అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం.. ప్రముఖ ర్యాపర్ యంగ్ డాల్ఫ్ దుర్మరణం

By telugu teamFirst Published Nov 18, 2021, 1:30 PM IST
Highlights

అమెరికాలో మరో సారి కాల్పులు కలకలం రేపాయి. ఈ సారి టెన్నెస్సీలోని మెంఫీస్ పట్టణంలో కాల్పులు జరిగాయి. ఇందులో ప్రముఖ ర్యాపర్ యంగ్ డాల్ఫ్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో టెన్నెస్సీ మొత్తం విషాద చాయలు అలుముకున్నాయి. కాల్పులు జరిపిన వ్యక్తి గురించి ఇప్పటి వరకు తమ దగ్గర సమాచారం లేదని పోలీసులు వెల్లడించారు. 2008లో ర్యాపర్‌గా కెరీర్ ఎంచుకున్న డాల్ఫ్ అనతి కాలంలోనే విశేష ప్రజాదరణ చూరగొన్నాడు.
 

వాషింగ్టన్: Americaలో తుపాకీ సంస్కృతిపై కొన్నేళ్లుగా చర్చ జరుగుతూనే ఉన్నది. దానిపై కఠిన చర్యలు వచ్చిందీ లేదు.. ప్రజలపై కాల్పులు ఆగిందీ లేదు. తరుచుగా ఏదో ఓ చోట తుపాకీ పేలుతూనే ఉన్నది. తాజాగా, ప్రముఖ Rapper Young Dolph లక్ష్యంగా ఓ గన్ పేలింది. టెన్నెస్సీలోని మెంఫిస్‌లో చోటుచేసుకున్న తుపాకీ కాల్పుల్లో 36 ఏళ్ల యంగ్ డాల్ఫ్ దుర్మరణం చెందారు. మెంఫిస్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఓ కుకీ షాప్‌లో కాల్పులు జరిగాయి.

యంగ్ డాల్ఫ్ Tennesseలోని సొంత పట్టణం మెంఫిస్‌కు వచ్చాడు. ఇక్కడ ఆయన బంధువురాలు ఒకరికి క్యాన్సర్ సోకడంతో ఆమెను పరామర్శించడానికి సోమవారం మెంఫిస్ పట్టణానికి వచ్చాడు అని సోదరి మరేనో మైర్స్ తెలిపింది. ఈ వారం మొదట్లోనూ ఆయన కుకీ షాప్‌నకు వెళ్లాడని ఆమె వివరించింది. ఈ రోజు కూడా ఆయన కుకీ షాప్‌లోపల ఉండగానే ఓ దుండగుడు షాప్‌లోకి వెళ్లి ర్యాపర్ యంగ్ డాల్ఫ్‌ను చంపేసినట్టు పేర్కొంది.

Also Read: ఆ యూనివర్సిటీలో కాల్పులు.. 8 మంది మృతి... బిల్డింగ్ కిటికీల్లోంచి కిందకు దూకిన విద్యార్థులు

మెంఫిస్ పట్టణానికి వచ్చినప్పుడు ర్యాపర్ యంగ్ డాల్ఫ్ ఆ కుకీ షాప్‌నకు వెళ్లుతున్నాడు. ఆ కుకీ షాప్ ర్యాపర్ యంగ్ డాల్ఫ్ ఆధారంగా ప్రచారం చేసుకోవాలనీ భావించింది. అందుకే మెంఫిస్ వచ్చినప్పుడల్లా ర్యాపర్ యంగ్ డాల్ఫ్ తమ కుకీస్ షాప్‌నకు వస్తుంటాడని గత వారమే ఆ షాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో పోస్టు చేసింది. 

కాగా, ఈ ఘటన అనంతరం మెంఫిస్ పోలీసు డైరెక్టర్ డేవిస్ విలేకరులతో మాట్లాడారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఎవరూ ఇంటి నుంచి బయట అడుగు పెట్టవద్దని సూచనలు చేశారు. అవసరమైతే పరిస్థితులను బట్టి కర్ఫ్యూ విధించడానికి వెనుకాడబోమని వివరించారు. కాగా, కాల్పులకు పాల్పడిన వ్యక్తికి సంబంధించి తమ దగ్గర ఎలాంటి సమాచారమూ లేదని పోలీసులు ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Also Read: ఇంట్లోంచి పొమ్మన్నందుకు...తల్లీదండ్రులు సహా ఐదుగురిని కాల్చేసిన కొడుకు

చికాగోలో జన్మించిన యంగ్ డాల్ఫ్ అసలు పేరు అడాల్ఫ్ థోర్న్‌టన్. 2008 నుంచి ర్యాపర్‌గా కెరీర్ ప్రారంభించాడు. అనతి కాలంలోనే విశేష ఆదరణ సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా హిప్ హాప్ కమ్యూనిటీలో ఆయనకు మంచి పేరుంది. పేపర్ రూట్ క్యాంపెయిన్, కింగ్ ఆఫ్ మెంఫిస్, రిచ్ స్లేవ్ వంటి ఆల్బమ్స్ ప్రజాదరణ పొందాయి. ఇందులో గతేడాది ఆయన రూపొందించిన రిచ్ స్లేవ్ ఆల్బమ్ బిల్‌బోర్డు 200లో నెంబర్ 4 ర్యాంక్ సంపాదించుకుంది. బిల్‌బోర్డు 200లో టాప్ టెన్ ర్యాంకుల్లో యంగ్ డాల్ఫ్ ఆల్బమ్‌లు మూడు ఉన్నాయి.

యంగ్ డాల్ఫ్ తన మ్యూజిక్‌లో డ్రగ్ డీలర్ లైఫ్‌ను చిత్రించారు. అంతేకాదు, మెంఫిస్ పట్టణంలో వీధుల్లో గడిపే జీవితాల పైనా మ్యూజిక్ చేశాడు. ఇటీవలే ఆయన యూనివర్సిటీ ఆఫ్ మెంఫిస్‌లో ఓ కాన్సర్ట్ ప్రదర్శన ఇచ్చారు. 

click me!