యుద్ధ సమయంలో దేశ రక్షణ మంత్రి మాటలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కానీ పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాటలు విని ప్రపంచమంతా నవ్వుకుంటోంది.దీంతో ఆయన్ని తీసిపారేయాలని డిమాండ్లు వస్తున్నాయి.
భారత్ చేస్తున్న దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో సైన్యం ఏం చేస్తుందో తెలియనట్టు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతున్నారు. పాక్ పార్లమెంటులో కూడా అబద్ధాలు చెప్పడానికి ఆయన ఏ మాత్రం వెనుకాడుట లేదు.దీంతో ఆయన మాటలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. పాక్ సైన్యం, ప్రభుత్వం మధ్య దూరం పెరుగుతున్నట్టు ఆయన మాటలను బట్టి తెలిసిపోతుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ సైన్యం ఐదు ఇండియన్ యుద్ధ విమానాలను కూల్చివేసిందని సోషల్ మీడియాలో చూశానని ఆయన చెప్పడం వివాదాస్పదమైంది. ఇండియా డ్రోన్లు పాకిస్తాన్ వైమానిక స్థావరాలను గుర్తించడానికి వచ్చాయని, కానీ ఆ స్థానాలు బయటపడకూడదని పాక్ సైన్యం వాటిని కూల్చివేయలేదని పార్లమెంటులో చెప్పారు. ఆయన మాటల వల్ల పాకిస్తాన్ అంతర్జాతీయంగా అవమానం పాలవుతోంది. సోషల్ మీడియాలో ట్రోల్స్ కు కారణం అవుతోంది.
మద్రాసా విద్యార్థులు తమ రెండో రక్షణ వలయం అని ఆయన చెప్పడం మరో వివాదం. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని మద్రాసాలలో ఉగ్రవాద శిక్షణ ఇస్తున్నారని ఇండియా చాలా కాలంగా చెబుతోంది. ఖ్వాజా ఆసిఫ్ మాటలతో ఇండియా మాట నిజమైందని నెటిజన్లు అంటున్నారు.ఏప్రిల్ లో ఓ టీవీ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ ఉగ్రవాదులకు సహాయం చేస్తుందని ఖ్వాజా ఒప్పుకున్నారు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల కోసం ఉగ్రవాద సంస్థలకు సహాయం చేస్తున్నామని చెప్పడం వివాదాస్పదమైంది. 'గత మూడు దశాబ్దాలుగా అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలకు ఈ నీచమైన పని చేస్తున్నాం' అని అప్పుడు అన్నారు.
2023లో ఆయన చేసిన మరో వివాదాస్పద వ్యాఖ్యను కూడా నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. 'స్త్రీలు లింగ సమానత్వం కోరుకుంటున్నారు కాబట్టి పురుషుల్లాగే వారు కూడా అసభ్య వ్యాఖ్యలు ఎదుర్కోవాలి' అని అన్నారు. ఇండియా-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆయన మాటలు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఆయన్ని రక్షణ మంత్రి పదవి నుంచి తొలగించాలని పాక్ సోషల్ మీడియా డిమాండ్ చేస్తోంది. దేశ గౌరవాన్ని కాపాడే, బాధ్యతగా వ్యవహరించే వ్యక్తి ఆ పదవిలో ఉండాలని నెటిజన్లు అంటున్నారు. ప్రజాస్వామ్య దేశం అయినా పాక్ ప్రభుత్వానికి సైన్యంపై పెద్దగా అదుపు లేదు. పాక్ సైన్యం, ఇండియాపై దాడి చేసే ఉగ్రవాదుల మధ్య సంబంధాలున్నాయని ఇండియా చాలాసార్లు చెప్పింది.