
Pakistan PM Imran Khan: పాకిస్థాన్ లో రాజకీయాలు, అక్కడి పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ప్రాణాలకు ముప్పు ఉందని విశ్వసనీయ సమాచారం ఉందనీ, అయితే తాను భయపడేది లేదని, స్వతంత్ర మరియు ప్రజాస్వామ్య పాకిస్థాన్ కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తానని ఇమ్రాన్ ఖాన్ స్పష్టం చేశారు. తనకు వ్యతిరేకంగా జాతీయ అసెంబ్లీలో ఆదివారం అవిశ్వాస తీర్మానానికి ముందు ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శక్తివంతమైన మిలిటరీ తనకు మూడు ఎంపికలను ఇచ్చిందని చెప్పిన ఇమ్రాన్ ఖాన్.. తన ముందు అవిశ్వాసం తీర్మానం, ముందస్తు ఎన్నికలు, ప్రధానమంత్రి పదవికి రాజీనామా అనే ఆప్షన్లు ఉన్నాయని తెలిపారు. ప్రతిపక్షాలు సైతం ఆ విదేశీ శక్తులతో చేతులు కలిపాయని ఆరోపించారు.
"నా జీవితం కూడా ప్రమాదంలో ఉందని నా దేశ ప్రజలకు తెలియజేస్తున్నాను. వారు నా ప్రాణాలు తీయడానికి కూడా ప్లాన్ చేశారు. నేనే కాదు నా భార్య ప్రాణాలు కూడా ప్రమాదంలో ఉన్నాయి" అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ప్రతిపక్షాలు తనకు ఎలాంటి ఆప్షన్లు ఇచ్చాయనే ప్రశ్నకు సమాధానంగా.. ప్రతిపక్ష నాయకుడు షెహబాజ్ షరీఫ్ వంటి వారితో మాట్లాడాలని తాను అనుకోవడం లేదని తెలిపారు. "మనం బతికి ఉంటే (అవిశ్వాసం), ఈ టర్న్‌కోట్‌లతో (పిటిఐని విడిచిపెట్టి ప్రతిపక్షంలో చేరిన వారు) కలిసి పని చేయలేము, ముందస్తు ఎన్నికలే ఉత్తమ ఎంపిక, నాకు సాధారణ మెజారిటీ ఇవ్వాలని నేను నా దేశాన్ని కోరతాను. నేను రాజీ పడాల్సిన అవసరం లేదు”అని చెప్పాడు.
ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానాన్ని కుట్రగా పేర్కొంటూ, గత ఏడాది ఆగస్టు నుంచి తనకు దాని గురించి తెలుసని, కొంతమంది ప్రతిపక్ష నేతలు రాయబార కార్యాలయాలను సందర్శిస్తున్నట్లు తన వద్ద నివేదికలు ఉన్నాయని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. హుస్సేన్ హక్కానీ వంటి వ్యక్తులు లండన్‌లో నవాజ్ షరీఫ్‌ను కలుస్తున్నారని పేర్కొన్నారు. మార్చి 31న దేశాన్ని ఉద్దేశించి తన ప్రసంగంలో ఒక విదేశీ దేశం తన ప్రీమియర్‌షిప్‌పై అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా, అవిశ్వాస తీర్మానం ద్వారా ఆయనను తొలగించాలని డిమాండ్ చేసిన విషయాన్ని పునరుద్ఘాటించారు. తన స్వతంత్ర విదేశాంగ విధానానికి విదేశీ దేశం (అమెరికా) అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలిపారు.
పాలన మార్పును డిమాండ్ చేయడమే కాకుండా, తనను ప్రధాని పదవి నుండి తొలగించాలని స్పష్టంగా పేర్కొన్నట్లు మిస్టర్ ఖాన్ అన్నారు. ఈ క్రమంలోనే తనను పదవీచ్యుతుడ్ని చేసే కుట్రలో అమెరికా పాత్ర కూడా ఉందని బాంబు పేల్చారు. తనను అధికారం నుంచి దింపేందుకు జో బైడెన్ నేతృత్వంలోని అమెరికా పాలకులు ప్రయత్నిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు, పాకిస్తాన్ సమాచార మంత్రి ఫవాద్ చౌదరి శుక్రవారం నాడు.. ప్రధాని ఖాన్‌పై ఆదివారం అవిశ్వాస తీర్మానానికి ముందు.. ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేయడానికి కుట్ర జరిగిందని ఆ దేశ భద్రతా ఏజెన్సీలు నివేదించాయని పేర్కొన్నారు. ఈ నివేదికల తర్వాత ప్రభుత్వ నిర్ణయం మేరకు మిస్టర్ ఖాన్ భద్రతను పెంచినట్లు తెలిపారు.
ఇక ఇమ్రాన్‌ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానంలో అమెరికా ప్రమేయం ఉందన్న ఆరోపణలను తిప్పికొట్టేందుకే దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై పాకిస్థాన్‌కు ఎలాంటి లేఖను పంపలేదని అమెరికా తేల్చిచెప్పింది. ఇక ఇటీవల ఇమ్రాన్ ఖాన్ రష్యాలో పర్యటించారు. ఉక్రెయిన్ పై రష్యా దాడిని కొనసాగిస్తున్న క్రమంలో అమెరికా సహా చాలా దేశాలు దాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇమ్రాన్ ఖాన్ పర్యటన కూడా అమెరికాకు ఆగ్రహం తెప్పించిందనే వార్తాలు వినిపిస్తున్నాయి.