Taliban: అఫ్ఘాన్ బ్యాంకుల ముందు కిక్కిరిసన జనం.. విత్‌డ్రాపైనా లిమిట్.. డబ్బుల్లేక సతమతం

By telugu teamFirst Published Sep 4, 2021, 8:28 PM IST
Highlights

ఆఫ్ఘనిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ పతనం అంచులకు చేరుకుంది. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశన్నంటడం, జీతాలు పెండింగ్‌లో ఉండటం, నగదు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు బ్యాంకుల ముందు కిక్కిరుస్తున్నారు. కాగా, బ్యాంకు అధికారులూ నగదు ఉపసంహరణపై 20వేల అఫ్ఘానీ పరిమితి పెట్టారు. ఓ బ్యాంకు ముందు కిక్కిరిసన జనాలను ఈ చిత్రంలో చూడవచ్చు.

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో మళ్లీ తాలిబాన్ల శకం ప్రారంభమవుతున్నది. తాలిబాన్లు దేశాన్ని స్వాధీనం చేసుకునే వరకూ అన్ని సంస్థల సేవలపై అనిశ్చితి కొనసాగింది. విమానాశ్రయాలను మూసేశారు. బ్యాంకులు సహా మరెన్నో కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. తాజాగా, మళ్లీ అవి మెల్లమెల్లగా తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్యాంకుల ముందు ప్రజలు కిక్కిరిశారు. నెల క్రితం వరకూ బ్యాంకుల ముందు ప్రజలు ఎంతో దూరం బారులు తీసేవారు. ఇప్పుడు పరిస్థితులు మరింత దిగజారాయి. బ్యాంకుల ముందు ఇసుకేస్తే రాలనంత జనాలు పోగయ్యారు.

ప్రస్తుతం ఆ బ్యాంకుల్లో ఒకరికి 20 వేల అఫ్ఘానీలకు మించి డబ్బు ఇవ్వడం లేదు. బ్యాంకు అధికారులు రోజువారీ పరిమితిగా 20వేల అఫ్ఘానీలను పాటిస్తున్నారు. దీంతో అక్కడి ప్రజలకు నిత్యం బ్యాంకుల ముందు కొలువుదీరే పరిస్థితులు దాపురించాయి. కొందరి జీతాలు రాక నెలలు గడుస్తుంటే వారాలవారీగా వచ్చేవారి జీతాలూ పెండింగ్‌లోనే ఉండిపోయాయి. దేశంలోని సంకటపరిస్థితుల్లో సొంత డబ్బులు తీసుకోవడానికి శక్తియుక్తులన్నింటినీ కూడగట్టుకోవాల్సిన దుస్థితికి పౌరులు దిగజారిపోయారు.

ఆఫ్ఘనిస్తాన్ ఎక్కువగా నగదు ఆధారిత దేశం. ప్రజలు లావాదేవీలు చాలా వరకు నగదు రూపకంగానే జరుపుతుంటారు. దీనికి తోడు ఆఫ్ఘనిస్తాన్ ఆహారధాన్యాలు, ఇతర తిండిపదార్థాల కోసం విదేశాల నుంచి దిగుమతులపైనే ఆధారపడుతుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో 20ఏళ్లుగా తాలిబాన్ల పోరాటంలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అంచులకు చేరుకుంది. ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతున్నది. నిత్యావసర సరుకుల ధరలూ రోజు రోజుకూ మండిపోతున్నాయి. రోజువారీ జీవనంలో నగదు వారికి అత్యవసరం. ఈ నేపథ్యంలోనే బ్యాంకుల ముందు వారు సొంత డబ్బుల కోసమే అల్లాడిపోతున్నారు.

ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆరాటంలో ఉన్న తాలిబాన్‌కూ దేశంలోని ఆర్థిక సంక్షోభంపై అంచనాలున్నాయి. అందుకే అది అంతర్జాతీయ గుర్తింపు కోసం పాకులాడుతున్నది. అంతర్జాతీయ గుర్తింపు లభిస్తే విదేశీ ఆర్థిక సహాయం దేశానికి చేరుతుంది. తద్వారా ఆర్థిక పతనం నుంచి గట్టెక్కగలమని భావిస్తున్నది.

click me!