Omicron: గుడ్ న్యూస్.. ఇప్పటి వరకు ఒమిక్రాన్ మరణాలు లేవు: ప్రపంచ ఆరోగ్య సంస్థ

By Pratap Reddy KasulaFirst Published Dec 3, 2021, 7:18 PM IST
Highlights

ఒమిక్రాన్ వేరియంట్‌తో ప్రపంచ దేశాలన్నీ ఆందోళనలో మునిగిన తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక విషయాలు వెల్లడించింది. ఇప్పటి వరకు ప్రపంచంలో ఒమిక్రాన్ వేరియంట్‌తో మరణించిన దాఖలాలు లేవని స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని అర్థమవుతున్నదని వివరించింది. కాగా, ఇప్పటికీ ప్రమాదకరమైన వేరియంట్‌గా ఇంకా డెల్టానే ఉన్నదని, కాబట్టి, ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

న్యూఢిల్లీ: కరోనా వైరస్(Corona Virus) ఒమిక్రాన్ వేరియంట్‌(Omicron Variant)తో ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికి 30కి పైగా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు (Cases) నమోదయ్యాయి. దాని లక్షణాలు, తీవ్రత, సంక్రమణ వేగం వంటి అంశాలపై ఇంకా సమగ్ర విషయాలు వెల్లడి కాకపోవడంతో ఈ ఆందోళనలు మరింత అధికం అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఈ రోజు కీలక విషయాన్ని వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఇప్పటి వరకు ఒక్క మరణం కూడా సంభవించలేదని తెలిపింది. ఒమిక్రాన్ వ్యాప్తిస్తున్న దేశాల జాబితా పెరుగుతూనే ఉన్నది. కానీ, ఈ వేరియంట్ కారణంగా ఇప్పటి వరకు ఒక్కరూ మరణించినట్టు తమకు రిపోర్టులు రాలేవని వెల్లడించింది. ఒమిక్రాన్ వేరియంట్ గురించిన సమాచారాన్ని ఆ వేరియంట్ వ్యాప్తి చెందిన దేశాలన్నింటి నుంచి సేకరిస్తున్నట్టు ఆ సంస్థ వివరించింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పోక్స్‌మన్ క్రిస్టియన్ లిండ్‌మెయిర్ ఈ రోజు జెనీవాలో విలేకరులతో మాట్లాడారు. కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మరణించినట్టు తాను ఒక్క రిపోర్టునూ ఇప్పటి వరకు చూడలేదని ఆయన అన్నారు. ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్లో ఆందోళనలు కలిగిస్తున్నదని తెలిపారు. అయితే, 60 రోజుల నుంచి అందిన సమాచారం ప్రకారం 99.8శాతం జీనోమ్ సీక్వెన్స్ వివరాలు కేవలం డెల్టా వేరియంట్ కేసులనే వెల్లడించాయని అన్నారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండవచ్చనని, వేగంగా ఇప్పుడు ఒక దేశం నుంచి మరొక దేశానికి వ్యాప్తి చెందుతూ ఉండవచ్చునని తెలిపారు. ఒక దశలో ఇప్పుడు ప్రబలంగా ఉన్న వేరియంట్‌నూ దాటి పోవచ్చునని అన్నారు. కానీ, ఇప్పుడైతే అధిక తీవ్రత, ప్రభావం చూపిస్తున్న వేరియంట్ మాత్రం డెల్టానే అని వెల్లడించారు.

Also Read: ఒమిక్రాన్ వేరియంట్‌.. కేంద్రం కీల‌క వ్యాఖ్య‌లు

రెండు వారాల ముందు ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షలను ఆయన పేర్కొన్నారు. కొన్ని దేశాలు మొత్తం తమ ఆర్థిక కార్యకలాపాలను మూసేసుకున్నాయని అన్నారు. మరికొన్ని దేశాల్లో చాలా చోట్ల లాక్‌డౌన్‌లు విధించాయని, యూరప్‌లోని కొన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ మార్కెట్‌లనూ మూసేశారని తెలిపారు. అయితే, ఈ ఆంక్షలు అన్ని కూడా ఒమిక్రాన్ వేరియంట్ రాకకు ముందేనని వివరించారు. ఎందుకంటే డెల్టా కేసులు పెరుగుతున్నందున ఈ ఆంక్షలు విధించారని చెప్పారు. కాబట్టి, ఈ విషయాన్ని మరిచిపోవద్దని తెలిపారు.

Also Read: Omicron : హైదరాబాద్‌‌కు అలెర్ట్.. విదేశాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా పాజిటివ్

ఒమిక్రాన్ గురించిన పూర్తి సమాచారం రావడానికి మరికొన్ని వారాల వ్యవధి పట్టవచ్చునని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి క్రిస్టియన్ లిండ్‌మెయిర్ తెలిపారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాపించే శక్తి ఏ మేరకు కలిగి ఉన్నదో.. దాని తీవ్రతలను, ఒమిక్రాన్‌పై ప్రస్తుతం అందబాటులో ఉన్న టీకాల శక్తి, దాన్ని టెస్టులు, చికిత్సలపై అంచనా రావడానికి ఇంకా సమయం పడుతుందని అన్నారు. ఇప్పటి వరకు ఒమిక్రాన్ సోకిన దేశాల నుంచి భిన్నమైన ముక్కులుగా సమాచారం వస్తున్నదని, వీటన్నింటిపై సమగ్రంగా అధ్యయనం చేసి, అవలంభించాల్సిన పద్ధతులపై నిపుణులు ఒక అభిప్రాయానికి రావల్సి ఉంటుందని వివరించారు. ఇప్పటి వరకు ఉన్న ప్రాథమిక సమాచారం ఏం చెబుతున్నదంటే ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తుందని పేర్కొంటున్నదని తెలిపారు.

click me!