దాయాది దేశంలో పాకిస్తాన్ తాలిబాన్ ఆత్మాహుతి దాడి.. ఖండించిన పాక్ పీఎం ఇమ్రాన్ ఖాన్

By telugu teamFirst Published Sep 5, 2021, 6:51 PM IST
Highlights

దాయాది దేశంలో పాకిస్తాన్ తాలిబాన్ ఆత్మహుతి దాడికి పాల్పడింది. పాకిస్తాన్ ఆర్మీ లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ దాడిలో ముగ్గురు పారామిలిటరీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది ఈ దాడిలో గాయపడినట్టు సమాచారం. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని సీనియర్ మిలిటరీ అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా, పాకిస్తాన్ తాలిబాన్ దుశ్చర్యను ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు.
 

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇందులో ముగ్గురు పాక్ జవాన్లు మృతి చెందినట్టు సమాచారం. కాగా, సుమారు 20 మంది గాయపడినట్టు తెలిసింది. బలోచిస్తాన్ ప్రావిన్స్‌లోని క్వెట్టా నగర సమీపంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. పాకిస్తాన్ తాలిబాన్లు ఈ దాడికి బాధ్యత వహిస్తున్నట్టు ప్రకటించారు.

దక్షిణ క్వెట్టాకు 15 కిలోమీటర్ల దూరంలో మాస్తుంగ్ రోడ్డు దగ్గర ఓ పారామిలిటరీ ఫ్రాంటియర్ కాప్స్ చెక్‌పాయింట్ దగ్గర ఓ ఉగ్రవాది బైక్‌పై వెళ్తూ తనను తాను పేల్చేసుకున్నాడు. ఆరు కిలోల పేలుడ పదార్థాలను మోసుకెళ్తూ అక్కడే ఉన్న కాన్వాయ్‌లోని వాహనంపైకి దూసుకెళ్లాడు. ఆ వాహనాన్ని ఢీకొట్టి తనను పేల్చేసుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్టు తెలిసింది. అంతేకాదు, ఈ మరణాల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్టు సీనియర్ పోలీసు అధికారి అజహర్ అక్రమ్ ఆదివారం వివరించారు. ఎందుకంటే క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు పేర్కొన్నారు.

ఈ దాడిని పాకిస్తాన్ తాలిబాన్(టీటీపీ) చేసినట్టు వెల్లడించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్ సంస్థ వేరు. ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి చేపట్టిన తర్వాత తొలిసారిగా పాకిస్తాన్ తాలిబాన్లు ఓ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేశారు.

కాగా, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ టీటీపీ చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో మరణించిన అమరులకు సెల్యూట్ అని ట్వీట్ చేశారు. విదేశీ అండతో ఉగ్రదాడులకు పాల్పడుతున్న మూకలను అడ్డుకుంటూ ప్రాణాలు వదిలిన వారికి నివాళులు ప్రకటించారు.

బలోచిస్తాన్ ప్రావిన్స్‌లో చాన్నాళ్ల నుంచి పాకిస్తాన్ నుంచి వేరుపడాలనే ఉద్యమాలు బలంగా సాగుతున్నాయి. ఇందులో నుంచే బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్‌లు ఉనికిలోకి వచ్చాయి. ఈ వేర్పాటువాద గ్రూపులు 20 ఏళ్లుగా పలుసార్లు పాకిస్తాన్ దళాలను లక్ష్యం చేసుకుంటూ దాడులకు పాల్పడ్డాయి. కానీ, తాజాగా టీటీపీ పాకిస్తాన్ ఆర్మీపై ఆత్మాహుతి దాడి చేసింది.

click me!