
మాస్కో: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి చర్చల ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీల మద్దతు లభించింది. యుద్ధానికి ముగింపు పలకాలనే పుతిన్ పిలుపును జెలెన్స్కీ స్వాగతించారు. గురువారం ఇస్తాంబుల్‌లో ప్రత్యక్ష చర్చలకు అంగీకరించారు. ట్రంప్ కోరిక మేరకే పుతిన్ ఆహ్వానాన్ని జెలెన్స్కీ అంగీకరించినట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్‌తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ ప్రకటించారు. ముందస్తు షరతులు లేకుండా ప్రత్యక్ష శాంతి చర్చలకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉండాలని పుతిన్ పిలుపునిచ్చారు. దీంతో ఈ ప్రాంతంలో శాంతి నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పుతిన్ ప్రతిపాదనను స్వాగతిస్తూనే, ఏ యుద్ధానికైనా ముగింపు పలకాలంటే మొదట కాల్పుల విరమణ అవసరమని, దీనికి రష్యా సిద్ధంగా ఉండాలని జెలెన్స్కీ అన్నారు. రష్యా త్వరలోనే పూర్తిస్థాయి, దీర్ఘకాలిక, విశ్వసనీయమైన కాల్పుల విరమణ ప్రకటిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.