పండోరా పేపర్లు: అక్రమార్కుల జాబితాలో పాక్ మంత్రులు సహా 700 మంది.. పీఎం ఏమన్నాడంటే?

By telugu teamFirst Published Oct 4, 2021, 12:25 PM IST
Highlights

పేదరికంతో సతమతమయ్యే పాకిస్తాన్‌లో ఆ దేశ ప్రభుత్వం, మిలిటరీ పెద్దలు భారీగా సొమ్మును అక్రమమార్గాల్లో కూడబెట్టుకుంటున్నట్టు తెలిసింది. ఏకంగా ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్ మంత్రి, ఆయనకు సలహాదారుగా ఉన్న వ్యక్తి కొడుకు, ఆయనకు సన్నిహితంగా ఉన్న ఇతరులూ ఈ జాబితాలో ఉండటం సంచలనంగా మారింది. పాకిస్తాన్ నుంచి 700 మందికిపైగా పండోరాపత్రాల్లో ఉన్నారు.

న్యూఢిల్లీ: పేదరికంతో తల్లడిల్లే పాకిస్తాన్‌లోనూ ఉన్నతవర్గాలు, టాప్ పొజిషన్‌లోని మిలిటరీ, రాజకీయ నేతలు అక్రమ మార్గాల్లో తమ సంపదను కూడబెట్టుకుంటున్నట్టు పండోరా పత్రాలు వెల్లడించాయి. ఇందులో ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ క్యాబినెట్ మంత్రి సహా ఆయన సన్నిహితులూ ఉండటం సంచలనంగా మారింది. ఆయన పార్టీ పీటీఐకి అత్యధిక విరాళాలిచ్చిన వ్యక్తి పేరు సహా మొత్తం 700 మందికిపైగానే ఈ జాబితాలో ఉన్నాయి.

ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి షౌకత్ ఫయాజ్ అహ్మద్ తరిన్, ఆయన కుటుంబీకులు, ఇమ్రాన్ ఖాన్‌కు ఫైనాన్స్ రెవెన్యూ సలహాదారుగా పనిచేసిన వాకర్ మసూద్ ఖాన్ కొడుకులూ పండోరా పేపర్లలో ఉన్నారు. పరిశ్రమల శాఖ మంత్రి మఖ్దుం ఖుస్రో సోదరుడు ఒమర్ బఖ్తర్, ఇమ్రాన్ క్యాబినెట్‌లో విధులు నిర్వర్తించిన మాజీ మంత్రి ఫైజల్ వావ్దాల పేర్లూ వెలికి వచ్చాయి.పీటీఐకి అత్యధిక విరాళాలిచ్చిన అరీఫ్ నఖ్వి ప్రస్తుతం అమెరికాలో ఫ్రాడ్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆయన పేరు కూడా ఈ పత్రాల్లో వెలికి వచ్చింది. పాకిస్తాన్ ప్రభుత్వంలోని పెద్దలు, మిలిటరీ లీడర్లు ట్యాక్స్ ఎగ్గొట్టి భారీగా సొమ్ము కూడబెట్టుకున్నట్టు తెలిసింది. వీరు మిలియన్ డాలర్ల విలువైన విదేశీ డొల్ల కంపెనీలు, ట్రస్టులను కలిగి ఉన్నట్టు వెల్లడైంది.

పనామా పత్రాల్లో షరీఫ్ ప్రభుత్వంలోని పెద్దల అవినీతి బట్టబయలు కాగానే ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. షరీఫ్ ప్రభుత్వం కూలిపోయి ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం రావడానికి పనామా పత్రాలు కీలక భూమిక పోషించాయి.

పండోరా పత్రాల్లో పాకిస్తాన్ పౌరుల పేర్లపై ఆ దేశ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ‘పండోరా పత్రాలు పేర్కొన్న మా దేశ పౌరులందరిపైనా దర్యాప్తు చేపడుతాం. ఏదైనా అక్రమాల్లో వారి ప్రమేయమున్నట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటాం. పర్యావరణ మార్పుల నివారణకు తీసుకున్నట్టే ఈ అంశంపైనా అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలి. ఈస్టిండియా కంపెనీ భారత సంపదను కొల్లగొట్టినట్టు అభివృద్ధి చెందుతున్న దేశాల కులీనవర్గాలు దోచుకుంటున్నాయి. అభివృద్ధి చెందిన దేశాలు ఈ అవినీతిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకోకపోవడం బాధాకరం’ అని అన్నారు.

click me!