ఆయిల్ ట్యాంకర్ పేలి 92 మంది దుర్మరణం.. మరో 30 మంది పరిస్థితి విషమం

By telugu teamFirst Published Nov 6, 2021, 6:19 PM IST
Highlights

సియర్రా లియోన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్, మరో వ్యాన్ ఢీకొన్న ఘటనలో 92 మంది మరణించారు. మరో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నది. ఆయిల్ ట్యాంకర్ నుంచి లీక్ అయిన ఇంధనాన్ని సేకరించుకోవడానికి చాలా మంది వచ్చి చేరిన సమయంలో ఆ ట్యాంకర్ పేలింది. దీంతో అక్కడే ఉన్న చాలా మంది సజీవ దహనమయ్యారు. సియర్రా లియోన్‌ రాజధాని ఫ్రీటౌన్‌లో శుక్రవారం రాత్రి జరిగింది.
 

న్యూఢిల్లీ: ఆఫ్రికా దేశం సియర్రా లియోన్‌లో దుర్ఘటన జరిగింది. శుక్రవారం రాత్రి ఓ ఆయిల్ ట్యాంకర్, మరో వ్యాన్ ఢీకొన్నాయి. Oil Tanker నుంచి చమురు భారీగా లీక్ అయింది. స్థానికులు కొందరు ఈ ఇంధనాన్ని సేకరించడానికి గుమిగూడారు. అప్పుడు ఆ ఆయిల్ ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో చాలా మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 92 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. అంతేకాదు, కనీసం వంద మంది గాయాలపాలయ్యారు.

Sierra Leone రాజధాని Freetown సమీపంలోని వెల్లింగ్టన్ సబర్బన్‌లో ఈ ఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. భారీ శబ్దం వచ్చింది. స్థానికులు ఉలిక్కిపడి బయటకు వచ్చారు. ఓ వ్యాన్, ఆయిల్ ట్యాంకర్ ఢీకొని రోడ్డుపై ఉన్నట్టు గమనించారు. ఆ ఆయిల్ ట్యాంకర్ నుంచి చమురు కారుతున్నట్టూ గుర్తించారు. దీంతో చాలా మంది ఆ ఇంధనాన్ని సేకరించడానికి పరుగున వచ్చారు. అప్పుడే ఆయిల్ ట్యాంకర్ పేలిపోవడంతో భారీ ప్రాణ నష్టం జరిగింది.

కన్నాట్ హాస్పిటల్‌లోని మార్చురీకి శనివారం ఉదయానికల్లా 92 మృతదేహాలు వచ్చాయి. మరో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయని, వారు బతకడం చాలా కష్టమని హాస్పిటల్ సిబ్బంది ఫోదయ్ మూసా వివరించారు.

Also Read: స్కూటర్‌పై తీసుకెళ్తున్న క్రాకర్స్ పేలిపోయాయి.. తండ్రి, కొడుకు దుర్మరణం.. వీడియో వైరల్

కనీసం 100 మంది పలు హాస్పిటళ్లు, క్లినిక్‌లలో చికిత్స కోసం చేరారని ఆరోగ్య శాఖ ఉపమంత్రి అమరా జాంబయ్ వివరించారు.

ఈ ఘటనపై దేశాధ్యక్షుడు జూలియస్ మాద బయో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణపై నిర్వహిస్తున్న ఓ కార్యక్రమానికి హాజరు కావడానికి స్కాట్లాండ్ వెళ్లారు. ప్రస్తుతం స్కాట్లాండ్‌లోనే ఉన్నారు. అక్కడి నుంచే ఈ ఘటనపై స్పందించారు. ఈ స్థాయిలో ప్రాణ నష్టం కలవరపెడుతున్నదని పేర్కొన్నారు. ఆప్తులను కోల్పోయిన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అని తెలిపారు.

ఉపాధ్యక్షుడు మొహమ్మద్ జుల్దేమ్ జల్లో రాత్రికి రాత్రే రెండు హాస్పిటళ్లలను సందర్శించారు. బాధితులను పరామర్శించారు. సియర్రా లియోన్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ, ఇతరులు నిర్విరామంగా సహాయక చర్యలు చేస్తున్నారని, ఇంకా చేస్తారని వివరించారు. ఈ జాతీయ విపత్తుతో దేశం తల్లడిల్లుతున్నదని అన్నారు. ఇది దేశానికే క్లిష్టమైన సమయమని చెప్పారు.

Also Read: ఆఫ్ఘనిస్తాన్: షియాలే టార్గెట్ , మసీదులో బాంబు పేలుళ్లు.. భారీగా మృతులు..?

సబ్ సహారన్ ఆఫ్రికన్ దేశాల్లో ట్యాకర్ ట్రక్స్ ఢీకొట్టుకున్న ఘటనలు ఇంతకు ముందూ చోటుచేసుకున్నాయి. ఆయిల్ ట్యాంకర్‌కు యాక్సిడెంట్ అయినప్పుడు ఇలాగే ఇంధనాన్ని సేకరించుకోవడానికి పదులు, వందల సంఖ్యలో ప్రజలు చేరడం, తర్వాత ఆ ఆయిల్ ట్యాంకర్ పేలిపోవడం జరిగాయి. ఆ ఘటనల్లోనూ వందలాది మంది ప్రాణాలు కోల్పోయిన దాఖలాలు చాలా ఉన్నాయి. ఇలాంటి ఘటనే 2019లో టాంజానియాలో జరిగింది. ట్యాంకర్ పేలి 85 మంది మరణించారు. 2018లో ఇలాంటి ఘటనలోనే కాంగోలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు.

సియర్రా లియోన్‌లో జరిగిన ఈ ఘటన ప్రపంచ దేశాలను కదిలించింది. ఇంతటి ప్రాణ నష్టంపై చాలా మంది ఆవేదన వ్యక్తం చేశారు.

click me!