పంజ్‌షిర్ రెబల్స్ చేతిలో 700 మంది తాలిబాన్లు హతం? ట్విట్టర్‌లో వెల్లడించిన తిరుగుబాటుదారులు

By telugu teamFirst Published Sep 5, 2021, 1:33 PM IST
Highlights

పంజ్‌షిర్‌లో తాలిబాన్లకు, తిరుగుబాటుదారులకు మధ్య పోరాటం ఎడతెగకుండా జరుగుతూనే ఉన్నది. ఈ ప్రావిన్స్‌లో తమదే పైచేయి అని, మొత్తం ఏడు జిల్లాల్లో నాలుగు తమ నియంత్రణలోకి వచ్చాయని తాలిబాన్లు ప్రకటించుకున్నారు. కాగా, ఈ వాదనలను తిరుగుబాటుదారులు తోసిపుచ్చారు. తమ చేతిలో 700 మంది తాలిబాన్లు హతమయ్యారని, మరో 600 మందిని నిర్బంధించినట్టు పేర్కొన్నారు.
 

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్లకు లొంగని పంజ్‌షిర్‌ ప్రావిన్స్‌లో యుద్ధం కొనసాగుతున్నది. తాలిబాన్లపై చివరి వరకు పోరాడి మరణించిన గెరిల్లా కమాండర్ అహ్మద్ షా మసూద్, ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు అమృల్లా సలేహ్ నాయకత్వంలో తిరుగుబాటుదారులు తాలిబాన్లపై రాజీలేని పోరాటం చేస్తున్నారు. కొన్ని రోజులుగా పంజ్‌షిర్ ప్రావిన్స్‌ తుపాకీ తూటాల చప్పుళ్లతో దద్దరిల్లుతున్నది. ఒకవైపు పోరు జరుగుతుండగానే ఈ ప్రావిన్స్‌ తమ గుప్పిట్లోకి వచ్చిందని తాలిబాన్లు ప్రకటించారు. ఈ వాదనలను తిరుగుబాటుదారులు తిప్పికొట్టారు.

ఇప్పటికీ పంజ్‌షిర్‌లో తమదే పైచేయి అని తాలిబాన్లు చెబుతున్నారు. పంజ్‌షిర్ ప్రావిన్స్ రాజధాని బాజరాక్‌లోకి ఎంటర్ అయ్యామని గవర్నర్ కార్యాలయాన్ని పేల్చేశామని తాలిబాన్లు ప్రకటించారు. కానీ, నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ మాత్రం తాలిబాన్లను పంజ్‌షిర్ ప్రావిన్స్ సరిహద్దు కపిసా వరకు తరిమేశామని తెలిపింది. అంతేకాదు, తమ చేతిలో కనీసం 700 తాలిబాన్ సభ్యులు మరణించారని తిరుగుబాటుదళానికి చెందిన నార్తర్న్ అలయెన్స్ ట్వీట్ చేసింది.

 

Panjshir 📍10 minutes ago:
"More than 700 of them was killed, 600 captured & prisoned, the rest are trying to escape, we are in Frontline, everything was planned. We control the whole province. " pic.twitter.com/gsQr8tSGlH

— Northern Alliance 🇭🇺 (@NA2NRF)

తాము అనబా జిల్లాలోకి ప్రవేశించారని, దానికంటే ముందు షుతుల్ జిల్లాను హస్తగతం చేసుకున్నట్టు ఓ మీడియా సంస్థకు తాలిబాన్లు తెలిపారు. ఖింజ్, ఉనబా జిల్లాలనూ తమ అధీనంలోకి తెచ్చుకున్నట్టు తాలిబాన్ ప్రతినిధి బిలాల్ కరీమీ తెలిపారు. దీంతో పంజ్‌షిర్ ప్రావిన్స్‌లోని మొత్తం ఏడు జిల్లాల్లో నాలుగు తమ నియంత్రణలో ఉన్నాయని వివరించారు. అయితే, ఇరువర్గాల మధ్య పోరు ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు. 

కాగా, నేషనల్ రెసిస్టెన్స్ ఫ్రంట్ మాత్రం ఇందుకు విరుద్ధమైన వాదన చేస్తున్నది. ఖవాక్ పాస్ దగ్గర తాము వేలాది మంది తాలిబాన్లను చుట్టుముట్టామని తెలిపింది. దీంతో దష్తే రెవాక్ ఏరియాలో వాహనాలు, సామగ్రిని వదిలిపెట్టి పరుగులు తీశారని పేర్కొంది. అంతేకాదు, 700 కంటే ఎక్కువ మంది తాలిబాన్లు తమ చేతిలో మరణించారని, కనీసం 600 మందిని నిర్బంధించినట్టు నార్తర్న్ అలయెన్స్ ఓ ట్వీట్ చేసింది.

click me!