల్త్ కేర్ సిస్టమ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నదని, కాబట్టి, పెయిడ్ లీవ్ మంచి ఆలోచనే అని వివరించారు.

Also Read: వీడియోలను చూడడంలో చైనాను అధిగమించిన భారత్.. ప్రజలు రోజుకు ఎన్ని గంటలు మొబైల్ పై గడుపుతున్నారంటే?

రష్యాలో టీకాపై నమ్మకం ఇంకా కుదరలేదు. చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రజలు తప్పకుండా టీకా వేసుకోవాలని కోరారు. వీలైనంత తొందరగా టీకా వేసుకోవానలి అభ్యర్థించారు. ఇది మీ ప్రాణాలు, మీ ఆప్తుల ప్రాణాలకు సంబంధించిన విషయమని తెలిపారు. ప్రస్తుతం మన ముందు రెండే దారులున్నాయని, ఒకటి కరోనా బారిన పడటం, రెండోది టీకా వేసుకుని సురక్షితంగా ఉండటమని పేర్కొన్నారు. మనకు ఉత్తమమైన వ్యాక్సిన్ ఉన్నదని, దానితో వైరస్‌ను కచ్చితంగా కట్టడి చేయవచ్చని పుతిన్ తెలిపారు. అయినప్పటికీ టీకా వేసుకోవడమేమిటని, అసలు ఏం జరుగుతున్నదో తనకు అర్థం కావడం లేదని వివరించారు.

click me!