
జకర్తా: ముస్లిం జనాభా అధికంగా ఉండే Indonesiaకు Hindu మత చరిత్రలో ప్రముఖ స్థానం ఉన్నది. బౌద్ధం, హిందూ మతాలు ఓ దశలో ఈ నేలపై విలసిల్లాయి. తర్వాత అరబ్బుల రాకతో పతనస్థాయికి చేరాయి. Muslim మెజార్టీగా ఉన్నప్పటికీ హిందూ ఆలయాలు.. ఇంకెన్నో మతపరమైన ప్రాంతాలకు పర్యాటక కేంద్రంగా ఈ దేశం నిలుస్తున్నది. తాజాగా, హిందూ మత అంశం ప్రధానంగా ఈ దేశం అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది. ఇండోనేషియా వ్యవస్థాపక అధ్యక్షుడు సుకర్నో కూతురు దియా ముతియారా సుక్మావతి సుకర్నోపుత్రి హిందూ మతాన్ని స్వీకరించబోతున్నారు.
69ఏళ్ల సుక్మావతి సుకర్నోపుత్రి దేశ ఐదో అధ్యక్షుడు మేగావతి సుకర్నోపుత్రికి సహోదరి. తాజాగా, Sukmawati Soekarnoputri హిందూ మతాన్ని స్వీకరించే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రత్యేకంగా సాంప్రదాయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలోనే ఆమె హిందూ మతాన్ని స్వీకరించబోతున్నారు. ఈ కార్యక్రమానికి ఆహ్వానపత్రాన్ని విడుదల చేశారు. ఈ నిర్ణయమే ఇప్పుడు అంతర్జాతీయ వార్తగా మారింది.
ఇండోనేషియా నేషనల్ పార్టీ వ్యవస్థాపకురాలైన సుక్మావతి సుకర్నోపుత్రి ఈ నెల 26న 70వ పడిలో పడుతున్నారు. అదే రోజున ఆమె హిందూ మతాన్ని అవలంబించబోతున్నారు. ఈ స్వీకరణ కోసం హిందూ సంప్రదాయం ప్రకారం సుధి వదానీ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉత్తర బాలిలోని తన దివంగత తండ్రి స్మారకార్థం నిర్మించిన భవంతిలో ఈ కార్యక్రమం జరగనుంది.
Also Read: ఇండోనేషియా జైలులో అగ్ని ప్రమాదం: 40 మంది మృతి,73 మందికి గాయాలు
సుక్మావతి సుకర్నో హిందూ మతాన్ని స్వీకరించే నిర్ణయం ఆమె నానమ్మ ఇదా అయు నోమన్ రాయి శ్రింబెన్ ద్వారా ప్రేరేపితమైనట్టు తెలిసింది. ఈ విషయాన్ని సుక్మావతి సుకర్నో లాయర్ వితర్యోనో రెసోప్రజ విలేకరులతో తెలిపారు. బాలిలో ఉత్కృష్టమైన వ్యక్తిగా జీవించిన ఇదా నోమన్ ద్వారానే సుక్మావతి సుకర్నో ప్రేరేపితులై హిందూ మతం ఆచరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు వివరించారు.
సుక్మావతి హిందూ పురాణాలపై మంచి పట్టు ఉన్నదని, హిందూ మతానికి చెందిన ఎన్నో గ్రంథాలను ఆమె అవపోసాన పట్టారని లాయర్ వివరించారు. ఆమె సుదీర్ఘంగా ఆలోచించిన తర్వాత హిందూ మతాన్ని స్వీకరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. ఈ నిర్ణయానికి ఆమె సోదరులు, సహోదరి, ఆమె సంతానమూ సమ్మతించారని పేర్కొన్నారు.