
Emergency in SriLanka: శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ దేశంలో అత్యవసర పరిస్థితి(Emergency)ని ప్రకటించారు. ఈ మేరకు ఏప్రిల్ 1 గెజిట్ విడుదల చేశారు. ఏప్రిల్ 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గెజిట్ లో పేర్కొన్నారు. శ్రీలంకలో పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజల ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో రాజపక్స ఈ నిర్ణయం తీసుకున్నారు.
గతంలో ఎన్నాడు లేని విధంగా.. శ్రీలంకలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. దీంతో ప్రభుత్వం నిర్వహించడంపై పౌరులలో తీవ్ర అసంతృప్తి పెరిగింది. త్ఫలితంగా శుక్రవారం తెల్లవారుజామున కొలంబోలోని పలు ప్రాంతాల్లో అధ్యక్షుడు రాజపక్సే నివాసం వెలుపల జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. దీంతో శ్రీలంక పోలీసులు రాత్రిపూట కర్ఫ్యూ విధించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 155 ప్రకారం.. అత్యవసర పరిస్థితి ప్రకటించే విచక్షణాధికారం రాష్ట్రపతికి ఉంది. ఈ ప్రకటనను కోర్టులలో సవాలు చేయలేరు. రాష్ట్రపతి జారీ చేసిన ప్రకటన ఒక నెలపాటు చెల్లుబాటు అవుతుంది. 14 రోజుల్లోగా పార్లమెంటు ఆమోదించాలి. ఆమోదించబడకపోతే, ప్రకటన గడువు ముగుస్తుంది.
ప్రస్తుతం శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం వల్ల గత కొన్ని రోజులుగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. శ్రీలంకలో రోజుకు 13 గంటలపాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలు.. ఆ దేశ అధ్యక్షుడి ఇంటి ముందు చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కారణమంటూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో 10 మందికి గాయాలయ్యాయి.
శ్రీలంక తన చరిత్రలోనే అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అక్కడ పెట్రోలు, డీజిల్ ముఖ్యమైన ఇంధనాలు అయిపోయాయి. విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదు. నిత్యావసర వస్తువులను దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం వద్ద డబ్బు లేదు. దీంతో దాదాపు అన్నింటి ధరలు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దీంతో శ్రీలంక అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ఏప్రిల్ 1 నుంచి దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తూ అసాధారణమైన గెజిట్‌ను విడుదల చేశారు.